– బీఆర్ఎస్ రాజాపేట మండలాధ్యక్షుడు సట్టు తిరుమలేష్
రాజాపేట, ఏప్రిల్ 13 : రాజాపేట మండలం చల్లూరు గుట్టల్లో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా కొనసాగుతున్న మైనింగ్ దందాపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సట్టు తిరుమలేష్ డిమాండ్ చేశారు. సోమవారం రాజాపేట మండలంలోని చల్లూరు గుట్టల్లో 322 సర్వే నెంబర్లలో కొనసాగుతున్న అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోవాలని స్థానిక తాసీల్దార్కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తాసీల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకుండానే పకృతి సంపదని కొల్లగొడుతూ కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు. రేయింబవళ్లు అక్రమ బ్లాస్టింగ్ పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న చప్పుళ్లకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ అక్రమ మైనింగ్ దందా వెనక ఇంత పెద్దోళ్లు ఉన్నా విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే విధంగా గతంలో కూడా చల్లూరు మల్బవాని చెరువులో ఇలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలించి కోట్ల రూపాయల సొమ్ము చేసుకున్నారని, ఈ విషయంపై పలుమార్లు విన్నవించుకున్న పట్టించుకునే నాధుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్టు హెచ్చరించారు.