ఆలేరు టౌన్, మార్చి 13 : అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామన్న హామీని నెరవేర్చుతూ సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించాలని ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధన పోరాట కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఈ మేరకు చర్యలు చేపట్టాలంది. గురవారం ఆలేరు పట్టణ కేంద్రంలోని ఆర్యవైశ్య సంఘంలో జరిగిన రెవెన్యూ డివిజన్ సాధన పోరాట కమిటీ సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడారు. గత అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక ఎమ్మెల్యే విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. అయినా ఇప్పటివరకు సీఎం గానీ, మంత్రి గానీ అధికారికంగా ప్రకటించకపోవడం శోచనీయమన్నారు.
ఆలేరు విద, వైద్య, వ్యాపార రంగాల్లో వెనుకబడి ఉందన్నారు. ఆలేరును రెవెన్యూ డివిజన్ చేస్తేనే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. ఐలయ్యను గెలిపిస్తే ఆలేరు రెవెన్యూ డివిజన్ను 100 రోజుల్లో చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బహిరంగ సభలో ఇచ్చిన హామీని తుంగలో తొక్కారని విమర్శించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆలేరు రెవెన్యూ డివిజన్ ప్రకటన చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ సాధన పోరాట కమిటీ కన్వీనర్ పసునూరి వీరేశం, కో కన్వీనర్ రాచకొండ జనార్దన్, మొరిగాడి చంద్రశేఖర్, పద్మా సుదర్శన్, చెక్క వెంకటేశ్, సమరసింహారెడ్డి, ఉప్పలయ్య, ఎం డి.కుర్షిత్ పాషా, సముద్రాల సత్యం, బాంబే రవి, బేతి కృష్ణారి, కామిటికారి అశోక్, అంజిబాబు పాల్గొన్నారు.