ఆలేరు టౌన్, సెప్టెంబర్ 04 : రైతులకు యూరియా సరఫరా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా నాయకుడు ఎం ఏ.ఇక్బాల్ అన్నారు. గురువారం ఆలేరు పట్టణంలోని పీఏసీఎస్ వద్ద యూరియా కోసం క్యూలైన్లలో నిలబడి ఇబ్బందులు పడుతున్న రైతులను సిపిఎం పట్టణ బృందం కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రైతులకు సరిపడా ఎరువులను అందించడంలో వ్యవసాయ శాఖ అధికారులు విఫలమైనట్లు తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆరుగాలం కష్టపడే రైతన్నలు వ్యవసాయ కార్యాలయం ముందు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. 450 బస్తాల యూరియా వస్తే 350 టోకెన్లే ఇచ్చినట్లు, క్యూ లైన్ను పరిశీలించగా 200 మంది రైతులే ఉన్నట్లు తెలిపారు.
రెండు, మూడు ఎకరాల పొలం వేసిన రైతులకు ఒకటీ, రెండు బస్తాల ఎరువులు ఏం సరిపోతాయని, వెంటనే ఉన్నతాధికారులు స్పందించి రైతుల అవసరాలకు తగ్గట్టుగా యూరియాను సరఫరా చేసి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మొరిగాడి రమేశ్, వడ్డేమాన్ బాలరాజు, రైతు సంఘం నాయకులు ఘనగాని మల్లేశ్, మోరిగాడి అశోక్, సైదాపురం, నరసింహులు, అంజయ్య పాల్గొన్నారు.
Aleru : ‘రైతులకు యూరియా సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం’