Chief Justice Neelima | మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన కోర్టు–పోలీసు సమన్వయ సమావేశానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిందితులకు శిక్ష పడినప్పుడే బాధితులకు నిజమైన న్యాయం చేసిన వారమవుతామని అన్నారు. అందుకు ప్రతీ కేసులో నాణ్యమైన దర్యాప్తు, శాస్త్రీయ సాక్ష్యాల సేకరణ, సమర్థవంతమైన ప్రాసిక్యూషన్, కోర్టు–పోలీసు శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని పేర్కొన్నారు.
దర్యాప్తు అధికారులు (IOలు), కోర్టు డ్యూటీ అధికారులు (CDOలు) విధుల నిర్వహణలో ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి అవసరమైన సూచనలు చేశారు. కోర్టు లైజనింగ్ అధికారి న్యాయవ్యవస్థకు, పోలీసు శాఖకు మధ్య సమర్థవంతమైన వారధిగా వ్యవహరించాలని, కేసుల విచారణకు సంబంధించిన సమాచారం, సమన్లు, వారెంట్లు, ఇతర కోర్టు ప్రక్రియలను ఎలాంటి జాప్యం లేకుండా సంబంధిత అధికారులకు చేరవేసి సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
అలాగే కోర్టు సమన్లు, వారెంట్లను సకాలంలో అమలు చేయడం, చార్జి షీట్లు, కేసు డైరీలు, ఇతర సంబంధిత పత్రాలను నిబంధనల ప్రకారం కోర్టుకు సమర్పించడం ద్వారా కేసుల విచారణ వేగవంతమై నిందితులకు శిక్షలు పడే అవకాశాలు మరింత మెరుగుపడతాయని తెలిపారు. శాస్త్రీయ దర్యాప్తు, పటిష్ఠమైన సాక్ష్యాల సేకరణ, సమర్థవంతమైన కోర్టు–పోలీసు సమన్వయంతోనే న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసం మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.
బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యం..
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు (ఐపీఎస్) మాట్లాడుతూ.. బాధితులకు సత్వర న్యాయం అందించడమే మెదక్ జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యమని అన్నారు. పోలీసు శాఖ, న్యాయవ్యవస్థ సమన్వయంతో ఈ సంవత్సరం మెదక్ జిల్లాలో 20 కేసుల్లో నిందితులకు శిక్షలు ఖరారయ్యేలా చేయగలిగామని తెలిపారు. వాటిలో 12 కేసుల్లో జీవిత ఖైదు, 5 కేసుల్లో 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షలు, మరో 3 కేసుల్లో 7 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ కారాగార శిక్షలు ఖరారయ్యాయని, తద్వారా బాధితులకు న్యాయం అందించగలిగామని పేర్కొన్నారు.
ఈ విజయాలు నాణ్యమైన దర్యాప్తు, శాస్త్రీయ సాక్ష్యాల సేకరణ, ఫోరెన్సిక్ ఆధారాల వినియోగం, సమయానికి చార్జిషీట్లు దాఖలు చేయడం, కోర్టులో సమర్థవంతమైన ప్రాసిక్యూషన్ ఫలితమేనని తెలిపారు. ప్రతి దర్యాప్తు అధికారి కేసులను అత్యంత నిబద్ధతతో దర్యాప్తు చేసి, నిందితులకు చట్ట ప్రకారం శిక్షలు పడేలా కృషి చేయాలని సూచించారు. కోర్టు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, దర్యాప్తు అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తేనే నేరస్థులకు శిక్షలు ఖరారై బాధితులకు పూర్తి న్యాయం అందుతుందని, ఈ దిశగా మెదక్ జిల్లా పోలీసులు న్యాయవ్యవస్థతో కలిసి నిరంతరం పనిచేస్తారని ఎస్పీ తెలిపారు.
చివరగా, విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందికి నీలిమ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ సమావేశంలో డీఎస్పీలు ప్రసన్న కుమార్, సుభాష్ చంద్రబోస్, సీఐలు మహేష్, రేణుక, రాజశేఖర్ రెడ్డి, సందీప్ రెడ్డి, కృష్ణమూర్తి, జార్జ్, రంగకృష్ణ, వెంకటరాజ గౌడ్, ఎస్సైలు, కోర్టు కానిస్టేబుళ్లు, అధికారులు పాల్గొన్నారు.

Anil Menon | ఈ రాత్రే అంతరిక్ష యాత్రకు అనిల్ మీనన్.. వచ్చే ఏడాది ఏప్రిల్లో తిరిగి భూమికి
Watch: కదులుతున్న రైలులో పూజా కార్యక్రమం.. వైరల్ వీడియోపై రైల్వే వివరణ
Raaka | ‘రాకా’లో మరో హీరోయిన్ ఫిక్స్.. అల్లు అర్జున్ సినిమాపై అంచనాలు పెంచిన నైలా గ్రేవల్ !