శంషాబాద్ రూరల్, ఫిబ్రవరి 28: కోకాపేటలోని విశాఖ శారదాపీఠం భూములను బలవంతంగా ఖాళీ చేయిద్దామనుకున్న ప్రభుత్వం ఆ తర్వాత పీఠాన్ని క్షణాల్లోనే శంషాబాద్‌కు తరలించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తున్నది. ఇందుకు శంషాబాద్ తహసీల్దార్ రవీందర్దత్ మీడియాకు శనివారం తెలిపిన విషయాలే ఉదాహరణగా నిలుస్తున్నాయి. విశాఖ శారదా పీఠానికి శంషాబాద్‌లో ప్రభుత్వ భూమిని కేటాయించినట్టు శంషాబాద్ తహసీల్దార్ రవీందర్దత్ తెలిపారు. శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లో కోకాపేట్ నియోపోలీస్ సమీపంలో సర్వే నంబర్ 240లో విశాఖ శారద పీఠాన్ని దాదాపు రెండెకరాల్లో నిర్మించుకున్నట్టు తెలిపారు. ఆ భూమిని ప్రభుత్వం వివిధ అవసరాల కోసం తీసుకుందని, దానికి బదులుగా శంషాబాద్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 725/19లోని రెండెకరాల హెచ్ఎండీఏ స్థలాన్ని కేటాయించినట్టు చెప్పారు. వారికి ఆ భూమిని కూడా అప్పగించినట్టు తెలిపారు.