మంగళవారం 20 అక్టోబర్ 2020
Medchal - Aug 08, 2020 , 23:41:30

మైటాస్‌.. కరోనా మటాష్‌

మైటాస్‌.. కరోనా మటాష్‌

అన్నపానీయాలు అందజేస్తూ..

మేమున్నామంటూ భరోసానిచ్చారు

సుమారు 4వేల మంది జనాభా ఉన్న 

‘హిల్‌కౌంటీ’ కరోనాపై పోరాడి హిట్‌ అయ్యింది.. మహమ్మారి విస్తరిస్తున్నదని తెలియగానే మైటాస్‌హిల్స్‌ ప్రధాన గేటు వద్దనే అడ్డుకట్ట వేశారు. అయినప్పటికీ పలువురు వైరస్‌బారిన పడ్డారు. వెంటనే కమ్యూనిటీ వాసులంతా ఏకమై బాధితులకు అండగా నిలిచారు. మనోధైర్యం నింపి పూర్తిగా కోలుకునే వరకూ వంతులవారీగా అన్నపానీయాలు అందజేశారు. సకల వసతులు కల్పించారు. నిత్యం వారి పరిస్థితిని వాకబు చేస్తూ.. భరోసా ఇచ్చారు.. చివరకు కరోనాపై విజయం సాధించారు.. ఏది ఏమైతేనేం.. ప్రస్తుతం కరోనా రహిత గేటెడ్‌ కమ్యూనిటీగా తీర్చిదిద్దారు.

దుండిగల్‌ : నిజాంపేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని హిల్‌కౌంటీ (మైటాస్‌హిల్స్‌) అతి పెద్ద గేటెడ్‌ కమ్యూటీ. హిల్‌ కౌంట్‌లో 1188 విల్లాలు ఉండగా  సుమారు 3800 మంది నివాసముంటున్నారు. వీరిలో అధిక శాతం ఉన్నతస్థానాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, వ్యాపారులు, ఇండస్ట్రియలిస్ట్‌లు ఉన్నారు. ఈ క్రమంలో దేశంలో/రాష్ట్రంలో కరోనా వైరస్‌ మొదలైనప్పటినుంచే దాని వ్యాప్తిని అడ్డుకునేందుకు హిల్‌కౌంటీ అసోసియేషన్‌ సభ్యులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

గేటువద్దే.. అడ్డుకట్ట..!

కాలనీగేట్‌ వద్దనే లోపలికి వచ్చేవారికి, సందర్శకులకు టెంపరేచర్‌ చెక్‌చేయడంతో పాటు వ్యక్తిగత శుభ్రతను పాటించేలా తగు చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ ఇక్కడ నివాసముంటున్న వారిలో సుమారు 40మంది కొవిడ్‌-19 బారిన పడ్డారు. ఇందులో వయస్సు పై బడిన వారు ఉన్నారు. వీరిలో కేవలం ఒకే ఒక్క వృద్ధురాలు(72) మినహా మిగతా 39 మంది బాధితులు కరోనాను జయించి తిరిగి సాధారణ జీవితం గడుపుతున్నారు. ఇందుకు ప్రధానంగా హిల్‌కౌంటీ అసోసియేషన్‌ తీసుకున్న ప్రత్యేక చర్యలే కారణంగా చెప్పవచ్చు.

         ధైర్యం చెప్పారు.. భరోసా కల్పించారు..!

ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికైనా కరోనా సోకిందని తెలియగానే పరిసర ప్రాంతాలకు చెందిన వారితో పాటు అయిన వారు సైతం బాధితుల పట్ల వివక్షత ప్రదర్శిస్తున్నారు. ఓ వైపు బాధితులపై కాకుండా రోగంపై పోరాడాలని ప్రభుత్వం, సామాజికవేత్తలు ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ ప్రజల్లోని భయం తొలగడం లేదు. ఇలాంటి సమయంలో అభద్రతా భావం, ఒంటరి తనం, భయంతో చనిపోతున్నవారే మనకు అధికంగా కన్పిస్తున్నారు. వాటికి అడ్డుకట్ట వేయాలనే సంకల్పంతో హిల్‌కౌంటీ అసోసియేషన్‌ చక్కని నిర్ణయం తీసుకుంది. తమ గేటేడ్‌ కమ్యూనిటీలో కరోనా బారినపడి హోం ఐసోలేషన్‌/క్వారంటైన్‌లో ఉంటున్న బాధితుల్లో భరోసాను నింపింది. ఎవరి ఇంట్లోనైతే కరోనా వచ్చిందో  వారి వివరాలను తెలుసుకుని మనోధైర్యం కల్పించారు. సకాలంలో మందులు వాడేలా సూచనలు ఇచ్చారు. బాధితుల ఇంటిని మున్సిపల్‌ అధికారుల సహాయంతో క్రమం తప్పకుండా శానిటేషన్‌ చేయించారు. సమయానికి భోజనం చేసింది.. లేనిదీ వాకబు చేసేవారు. వారితో మాటామంతీ నిర్వహించేవారు. వీటితో పాటు బాధితులకు కావాల్సిన భోజనం, ఆహార పదార్థాలు అందజేసి అవసరాలను తీర్చారు. ప్రధానంగా కరోనా సోకినంత మాత్రాన ఎవరూ చనిపోరని, ధైర్యంగా ఎదుర్కోవాలని భరోసా కల్పించారు.

వంతుల వారీగా

ఆహార పదార్థాలు అందజేత

అసోసియేషన్‌ ప్రతినిధులు ఒక నిర్ణయానికి వచ్చారు. రోజుకు ఒకరు చొప్పున బాధిత కుటుంబాలకు బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, డిన్నర్‌ అందజేశారు. సాయంత్రం టెర్రస్‌పైకి వెళ్లి నిబంధనలు పాటిస్తూ బాధితులతో నేరుగా మట్లాడి మనోధైర్యం నింపారు. ఇంకా వారికి కావల్సిన ఇతర అవసరాలను సైతం సమకూర్చడంతో బాధితులు తొందరగా కరోనా నుంచి కోలుకున్నారు. ఈ గేటేడ్‌ కమ్యూనిటీలో మొత్తం ఇప్పటివరకు 40 మందికి కరోనా సోకగా ‘అసోసియేషన్‌' చొరవతో 39 మంది మహామ్మారి నుంచి బయటపడ్డారు. వీరిలో కొందరు 70 ఏండ్ల వయస్సున్న వారు ఉన్నారు. ఈ చక్కని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో హిల్‌కౌంటీ అసోసియేషన్‌ చైర్మన్‌ రత్నగోపాల్‌, ప్రెసిడెంట్‌ సోలీపురం రాంరెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అనుమోల్‌, ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు, అసోసియేషన్‌ సంయుక్త కార్యదర్శి, మెడికల్‌ అడ్వైజర్‌ డా.సునీల్‌ ప్రధానభూమిక వహించినట్లు అసోసియేషన్‌ ప్రతినిధులు తెలిపారు. అయితే ఓ వృద్ధురాలు(72) మాత్రం కరోనాతో మరణించింది.

మనో ధైర్యం కల్పించి

కరోనా ఆలోచనే రాకుండా చూశాం..

మా కాలనీలో కరోనా బారిన పడిన కుటుంబాలకు హిల్‌కౌంటీ అసోసియేషన్‌ అండగా నిలిచింది. ప్రధానంగా వైరస్‌ బారిన పడిన కుటుంబాలకు మనోధైర్యం కల్పించాం. ఉదయం, సాయంత్రం బాధిత కుటుంబాల ఇండ్ల వద్దకు వెళ్లి బయట నుండే కబుర్లు చెప్పాం. సకాలంలో మందులు వేసుకునేలా చర్యలు తీసుకున్నాం.  ఒక్కమాటలో చెప్పాలంటే బాధితులను వేరుగా చూడకుండా సొంత కుటుంబ సభ్యుల మాదిరిగా చూసుకున్నాం.

-రత్నగోపాల్‌, హిల్‌కౌంటీ

అసోసియేషన్‌ చైర్మన్‌, బాచుపల్లి

వంతుల వారీగా భోజనాలు..

కరోనా బారిన పడిన కుటుంబాలను వివక్షతో చూడకుండా వారిలో మనోధైర్యం నింపాం. బాధితులు ఆహారం కోసం ఇబ్బందులు పడకుండా అసోసియేషన్‌ సభ్యులు వంతుల వారీగా భోజనాలు అందించాం. ఈ విషయంలో మా కాలనీ మహిళల సేవలు ప్రశంసనీయం. పోటీపడి మరీ బాధితులకు బ్రేక్‌పాస్ట్‌ నుంచి డిన్నర్‌ వరకు అన్ని సమకూర్చేవాళ్లు. మున్సిపాలిటీ, పోలీసులు సైతం సహకారం అందించారు.

-సోలిపురం రాంరెడ్డి, హిల్‌కౌంటీ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌, బాచుపల్లి

ప్రత్యేకంగా వాట్సాప్‌ గ్రూప్‌

ఏర్పాటు చేశాం..

హిల్‌కౌంటీలో కరోనా పాజిటివ్‌ వచ్చిన కుటుంబాలు, వైద్యులు, అసోసియేషన్‌ ప్రతినిధులను కలిపి ఒక  వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేశాం. ఇందులో బాధితుల పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆరాతీస్తూ.. తగిన సలహాలు, సూచనలు ఇచ్చాం. వారి అవసరాలను తెలుసుకుని తీర్చాం. ప్రధానంగా బాధితుల్లో ధైర్యం నింపాం.

- అనుమోల్‌, హిల్‌కౌంటీ అసోసియేషన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, బాచుపల్లి

ఏమిచ్చినా.. రుణం తీర్చుకోలేం..!

మాది మహారాష్ట్రలోని నాగపూర్‌. ఉద్యోగరిత్యా ఇక్కడ స్థిరపడ్డాం.  మా కుటుంబంలో నాతో పాటు నా భర్త, కుమార్తెకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఊరుకాని ఊరిలో హిల్‌కౌంట్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు అందించిన సహాయం మరువలేనిది. మాలో మనోధైర్యం నింపడంతో పాటు మాకు కావాల్సిన ఆహారపదార్థాలు, అవసరాలను తీర్చారు. ముఖ్యంగా అసోసియేషన్‌ ప్రతినిధులతో పాటు కాలనీవాసులు చూపిన వాత్సల్యం, నూరిపోసిన ధైర్యంతోనే మేము అందరం కరోనా నుంచి బయటపడగలిగాం. ఏమిచ్చినా.. అసోసియేషన్‌ ప్రతినిధుల రుణం తీర్చుకోలేనిది.                                                                                                                                              -అనిత సునీల్‌తివారీ, హిల్‌కౌంటీ వాసి, బాచుపల్లి


logo