– రెండున్నరేళ్లుగా ఐలయ్య ఫొటోల ఫోజులకే పరిమితం
– ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి
రాజాపేట, మే 07 : ఆలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య రెండున్నరేళ్ల పాలనలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని, ప్రజా సమస్యలను పట్టించుకోకుండా కేవలం ఫొటోలకు ఆయన ఫోజులు ఇస్తూ కాలం గడుపుతున్నారని మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఆరోపించారు. గురువారం రాజాపేట మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నికల సమయంలో ప్రజలకు భారీ హామీలు ఇచ్చిన ఎమ్మెల్యే ఐలయ్య, వాటి అమలులో పూర్తిగా విఫలమయ్యారన్నారు. ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో కూడా లేకుండా పోయారన్నారు. రాజాపేట మండలానికి సాగునీరు అందించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం 15వ ప్యాకేజీ కింద కాల్వల పనులను సగం వరకు పూర్తి చేశామని తెలిపారు. మిగిలిన పనులను ఆరు నెలల్లో పూర్తి చేస్తానని ఐలయ్య హామీ ఇచ్చినా, రెండున్నరేళ్లు గడిచినా ఒక్క అడుగు ముందుకు పడలేదని మండిపడ్డారు.
సాగునీరు అందక పంటలు ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలపై ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై నెలరోజులు గడిచినా కేవలం 20 శాతం ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించకపోవడం, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించకపోవడం వల్ల రైతులు రోజుల తరబడి ధాన్యం అమ్ముకునేందుకు ఎదురుచూడాల్సి వస్తోందన్నారు. రైతుల పాలిట ఈ ప్రభుత్వం శాపంగా మారిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 300 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వారి కుటుంబాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతు భరోసా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని, మూడు విడతల రైతు భరోసా నిధులను విడుదల చేయకుండా మూడుసార్లు ఎగ్గొట్టిందన్నారు. రైతులు రాత్రింబవళ్లు ఎరువుల కోసం క్యూ లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
అలాగే ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సట్టు తిరుమలేష్, పీఏసీఎస్ చైర్మన్ చింతలపూరి భాస్కర్ రెడ్డి, మదర్ డైరీ డైరెక్టర్ సంధిళ్ల భాస్కర్ గౌడ్, గుంటి మధుసూదన్ రెడ్డి, చింతల పూరి వెంకట్రాంరెడ్డి, ఎర్ర గోగుల జశ్వంత్, ఎడ్ల నరేష్ రెడ్డి, సర్పంచులు చింతల సంపత్, బొడ్డు భాస్కర్, గోపిరెడ్డి, నరేష్ రెడ్డి, మోత్కుపల్లి బాలకృష్ణ, దగ్గుల విష్ణు పాల్గొన్నారు.