యాదగిరిగుట్ట, మార్చి7: కోతకు వచ్చిన పంటలు నీరు అందక, లో వోల్టేజ్ తో మోటార్లు సరిగా నడవక పూర్తిగా ఎండిపోయిన పంటలను చూస్తుంటే ఏడుపొస్తుందని మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మండలంలోని మాసాపేట గ్రామానికి చెందిన యువ రైతు ఎమ్మ శ్రీకాంత్ పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా యువ రైతును వివరాలు అడిగి తెలుసుకున్నారు. తన భార్య మెడలోని బంగారాన్ని కుదవబెట్టి నాలుగెకరాల్లో పంట వేస్తే పూర్తిగా ఎండిపోయిందని యువ రైతు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అతనికి గొంగిడి మహేందర్ రెడ్డి ధైర్యం చెప్పారు. అధైర్యపడొద్దని.. బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు. రాబోయేది కేసీఆర్ పాలనే అని ధీమా వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి అసమర్థతతో కాళేశ్వరం జలాలు సకాలంలో అందించకపోవడం రైతులకు దుస్థితి నెలకొందని గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం జలాలు విడుదల చేస్తే మాజీ సీఎం కేసీఆర్కు పేరు వస్తుందనే అక్కసుతోనే రైతులను అరిగోస పట్టిస్తున్నారని విరుచుకుపడ్డారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవ్వాలని రైతాంగమంతా ముక్తకంఠంతో కోరుకుంటున్నారని తెలిపారు. కేసీఆర్ పాలనలోనే తెలంగాణలో వ్యవసాయం ఒక స్వర్ణయుగంలా ఉందని పేర్కొన్నారు. తానే నీళ్లు తీసుకొచ్చామని.. తన పేరు నీళ్ల ఐలయ్య అని స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రగల్బాలు పలుకుతున్నారని మండిపడ్డారు. నీళ్ల ఐలయ్య కాదని.. కరవు తెచ్చిన ఐలయ్య అని ఎద్దేవా చేశారు.
ఎమ్మెల్యే ఐలయ్యకు చిత్తశుద్ధి ఉంటే గ్రామాల్లో ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులకు ధైర్యం ఇవ్వాలని గొంగిడి మహేందర్ రెడ్డి సూచించారు. త్వరలోనే ఎండిపోయిన పంటలపై రైతులకు బాసటగా నిలిచేందుకు కార్యక్రమం రూపొందిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలు పర్యటించి రైతులకు అండగా నిలుస్తామన్నారు. రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు మా నాయకులు హరీశ్ రావు, కేటీఆర్ చిత్తమవుతున్నారని తెలిపారు. ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం నిలువలేదని వ్యాఖ్యానించారు.