హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): లోక్‌సభ సాక్షిగా తెలంగాణకు మరోసారి తీవ్ర అవమానం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలంగాణపై విషం కక్కారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, తెలంగాణ బిల్లు 2014 ఫిబ్రవరిలో పార్లమెంటు ఆమో దం పొందిన రోజుపై నోటికొచ్చినట్టు మాట్లాడారు. లోక్‌సభ వేదికగా ప్రశ్నించే గొంతుక లేకపోవడంతో టీడీపీ ఎంపీ రెచ్చిపోయారు. 2014 ఫిబ్రవరి 18ని బ్లాక్ డేగా పేర్కొన్నారు. లోక్ సభలో తెలంగాణకు అవమానం జరుగుతు న్నా తెలంగాణ నుంచి ఎన్నికైన బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు కనీసం నోరు మెదపలేదు. టీడీపీ ఎంపీ వ్యాఖ్యలను కనీసం ఖండించలేదు. కాంగ్రెస్ 8, బీజేపీ 8 కలిపి 16 మంది ఎంపీలు ఉన్నా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడటంలో పూర్తిగా విఫలమయ్యారు.
ఏడుపు ఆపండి: శ్రవణ్ వార్నింగ్
ఏపీ ఎంపీలు తెలంగాణపై ఏడుపు ఆపాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ హెచ్చరించారు. పార్లమెంటులో ఏపీ ఎంపీల వ్యాఖ్యలపై ‘ఎక్స్’ వేదికగా ఆయన స్పందించారు. రాష్ట్రం విడిపోయి పన్నెండేండ్లు గడుస్తున్నా తెలంగాణపై విషం చిమ్మడం ఏమిటని ప్రశ్నించారు. లోక్‌సభ వేదికగా తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడిన ఎంపీలు లావు కృష్ణదేవరాయలు, తెన్నేటి కృష్ణప్రసాద్ వైఖరిని ఖండించారు. ఏపీ అభివృద్ధికి ఏం కావాలో అడిగే తెలివి లేక, తెలంగాణపై పడి ఏడవడం పరిపాటిగా మారిందని చురకలంటించారు. ఏపీ నేతల కుట్రలతోనే నాడు ఉద్యమంలో వందల మంది తెలంగాణ యువకులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదా సాధించకోలేని అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే తెలంగాణపై విషం చిమ్ముతున్నారా..? అని ప్రశ్నించారు. ఏ అంశంపై అయినా చర్చకు తాము సిద్ధమని సవాల్ విసిరారు. పార్లమెంటులో ఏపీ నేతలు ఇష్టారీతిన మాట్లాడుతుంటే తెలంగాణ ఎంపీలు మౌనం దాల్చడం రాష్ట్ర ఆత్మగౌరవానికి తీరని ద్రోహం అని మండిపడ్డారు. ఏపీ నేతలు తెలంగాణ ప్రజలను అవమానిస్తే గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
సహించేది లేదు: దేవీ ప్రసాద్
తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన రోజును పార్లమెంట్లో చీకటి రోజు అని టీడీపీ ఎంపీ కృష్ణదేవరాయలు అభివర్ణించడం దుర్మార్గమని బీఆర్ఎస్ నేత, కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ ఓ ప్రకటనలో ఖండించారు. గతంలో ప్రధాని మోదీ సైతం తెలంగాణ ఏర్పాటుపై ఇలాంటి వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరిన రోజును చీకటితో పోల్చడాన్ని ఖండించారు. రాష్ర్టాలుగా విడిపోయినా అన్నదమ్ములుగా కలిసి ఉండాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటే ఏపీ ఎంపీలు తెలుగు రాష్ర్టాల ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
వారి మౌనం బాధాకరం: వద్దిరాజు

లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన రోజును చీకటి రోజుగా అభివర్ణించిన ఏపీ ఎంపీ లావు కృష్ణ దేవరాయలు వ్యాఖ్యలు గర్హణీయమని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మండిపడ్డారు. నాడు మహానేత కేసీఆర్ నాయకత్వంలో జరిగిన తెలంగాణ ఉద్యమం, యువత ఆత్మత్యాగాలతో రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్ ఆమోదంతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరిందని గుర్తుచేశారు. టీడీపీ సభ్యుడు రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతూ మాట్లాడుతున్న సందర్భం లో రాష్ట్రం నుంచి ఎన్నికైన కాంగ్రెస్, బీజేపీ సభ్యు లు నిలువరించకుండా మౌనంగా ఉండటం బాధాకరమని వాపోయారు. లోకసభలో బీఆర్ఎస్ సభ్యులు లేని లోటు స్పష్టంగా కనిపించిందని ఆవేదన వ్యక్తంచేశా రు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అవమానిస్తూ చీకటితో పోల్చడం తీవ్ర ఆక్షేపణీయమని, దుర్మార్గమని మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ తెలంగాణ వ్యతిరేక విధానాలను అర్థం చేసుకోవలసిందిగా అన్ని వర్గాల ప్రజలను కోరారు.