– బీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్ రెడ్డి
మోటకొండూర్, డిసెంబర్ 05 : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని, పార్టీ కార్యకర్తలు సైనికుల్లా కష్టపడి పని చేసి సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని టెస్కాబ్ మాజీ వైస్ చైర్మన్, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. మోటకొండూర్ బీఆర్ఎస్ అభ్యర్థి వడ్డెబోయిన శ్రీలతను భారీ మెజారిటీతో గెలిపించేందుకు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీతో సీపీఐ, టీఎమ్మార్పీఎస్ నేతలు, కాంగ్రెస్ అసమ్మత్తి నేతలు కలిసి రావడం మంచి పరిణామమన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి, పార్టీ నాయకులతో పాటు సీపీఐ, కాంగ్రెస్ అసమ్మత్తి నేతలతో ఎన్నికల సన్నాహాక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని, సర్పంచ్ అభ్యర్ధులకు, వార్డు సభ్యులకు పార్టీ నుంచి పూర్తి సహకారం అందించి గెలిపించే దిశగా కృషి చేయాలన్నారు. అధిష్టాన నిర్ణయానికి, పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తే ఎంతటి వారినైనా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మోటకొండూర్ బీఆర్ఎస్ పార్టీకి, పార్టీ అభ్యర్థికి ప్రజల నుంచి భారీ స్పందన ఉందని, ఈ సారి బీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ విజయానికి కలిసి నడుసున్న సీపీఐ, కాంగ్రెస్ నాయకులతో చర్చించి అనుకూలమైన వార్డులను కేటాయించుకోవాలని సూచించారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించి, ప్రచారం చేపట్టాలన్నారు.
మండల కేంద్రంలో బీఆర్ఎస్ గెలుపునకు కార్యకర్తలంతా సహకరించాలని సర్పంచ్ అభ్యర్థి వడ్డెబోయిన శ్రీలత అన్నారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్, సీపీఐ, టీఎమ్మార్పీఎస్ నేతలు, కాంగ్రెస్ అసమ్మత్తి నేతలు కలిసి రావడంతో గెలుపు ఖాయమైందన్నారు. అనంతరం గొంగిడి మహేందర్ రెడ్డి చేతుల మీదుగా నామినేషన్ పత్రాలను తీసుకున్న వడ్డెబోయిన శ్రీలత నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొట్ల యాదయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి దామోదర్‌రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ బాల్ద లింగం, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బొలగాని సత్యనారాయణ, బీఆర్ఎస్ నాయకులు భూమండ్ల యాదయ్య, అనంతుల జంగారెడ్డి, సిరబోయిన నర్సంహులు యాదవ్, బొబ్బలి యాదిరెడ్డి, బురాన్, జివిలికపల్లి వెంకటేశ్, బుగ్గ భాస్కర్, అనంతరెడ్డి, సీపీఐ మండల కార్యదర్శి గాదెగాని మాణిక్యం, కాంగ్రెస్ నాయకులు సిరబోయిన మల్లేశ్‌యాదవ్, వంగపల్లి మహేందర్, గడ్డం వెంకటేశ్ పాల్గొన్నారు.