Ayesha Khan | బాలీవుడ్ బ్యూటీగా గుర్తింపు పొందిన అయేషా ఖాన్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఇటీవల విడుదలైన ధురందర్ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్‌లో కనిపించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఆమెకు ఫాలోయింగ్ గణనీయంగా పెరిగింది. అయితే, ఈ క్రేజ్‌ను కొంతమంది సైబర్ నేరగాళ్లు దుర్వినియోగం చేస్తున్నట్లు బయటపడింది. అయేషా ఖాన్ పేరుతో నకిలీ వాట్సాప్ అకౌంట్లు సృష్టించి, పలువురిని సంప్రదిస్తూ మోసాలకు పాల్పడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయం ఆమె దృష్టికి చేరడంతో వెంటనే స్పందించింది.
తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్టు పెట్టిన అయేషా, ఫేక్ అకౌంట్‌కు సంబంధించిన వాట్సాప్ చాట్ స్క్రీన్షాట్లను షేర్ చేసింది. “ఇది నా అకౌంట్ కాదు. దయచేసి ఇలాంటి మెసేజ్‌లను నమ్మకండి” అంటూ స్పష్టంచేసింది. అంతేకాకుండా ఆ నకిలీ అకౌంట్‌కు సంబంధించిన ఫోన్ నంబర్‌ను కూడా వెల్లడించింది. ఇలాంటి మోసపూరిత చర్యల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత వివరాలు లేదా డబ్బు పంపకూడదని ఆమె సూచించింది. ప్రస్తుతం ఆమె చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు కూడా ఆమెకు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు.
అయేషా ఖాన్ కేవలం హిందీ చిత్రాల్లోనే కాకుండా తెలుగు సినిమాల్లో కూడా నటించింది. ముఖ ఛిత్రంతో టాలీవుడ్లో అడుగుపెట్టిన ఆమె, తరువాత మనమే, ఓం భీం బుష్, లక్కీ భాస్కర్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లాంటి సినిమాల్లో నటించింది. ఇటీవల వచ్చిన ధురంధర్ సినిమాలో ఐటెం సాంగ్ ద్వారా మరింత గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఆమె పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.