కాశీబుగ్గ, మార్చి10 : ఇంటి పన్ను చెల్లించలేదని ఓ పేదింట్లో వంట గ్యాస్ సిలిండర్ను కార్పొరేషన్ అధికారులు స్వాధీనం చేసుకున్న ఉదంతం వరంగల్ మహానగరపాలక సంస్థ పరిధిలోని కాశీబుగ్గ ప్రాంతంలో వెలుగుచూసింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. కాశీబుగ్గ ప్రాంతానికి చెందిన గొలుసుల సుజాత ఇంటి పన్ను చెల్లించాల్సి ఉందని గత నెల 23న నగరపాలక సంస్థ అధికారులు నోటీసు ఇచ్చారు. మంగళవారం రెవెన్యూ ఇన్స్పెక్టర్ సోహైల్తోపాటు ఆరుగురు సిబ్బంది సుజాత ఇంటికి వచ్చారు.
ఇంటి పన్ను ఇంకా చెల్లించలేదని బెదిరిస్తూ.. వంటగ్యాస్ సిలిండర్ను స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లోని ఒకే ఒక్క సిలిండర్ను తీసుకెళ్తే తాము వంట ఎలా చేసుకోవాలని ప్రాధేయపడినా వినకుండా అధికారులు సిలిండర్ తీసుకెళ్లారని సుజాత విలపించింది. అప్పు తీసుకొచ్చి సాయంత్రం రూ.5,280 ఇంటి పన్ను చెల్లించడంతో సిలిండర్ ఇచ్చారని తెలిపారు. ధనికులకు కార్పొరేషన్ అధికారులు నమస్తే పెట్టి వెళ్తున్నారని, పేద, మధ్య తరగతి ప్రజలను పన్నుల వసూలు పేరిట ఇబ్బందులకు గురిచేస్తున్నారని సుజాత ఆరోపించారు.