భూదాన్ పోచంపల్లి, ఆగస్టు 12 : పేదలకు సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకం తీసుకొచ్చింది. ఇండ్ల నిర్మాణం పూర్తయి పంపిణీకి సిద్ధంగా ఉన్నా.. పేదలకు కేటాయించడంలో కాంగ్రెస్ సరార్ నిర్లక్ష్యం చేస్తున్నది. గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉండగా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దాంతో పేదలకు ఇండ్లు అందని ద్రాక్షగా మారాయి.
ఈ క్రమంలో నిరుపయోగంగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మందు బాబులకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్న పరిస్థితి నెలకొంది. గత బీఆర్ఎస్ సరార్ ఒకో నియోజకవర్గానికి వెయ్యి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంజూరు చేసింది. ఇంటి నిర్మాణం కోసం గ్రామీణ ప్రాంతాల్లో రూ.5.04 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.5.40 లక్షలు ఖర్చు చేసింది. ఈ క్రమంలో భూదాన్ పోచంపల్లి పట్టణంలోని బసవ లింగేశ్వరస్వామి కాలనీలో రూ.6.04 కోట్లతో 120 ఇండ్లు, జిబ్లక్పల్లిలో రూ.1.81 కోట్లతో 36 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టింది.
ఇండ్ల కోసం భూదాన్ పోచంపల్లిలో 658 మంది, జిబ్లక్పల్లిలో 52 మంది పేదలు దరఖాస్తు చేసుకున్నారు. అర్హులను ఎంపిక చేసేందుకు జిబ్లక్పల్లిలో రెవెన్యూ అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామసభ నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేశారు. భూదాన్ పోచంపల్లిలో అర్హులను ఎంపిక చేయాల్సి ఉన్నది. ఇంతలో ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచినా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకం ఆశించిన మేరకు ముందుకు సాగడం లేదు.
నిర్మాణం పూర్తయి పంపిణీకి సిద్ధంగా ఉన్నా.. సర్కారు పట్టించుకోకపోవడంతో ఇండ్లు నిరుపయోగంగా ఉన్నాయి. ఇండ్ల చుట్టూ పిచ్చిమొక్కలు పెరుగగా.. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. గుర్తుతెలియని దుండగులు కిటికీ అద్దాలు పగులగొడుతున్నారు. పైపులు, వైర్లు చోరీ చేస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద స్తంభాలు నాటారు కానీ.. తీగలు లాగడం మరిచారు. సీసీ రోడ్డు ఏర్పాటు చేయలేదు. వసతులు కల్పించి అర్హులను గుర్తించి ఇండ్లు కేటాయించాలని పేదలు కోరుతున్నారు.