యాదగిరి గుట్ట, ఏప్రిల్ 05 : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ధనార్జనే ధ్యేయంగా పాలన సాగిస్తుందని ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. ఉగాది పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 60 మద్యం దుకాణాలను ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా మద్యాన్ని ఏరులై పారించేలా చేస్తూ, తద్వారా ఎక్సైజ్ ఆదాయం దండుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు దుయ్యబట్టారు. గ్రామ గ్రామాల్లో బెల్ట్ షాపులు తెరిచే ఉంటాయని ఎక్సైజ్ శాఖ అధికారులు బాహాటంగానే చెప్పడం దారుణమని ఆయన మండిపడ్డారు. శనివారం యాదగిరిగుట్ట పట్టణంలోని బీఅర్ఎస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ వివిధ మండలాధ్యక్షులు, యువజన విభాగం, విద్యార్ధి, సోషల్ మీడియా ముఖ్య నాయకులతో ఆయన సన్నాహక సమావేశం నిర్వహించారు. ”మళ్లీ కేసీఆర్ సర్కారే రావాలంటూ, ఈనెల 27న వరంగల్ లో జరిగే బీఅర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ యాదగిరిగుట్ట మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య అధ్వర్యంలో గజ్వేల్ నియోజక వర్గంలోని మర్కూక్ దేవస్థానం వరకు చేబట్టిన పాదయాత్రపై ఆయా నాయకుల అభిప్రాయాలు సేకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండ్రోజుల్లో పాదయాత్ర తేదీని ప్రకటిస్తామని తెలిపారు. పాదయాత్రలో సుమారు 1,000 మంది పాల్గొనే విధంగా చేపట్టాల్సిన విధివిధానాలను వివరించారు. ఒక్కో మండలంలో 200 నుంచి 250 మంది మించకుండా యవత, విద్యార్థి, సోషల్ మీడియా ప్రతినిధులు పాదయాత్రలో పాల్గొనాలన్నారు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవాలన్న ఉద్దేశ్యంతో బడ్జెట్లో 50 వేల కోట్లు ఎక్సైజ్ శాఖ నుంచి సేకరించుకోవాలని చెప్పి, బార్లను ప్రారంభించేందుకు సిద్దమైనట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఅర్ఎస్ పార్టీ వివిధ మండలాల అధ్యక్షులు కర్రె వెంకటయ్య, గంగుల శ్రీనివాస్, పోలగోని వెంకటేశ్ గౌడ్, పిన్నపునేని నరేందర్రెడ్డి, సట్టు తిరుమల్లేశ్, బొట్ల యాదయ్య, ఎండీ.ఖలీల్, దీసు చందర్ గౌడ్, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ బీకూనాయక్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్, వైస్ చైర్మన్ గ్యాదపాక నాగరాజు, బీఆర్ఎస్వీ జిల్లా కన్వీనర్ ప్రవీణ్ రెడ్డి, నియోజకవర్గ కన్వీనర్ ర్యాకల రమేశ్, సోషల్ మీడియా కన్వీనర్ నల్ల శ్రీకాంత్, వివిధ మండలాల యువజన విభాగం అధ్యక్షులు బీని కృష్ణంరాజు, ఎండీ ఆజ్జు, సందీళ్ల భాస్కర్ గౌడ్, పన్నాల నవీన్ రెడ్డి, ముక్కర్ల సతీశ్ యాదవ్, విద్యార్థి విభాగం నియోజకవర్గ కన్వీనర్ ఒగ్గు మల్లేశ్, మాజీ సర్పంచ్ కసావు శ్రీనివాస్ గౌడ్, నాయకులు మిట్ట వెంకటయ్య గౌడ్, కారాజీ రాజేశ్ యాదవ్, బాలరాజు పాల్గొన్నారు.