Anil Menon : భారత సంతతికి చెందిన నాసా ఆస్ట్రోనాట్ (NASA Austronaut) డాక్టర్ అనిల్ మీనన్ (Dr. Anil Menon) ఇవాళ రాత్రి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) బయలుదేరనున్నారు. కజకిస్థాన్ (Kajakistan) లోని బైకనూర్ కాస్మోడ్రోమ్ (Bikanur Kasmodrome) నుంచి భారత కాలమానం ప్రకారం రాత్రి 8:17 గంటలకు సోయజ్ ఎంఎస్-29 వ్యోమనౌకలో ఆయన ప్రయాణం ప్రారంభమవుతుంది. ఈ యాత్ర సుమారు 8 నెలలపాటు సాగనుండగా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఆయన భూమికి తిరిగి వస్తారు.
అనిల్ మీనన్ మొదటి అంతరిక్ష ప్రయాణం ఇది. అంతరిక్షంలో సుదీర్ఘకాలం మానవులు గడిపితే ఎదురయ్యే వైద్యపరమైన సవాళ్లపై పరిశోధనలు చేయడం ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం. భవిష్యత్తులో చేపట్టబోయే సుదూర అంతరిక్ష యాత్రలకు ఈ పరిశోధనల ఫలితాలు కీలకం కానున్నాయి. ఆయనతోపాటు రష్యన్ వ్యోమగాములు ప్యోటర్ డబ్రోవ్, అన్నా కికినా కూడా ఈ యాత్రలో పాల్గొంటున్నారు. ప్రయోగానికి కొన్ని గంటల ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఆనందాన్ని పంచుకున్న అనిల్.. ఈ యాత్రకు తాను సిద్ధంగా ఉన్నానని, మద్దతుగా నిలిచిన నాసాతోపాటు కుటుంబసభ్యులు, స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపారు.
పాలక్కాడ్‌లోని ఒట్టపాలంకు చెందిన శంకరన్ మీనన్, ఉక్రెయిన్‌కు చెందిన ఎలిజబెత్ సమోయ్లెంకోల కుమారుడే అనిల్ మీనన్. ఆయన వైద్యుడిగా, మెకానికల్ ఇంజనీర్‌గా, యూఎస్ స్పేస్ ఫోర్స్ ఫ్లైట్ సర్జన్‌గా, పైలట్‌గా పలు రంగాల్లో రాణించి చివరకు నాసా ఆస్ట్రోనాట్ బృందంలో చోటు దక్కించుకున్నారు. అనిల్ మీనన్ అంతరిక్ష ప్రయాణం.. ఎందరో గొప్పవారిని ప్రపంచానికి అందించిన పాలక్కాడ్ జిల్లా ఘనకీర్తిలో మరో సువర్ణాధ్యాయాన్ని లిఖించనుంది.