హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కొనసాగుతున్న 81వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్)కు సందర్శకుల సందడి నెలకొంది. దేశంలోని అన్ని రాష్ర్టాల నుంచి వ్యాపారులు విచ్చేసి తమ తమ రాష్ర్టాలకు చెందిన వస్తువులతో స్టాళ్లను ఏర్పాటు చేశారు. సూది గుండు నుంచి మొదలుకొని ఎలక్ట్రానిక్ వస్తువులు, వస్ర్తాలు, తీరొక్క దుస్తులు, ఫర్నిచర్ లభ్యం కావడంతో ప్రజలు కొనుగోలు చేసేందుకు వస్తున్నారు. సందర్శకులకు ఇబ్బందులు కలుగకుండా నుమాయిష్ నిర్వాహకులు ఏర్పాట్లు చేపట్టారు.
జనవరిలో ప్రారంభం కావలసిన నుమాయిష్ కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో మూతపడిన విషయం విదితమే. కరోనా తగ్గుముఖం పట్టడంతో తిరిగి ప్రారంభించుకునేందుకు అవకాశం ఇవ్వడంతో గత నెల 26న తిరిగి ప్రారంభించారు. ప్రతి సాయంత్రం నగర ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల వారికి ఆహ్లాదపు వేదికగా మారుతుంది. దేశంలోని అన్ని రాష్ర్టాలకు చెందిన వస్తువులను కొనుగోలు చేసే విధంగా ఏర్పాటు చేసిన స్టాళ్లలో కొనుగోలు చేస్తూ తమకిష్టమైన వస్తువులను ఇండ్లకు తీసుకువెళుతున్నారు.