Sabitha Indra Reddy | గాంధీ సరోవర్ పేరిట మధు పార్క్ అపార్ట్‌మెంట్‌ను ఖాళీ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌పై బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలను మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఆదివారం నాడు పరామర్శించారు. ఈ సందర్భంగా మూసీ బాధితులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నదని మూసీ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుతో వేలాది కుటుంబాలు రోడ్డున పడతాయని తెలిపారు. మూసీ డెవలప్మెంట్ చేసుకోండి కానీ.. మా ఇండ్లను మాత్రం లాక్కోకండని సూచించారు.
రంగారెడ్డి జిల్లాలో భూములను కాంగ్రెస్ ప్రభుత్వం గుంజుకుంటుందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. మూసీ ప్రాజెక్టులో గాంధీ విగ్రహం అవసరమే లేదని తెలిపారు.ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదని మండిపడ్డారు. ఒక్క ఇళ్లును కూడా టచ్ చేయకుండా రేవంత్ రెడ్డి అరాచకాన్ని మేం అడ్డుకుంటామని తెలిపారు. ఎవరూ అధైర్య పడొద్దని.. బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఒక్క ఇళ్లును కూడా టచ్ చేయకుండా మూసీ డెవలప్మెంట్ చేయాలని కేసీఆర్ సూచించారని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మూసీ బాధితుల ఆవేదన చాలా బాధగా అనిపిస్తోందని అన్నారు. మూసీ అని చెప్పి ప్రజల ఇల్లు కూల్చడం సరికాదని హితవు పలికారు.