Irrigation Water | పానగల్ ఎస్ఎల్బీసీ డి-40 కాల్వ ద్వారా ఎల్-11 తూము నుండి నకిరేకల్ మండలంలోని గోరంకల పల్లి , మోదీని గూడెం, తిప్పర్తి మండలంలోని మామిడాల ,ఇండ్లూరు, యాపలగూడెం, సర్వారం, గుర్రప్పగూడెం, మోత్కూరు ,బుసిరెడ్డిగూడెం గ్రామాలకు వచ్చే సాగునీరు రాకుండా ఇరిగేషన్ అధికారులు గేటు అమర్చారని ఆయా గ్రామాలకు సంబంధించిన రైతులు ఆదివారం ఎల్-11 తూము వద్ద ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. వాన కాలం నుండి డి-40 కాల్వ ద్వారా సాగునీరు వదలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పంట పొలాలకు సాగునీరు అందించాలని కోరుతూ నకరికల్ తిప్పర్తి రహదారిపై రాస్తారోకో చేస్తే పోలీస్ స్టేషన్లో నిర్బంధించారని రైతులు ఆరోపించారు.
పదేండ్లలో తూములకు గేట్లు వేయలేదని, తమ తూముకు మాత్రం ఎందుకు గేటు వేశారని ప్రశ్నిస్తున్నారు. వెంటనే స్పందించి అధికారులు తూముకు వేసిన గేటును తొలగించి నీటిని విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు.