మంగళవారం 09 మార్చి 2021
Nalgonda - Feb 13, 2021 , 01:04:47

టీఆర్‌ఎస్‌లో సభ్యత్వ సందడి

టీఆర్‌ఎస్‌లో సభ్యత్వ సందడి

  • జిల్లాల వ్యాప్తంగా నమోదు షురూ
  • అసెంబ్లీ నియోజకవర్గానికి 50వేల టార్గెట్‌
  • ఈ నెలాఖరుకు మొదటి దఫా పూర్తి
  • సభ్యత్వ నమోదుకు మంచి ఆదరణ
  • గతానికి మించి నమోదుకు ప్రణాళిక : 
  • జిల్లా ఇన్‌చార్జి రవీందర్‌రావు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తిరుగులేని ప్రజాదరణ కలిగిన పార్టీగా ఉన్న టీఆర్‌ఎస్‌ ఇప్పుడు సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించింది. పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీ కమిటీలు, ఇన్‌చార్జిల నియామకాన్ని పూర్తి చేసుకుని ఏప్రిల్‌ చివరలో జరుగనున్న పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి సన్నాహాలు చేస్తున్నది. ఇటీవల జరిగిన పార్టీ రాష్ట్ర సమావేశంలోనూ అధినేత కేసీఆర్‌ ఇదే విషయంపై ముఖ్యులకు దిశానిర్దేశం చేశారు. అందులో భాగంగా సంస్థాగత నిర్మాణంలో కీలకమైన పార్టీ సభ్యత్వ నమోదుపై కేంద్రీకరించారు. శుక్రవారం నుంచే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం లాంఛనంగా మొదలైంది. తొలి దఫాలో అసెంబ్లీ నియోజకవర్గానికి 50వేల చొప్పున సభ్యత్వాలు లక్ష్యంగా పెట్టుకున్నా మని, జిల్లాలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ఈ సారి భారీగా సభ్యత్వం పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సభ్యత్వ నమోదు ఉమ్మడి జిల్లా జనరల్‌ సెక్రటరీ ఇన్‌చార్జి రవీందర్‌రావు వెల్లడించారు.

నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి 12(నమస్తే తెలంగాణ) : టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదు శుక్రవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైంది. గత ఆదివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో సంస్థాగత నిర్మాణంపై పార్టీ అధినేత కేసీఆర్‌ స్పష్టమైన కార్యాచరణను ప్రకటించారు. ఆ మేరకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కనీసం 50వేల సభ్యత్వాలు నమోదు చేయాల్సి ఉంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీనియర్‌ నేత తక్కెళ్లపల్లి రవీందర్‌రావును ఉమ్మడి జిల్లా జనరల్‌ సెక్రెటరీ ఇన్‌చార్జీగా నియమించారు. తిరిగి జిల్లాల వారీగా నల్లగొండకు ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, సూర్యాపేటకు కంచర్ల రామకృష్ణారెడ్డి, యాదాద్రి జిల్లాకు వై.వెంకటేశ్వర్లును ఇన్‌చార్జీలుగా నియమించారు. గతంలో ఉమ్మడి జిల్లాలో 8లక్షల పైచిలుకు సభ్యత్వాలు పూర్తి కాగా ఈ సారి అంతకుమించి నమోదయ్యే అవకాశాలున్నట్లు పార్టీ ముఖ్యులు అంచనా వేస్తున్నారు. తొలిదఫాలో ప్రతి నియోజకవర్గం నుంచి 50వేల సభ్యత్వాల చొప్పున ఉమ్మడి జిల్లాలో ఆరు లక్షల సభ్యత్వాన్ని పూర్తి చేయాలని టార్గెట్‌ పెట్టుకున్నారు. పార్టీ సాధారణ సభ్యత్వానికి రూ.30, క్రియాశీల సభ్యత్వానికి ఎస్సీ, ఎస్టీలకు రూ.50, మిగతా వారికి రూ.100 రుసుము నిర్ణయించారు. సాధారణ, క్రియాశీలక సభ్యత్వాలకు సంబంధించి వేర్వేరు ప్రణాళికలు రూపొందించారు. సభ్యత్వాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌ చేసే ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చారు. అయితే పార్టీ సభ్యత్వం ఉన్న ప్రతిఒక్కరికీ రూ.2లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు. ప్రస్తుతం పార్టీ ముఖ్యులు, నేతలు, క్యాడర్‌ అంతా దీనిపైనే దృష్టి పెట్టి పనిచేసేలా చర్యలు చేపట్టారు.

భారీగా సభ్యత్వ నమోదుకు ఛాన్స్‌ : తక్కెళ్లపల్లి

సూర్యాపేటలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మంత్రి జగదీశ్‌రెడ్డి, పార్టీ ఇన్‌చార్జి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ తొలి సభ్యత్వాన్ని మంత్రి జగదీశ్‌రెడ్డికి రవీందర్‌రావు అందించారు. పార్టీ బలానికి సభ్యత్వమే నిదర్శమని పార్టీ నేతలు, క్యాడర్‌ అంతా దీనిపైనే కేంద్రీకరించి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈ ఆరేండ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ఎంతో మంది టీఆర్‌ఎస్‌ పార్టీ వైపు చూస్తున్నారని జిల్లా ఇన్‌చార్జి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఆసక్తిచూపుతున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే గతంతో పోలిస్తే ఈ సారి సభ్యత్వం గణనీయంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. తొలి దఫాలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 50వేల చొప్పున లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. తర్వాత మిగతా సభ్యత్వం కూడా పూర్తి చేస్తామన్నారు. నేడు సభ్యత్వ నమోదుపై నాగార్జునసాగర్‌లో నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఇదే విధంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ సభ్యత్వ నమోదును విజయవంతంగా పూర్తి చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోనే సభ్యత్వ నమోదులో జిల్లాను అగ్రస్థానంలో నిలుపుతామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో పటిష్టమైన పార్టీ యంత్రాంగంతో శాసనమండలి పట్టభద్రుల ఎన్నికలతోపాటు నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలోనూ విజయఢంకా మోగిస్తామని స్పష్టం చేశారు. గతంలోనూ హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మార్చిలో సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టి కమిటీల నియామాకం పూర్తి చేస్తామని వెల్లడించారు. 

VIDEOS

logo