మోటకొండూర్, సెప్టెంబర్ 04 : రైతులకు యూరియా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సిపిఎం పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ సభ్యుడు బొలగాని జయరాములు అన్నారు. మోటకొండూరు మండల అగ్రికల్చర్ ఆఫీస్ ముందు సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వారం రోజులుగా పీఏసీఎస్ కేంద్రాల వద్ద యూరియా కోసం రైతులు క్యూలైన్లలో నిలబడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఒక రైతుకు ఒకటి, రెండు బస్తాలు మాత్రమే ఇవ్వడంతో పత్తి, వరి పంటలు సాగు చేయడంలో సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. అకాల వర్షాలకు ఇప్పటికే దెబ్బతిన్న పత్తి పంటలకు యూరియా అందకపోవడంతో రైతులు మరింత నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
రైతుల సంక్షేమం కోసం గొప్పలు చెప్పుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల అవసరాలు మాత్రం విస్మరిస్తున్నాయని ఎద్దేవా చేశారు. అనంతరం సిపిఎం నాయకులు ఏఈఓ సంధ్యారాణికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి కొల్లూరు ఆంజనేయులు, నాయకులు వడ్డెబోయిన మహేందర్, వంగపల్లి సాయిలు, కొల్లూరి నాగరాజు, రైతు నాయకులు రేగు ఐలయ్య, కొల్లూరి యాదయ్య, పల్లపు శ్రీకాంత్, వంగపల్లి మైసయ్య పాల్గొన్నారు.