ఆలేరు టౌన్, ఆగస్టు 12 : రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న కేంద్ర ఎన్నికల కమిషన్ బీజేపీకి అనుబంధంగా పనిచేస్తుందని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎంఏ ఇక్బాల్, మండల కార్యదర్శి దూపటి వెంకటేశ్ ఆరోపించారు. మంగళవారం ఆలేరు మండల కేంద్రంలో సిపిఎం పట్టణ మండల కమిటీల ఆధ్వర్యంలో బీహార్ లో కేంద్ర ఎన్నికల కమిషన్ అక్రమంగా లక్షలాది ఓట్లను తొలగించడాన్ని నిరసిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వతంత్ర వ్యవస్థగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారంలో ఉన్న బీజేపీకి అనుబంధ సంస్థగా పనిచేస్తుందని ఆరోపించారు. భారతదేశంలో నివసిస్తున్న ప్రజలందరికీ ఓటు ఆయుధమని అన్నారు. అటువంటిది బిహార్లో 65.6 లక్షల ఓట్లు ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. ఇంత మంది శాశ్వతంగా వలసపోయారని ఎలా నిర్ధారణకు వచ్చారని ప్రశ్నించారు.
ఈ వ్యవహారం చూస్తుంటే దేశంలో బిజెపి అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి ఈసీ ప్రధాన భూమిక పోషిస్తుందని వారు ఆరోపించారు. బిజెపి దేశంలో అధికారంలోకి రావడానికి ఇలాంటి తప్పుడు పద్ధతులను అవలంబిస్తుందని వారు దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మోరిగాడి రమేశ్, జూకంటి పౌలు, సూదగాని సత్యరాజయ్య, వడ్డేమాను బాలరాజు, తాళ్లపల్లి గణేశ్, పీక్క గణేశ్, ఘనగాని మల్లేశం, కాసుల నరేశ్, మద్దెల కుమార్, చౌడబోయిన యాదగిరి, గొడుగు దాసు, యాసారపు ప్రసాద్, ఎండీ అఖిల్, గనగాని రాజు, బర్ల సిద్దులు, ఎర్ర రాజు, రాచర్ల సిద్ధులు పాల్గొన్నారు.