యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 02 : కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడాన్ని నిరసిస్తూ యాదగిరిగుట్ట పట్టణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ శ్రేణులు మంగళవారం దగ్ధం చేశారు. భారీ ర్యాలీ నిర్వహించి బస్టాండ్ ప్రాంగణంలో గల ప్రధాన రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులను పట్టించుకోకుండా డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతూ రాష్ట్రాన్ని విచ్చిన్నం చేసే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నారని విమర్శించారు. త్వరలో రేవంత్ రెడ్డికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, పిఎస్ఎల్ చైర్మన్ ఇమ్మడి రామిరెడ్డి, మాజీ చైర్మన్ గడ్డమీద రవీందర్ గౌడ్ పాల్గొన్నారు.