బుధవారం 03 మార్చి 2021
Nalgonda - Feb 21, 2021 , 01:16:06

కల్యాణ వైభోగమే..

కల్యాణ వైభోగమే..

  • కనుల పండువగా పార్వతీ జడల 
  • రామలింగేశ్వరుల కల్యాణం భక్తజన సంద్రమైన 
  • చెర్వుగట్టు.. మార్మోగిన శివనామస్మరణ 
  • కల్యాణమూర్తులకు తలంబ్రాలు పోసి 
  • తరించిన భక్తులుస్వామివారిని దర్శించుకున్న మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే 
  • చిరుమర్తిప్రసిద్ధ శైవక్షేత్రం చెర్వుగట్టు బ్రహ్మోత్సవాల్లో 

శనివారం పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి కల్యాణం వైభవంగా జరిగింది. తెల్లవారుజామున 4 :30 గంటలకు ఎదుర్కోలు మహోత్సవం, 5:50 గంటలకు మాంగళ్యధారణ నిర్వహించగా.. ఆది దంపతులకు తలంబ్రాలు సమర్పించేందుకు భక్తులు పోటీపడ్డారు. స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు లక్షకు పైగా భక్తులు తరలి రావడంతో చెర్వుగట్టు క్షేత్రం జన సంద్రమైంది. గట్టుకు వచ్చే దారులన్నీ భక్తులతో కిటకిటలాడాయి. శివసత్తుల నృత్యాలు, శివనామస్మరణతో గుట్ట పరిసరాలు కోలాహలంగా మారాయి. విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతోపాటు పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. జిల్లా యంత్రాంగం, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సకల సౌకర్యాలు కల్పించారు. 

  • ఘనంగా శివ పార్వతుల కల్యాణం
  • భక్తజన సంద్రమైన చెర్వుగట్టు క్షేత్రం
  • పట్టు వస్ర్తాలు సమర్పించిన ఆలయ చైర్‌పర్సన్‌ అరుణారాజిరెడ్డి 
  • మార్మోగిన శివనామ స్మరణ

నార్కట్‌పల్లి, ఫిబ్రవరి20 :  శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం తెల్లవారుజామున పార్వతీ రామలింగేశ్వరుల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.  ఆలయ చైర్‌పర్సన్‌ మేకల అరుణారాజిరెడ్డి స్వామి, అమ్మవారికి పట్టు వస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. భక్తుల శివనామ స్మరణతో గట్టు మార్మోగింది. శివ సత్తుల కోలాటాల మధ్య ఉత్తరాయణ పుణ్యకాలం, నాగమాస శుద్ధ సప్తమి (రథసప్తమి) గడియల్లో యాజ్జీకులు అల్లవరపు సుబ్రమణ్యదీక్షితావధాని ఆచార్యత్వంలో కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు పోతులపాటి రామలింగేశ్వర శర్మ ఆధ్వర్యంలో రుత్వికుల వేద మంత్రాల మధ్య శివ పార్వతుల వివాహ తంతు వైభవంగా జరిగింది. వేద పండితుడు నీలకంఠ శివాచార్యుల వ్యాఖ్యానం భక్తులను కట్టిపడేసింది. అంతకు ముందు తెల్లవారుజామున 2 గంటలకు సుప్రభాత సేవ, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, ఆరుణ పారాయణం, అన్నాభిషేకం, మహానివేదనం నిర్వహించారు. 4:30 గంటలకు మేళతాళాలతో శివ సత్తుల విన్యాసాల మధ్య స్వామి వారిని నంది వాహనంపై, అమ్మవారిని గజ వాహనంపై కూర్చోబెట్టి ఎదుర్కోలు నిర్వహించి.. కల్యాణ మండపానికి తోలుకొని వచ్చారు. అందంగా అలంకరించిన కల్యాణ వేదికలో పద్మాసనంపై ఉత్సవ మూర్తులను ఆసీనులను చేసిన అనంతరం ఏడు నదుల నీటితో కూడిన మంత్ర జలాన్ని చల్లి కల్యాణ వేదికను శుద్ధి చేశారు. అనంతరం బ్రహ్మ, విష్ణువుతో పాటు ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికారు. అనంతరం సంప్రదాయ బద్ధంగా విఘ్నేశ్వర పూజ పుణ్య హవచనం, రక్షాసూత్రధారణ అనంతరం 5:20 గంటలకు జీలకర్ర బెల్లం పెట్టించారు. అమ్మవారికి రక్షా సూత్రధారణ చేశారు. వేదపండితులు నిర్ణయించిన సుముహూర్తం 5 :50 గంటలకు త్రినేత్రుడు పార్వతీ అమ్మవారి మెడలో మాంగళ్య ధారణ చేసే ఘట్టాన్ని నిర్వహించగా భక్తులు చూసి పులకించి పోయారు.  

తలంబ్రాలు సమర్పించిన భక్తులు

పరిణయ శోభతో మనోహరంగా ధర్శనమిచ్చిన ఆది దంపతులకు భక్తులు తలంబ్రాలు సమర్పించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన లక్షకు పైగా భక్తులు తలంబ్రాల బియ్యాన్ని నెత్తిన పెట్టి మోసుకొచ్చి మరీ స్వామి వారికి సమర్పించారు. తలంబ్రాలను సమర్పించుకున్న భక్తులతో వేదిక ప్రాంగణం కిక్కిరిసింది. భక్తులకు ఇబ్బంది కలగకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి స్వామి వారి దర్శనం కల్పిస్తూ తలంబ్రాల బియ్యం పోసేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి కల్యాణోత్సవం సందర్భంగా ఆలయానికి శనివారం రూ.26,34,380 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఇన్‌చార్జి ఈఓ మహేంద్రకుమార్‌ తెలిపారు. గతం కంటే ఈసారి రూ. 6.84లక్షలు అధికంగా వచ్చినట్లు పేర్కొన్నారు.

హంసవాహన సేవ రద్దు

స్వామివారి కల్యాణం అనంతరం పుష్కరిణిలో జరుపాల్సిన హంస వాహన సేవను కొవిడ్‌- 19 నిబంధనల కారణంగా రద్దు చేశారు. భక్తులు స్నానాలు చేయడం వల్ల కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో కోనేటిలో నీటిని తొలగించారు. భక్తులు స్నానాలు చేసేందుకు ప్రత్యేకంగా షవర్లను ఏర్పాటు చేశారు. 

నేడు శేషవాహన సేవ  

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం తెల్లవారుజామున స్వామివారికి శేషవాహన సేవ నిర్వహించనున్నారు. దీక్షా హోమం, రుద్రాభిషేకం, బలిహరణం, సరస్వతీ పూజ, నీరాజన మంత్ర పుష్పం జరుపనున్నారు.

స్వామివారిని 

దర్శించుకున్న మంత్రి జగదీశ్‌రెడ్డి

విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి శనివారం స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయ చైర్‌పర్సన్‌ మేకల అరుణా రాజిరెడ్డి పూర్ణకుంభంతో మంత్రి కి స్వాగతం పలికారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని ఆలయ కమిటీ వారికి, అధికారులకు సూచించారు. ఆయన వెంట ఎమ్మెల్యే చిరుమర్తి లింగ య్య, ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, రేగట్టె మల్లికార్జున్‌ రెడ్డి, బైరెడ్డి కరుణాకర్‌రెడ్డి ఉన్నారు.

VIDEOS

logo