భువనగిరి కలెక్టరేట్, ఆగస్టు 25: పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుతూ ఓ కాంట్రాక్టర్ కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి భువనగిరి (Bhuvanagiri) కలెక్టరేట్ ముందు దీక్షకు దిగారు. భువనగిరి మండలంలోని హన్మాపురం గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యుడు నాగపురి కృష్ణ.. గత రెండేండ్లుగా తాను చేసిన పనులకు సంబంధించిన పెండింగ్లో ఉన్న రూ.42 లక్షలు విడుదల కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా లాభం లేకుండా పోయింది.
దీంతో సోమవారం ఉదయం తన భార్య, ఇద్దరు కుమారులతో కలిసి భువనగిరిలోని కలెక్టర్ కార్యాలయం ముందు టెంట్ వేసి దీక్షకు కూర్చున్నారు. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధతో కుటుంబం గడవని పరిస్థితి నెలకొందని, పెండింగ్ బిల్లులు విడుదల చేయకపోతే తనకు మరణమే శరణమని కంటనీరు పెట్టుకున్నారు. ప్రభుత్వం వెంటనే తనకు రావాల్సిన బిల్లులను విడుదల చేసి ఆదుకోవాలని కోరారు.