హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): చదువాలనే ఆకాంక్ష ఉన్నా వివిధ కారణాలతో మధ్యలోనే తమ చదువుకు స్వస్తి చెప్పిన వారికి ఆశాదీపంగా నిలిచిన ఓపెన్ స్కూల్ వార్షిక పరీక్షలను రద్దుచేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ విద్యాకమిషన్ సూచించింది. ఇంటర్, ఎస్సెస్సీ బోర్డుల ద్వారానే రెగ్యులర్ విద్యార్థులతో సమానంగా ఓపెన్ స్కూళ్లలో చేరిన వారికి వార్షిక పరీక్షలు నిర్వహించాలని సిఫార్సు చేసింది. ఇటీవలే సర్కార్‌కు సమర్పించిన నివేదికలో ఈ అంశాన్ని పొందుపరిచింది. ఇది ఆచరణ సాధ్యమే నా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పరీక్షలను రద్దు చేస్తే.. అడ్మిషన్లు పొందిన వారు రెగ్యులర్ విద్యార్థులతో సమానంగా పోటీపడాల్సి ఉంటుంది. ఇంటర్, ఎస్సెస్సీ బోర్డులు నిర్వహించే పరీక్షలు మాత్రమే రాయాలి. అంటే ఇంటర్‌బోర్డు, ఎస్సీఈఆర్సీ రూపొందించిన పుస్తకాలను చదవాలి. ఆ పరీక్షలు రాస్తే డ్రా పౌట్ విద్యార్థులు ఉత్తీర్ణులు కాగలరా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకవేళ పరీక్షలను రద్దుచేస్తే ఓపెన్ స్కూలింగ్ విధానానికి చరమగీతం పాడినట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే విద్యాకమిషన్ ప్రతిపాదనలు వివాదాస్పదం అవుతున్నాయి. కమిషన్ సూచనలపై అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఓపెన్ ఎగ్జామ్స్‌ను రద్దు చేయాలన్న అంశంపైనా అభ్యంతరాలు వస్తున్నాయి. ఇదే నిజమైతే డ్రాపౌట్ అయిన వారికి చదువుకునే అవకాశాలు మృగ్యంకానున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతున్నది.
తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం. సూక్ష్మంగా దీనినే ఓపెన్‌స్కూల్ అని పిలుస్తారు. ఈ విద్యా విధానానికి రాష్ట్రంలో ఘన చరిత్ర ఉన్నది. ఇది కష్టాల కడలిలో చదువుకు స్వస్తి చెప్పిన ఎందరికో, అణగారిన వర్గాల వారిలో మరెందరికో, ఆర్థిక ఇబ్బందులతో చదువును ఆపిన ఇంకెందరికో, వయసుతో నిమిత్తం లేకుండా, హాజరు పట్టికలతో అవసరం లేకుండా రాష్ట్రవ్యాప్తంగా వేలాది మందిలో విద్యా కుసుమాలు పూయించిన పూదోట. గృహిణులు, రైతులు, నైపుణ్యం గల కార్మికులు, బాలనేరస్తులు వృత్తి ఏదైనా అందరిలో అక్షరజ్యోతిని వెలిగించింది. ఇలాంటి తెలంగాణ ఓపెన్ స్కూల్ విద్య రాష్ట్రంలో మిద్యగా మిగులనున్నదన్న వాదనలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
చదువంటే ఒక్కో ఏడాది ఒక్కో మెట్టు ఎక్కాలి. ఒక్కో తరగతి చదువుకుంటూ పరీక్షలు రాసి, పైతరగతికి ప్రమోట్ కావాలి. కానీ ఏ తరగతి చదువకపోయినా కేవలం చదువడం, రాయడం వచ్చి నేరుగా పదో తరగతిలో అడ్మిషన్ పొందే అద్భుత అవకాశాన్ని ఓపెన్ స్కూల్ సొసైటీ కల్పించింది. మూడు దశాబ్దాలుగా గృహిణులు, రైతులు, కార్మికులు, బాలనేరస్తులతోపాటు మరెందరినో విద్యా కుసుమాలుగా తీర్చిదిద్దింది. ఇది మలి విడత చదువుకు రెండో అవకాశంగా భావిస్తారు. ఇలాంటి దశలో కొత్త ప్రతిపాదనలు అమలు చేస్తే ఇంటర్, ఎస్సెస్సీ బోర్డుల ద్వారా ఓపెన్‌స్కూల్ అభ్యర్థులకు పరీక్షలు నిర్వహిస్తే చదువుకునేందుకు దక్కిన అవకాశం చేజారిపోయినట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఓపెన్ స్కూల్ విద్య కనుమరుగవడం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఓపెన్ స్కూల్ విద్యావిధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం 1991లో ప్రవేశపెట్టింది. ప్రీ ఎలిమెంటరీ విద్యను అందించేందుకు ఓపెన్ స్కూల్ సొసైటీని ఏర్పాటుచేసింది. దీని ద్వారా లబ్ధిపొందిన వారిలో అణగారిన వర్గాలకు చెందిన వారే అధికం. లక్షలాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వారైన ఎందరో మహిళలు.. పదో తరగతి, ఇంటర్ విద్యను పూర్తి చేసుకున్నారు. కొందరైతే డిగ్రీ, పీజీలు చదివిన వారూ ఉన్నారు. మళ్లీ అదే కాంగ్రెస్ సర్కార్ నియమించిన విద్యాకమిషన్ ఈ విధానాన్ని రద్దుచేయాలని సూచించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విద్యాసంవత్సరం మహిళా సంఘాల సభ్యులను అక్షరాస్యులుగా మలిచేందుకు చొరవ తీసుకున్నది. వయోజన విద్య, సెర్ప్, సమగ్రశిక్షా భాగస్వామ్యమై ఈ మూడింటి సమన్వయంతో మహిళా సంఘాల సభ్యులను ఓపెన్ స్కూళ్లలో చేర్పించారు. ఇలాంటి మహిళా సంఘాల సభ్యులు రెగ్యులర్ పరీక్షలు రాయగలరా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.