Raaka | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పాన్-వరల్డ్ చిత్రం ‘రాకా’ పై ఇప్పటికే సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సైన్స్ ఫిక్షన్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా, చిత్రానికి సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఇప్పటికే ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే, ఈ సినిమాలో ఒకరికి మించి పలువురు హీరోయిన్లు కనిపించనున్నారనే ప్రచారం గత కొంతకాలంగా సాగుతోంది. మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మిక మందన్న వంటి పలువురు స్టార్ హీరోయిన్ల పేర్లు కూడా వినిపించాయి.
ఇటీవల మలయాళ నటి ఫెమినా జార్జ్ తాను కూడా ‘రాకా’లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు వెల్లడించగా, ఇప్పుడు మరో కొత్త పేరు ఈ ప్రాజెక్ట్‌లో చేరింది. పంజాబీ నటి నైలా గ్రేవల్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించింది.తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నైలా గ్రేవల్, “దర్శకుడు అట్లీతో పని చేయాలని చాలా కాలంగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఆ అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉంది. బాలీవుడ్లో మాత్రమే పనిచేసిన నన్ను ఇలాంటి భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌కు ఎంపిక చేయడం గౌరవంగా భావిస్తున్నాను. ‘రాకా’లో భాగమవడం నా కెరీర్లో ప్రత్యేకమైన మైలురాయి” అని చెప్పింది. నైలా గ్రేవల్ ఇప్పటికే ‘తమాషా’, ‘బరేలీ కి బర్ఫీ’, ‘తప్పడ్’, ‘ఇష్క్ విశ్క్ రీబౌండ్’ వంటి హిందీ చిత్రాల్లో నటించి గుర్తింపు పొందింది. అలాగే ఓ ప్రముఖ నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్‌లోనూ మెప్పించింది. ఇప్పుడు అల్లు అర్జున్ నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ఆమె కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది.
‘రాకా’లో పలువురు నటీనటులు భాగమవుతున్న నేపథ్యంలో సినిమా కథ, పాత్రలపై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. అట్లీ తన మార్క్ కమర్షియల్ ఎలిమెంట్స్‌కు సైన్స్ ఫిక్షన్ టచ్ జోడిస్తూ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా, మిగిలిన నటీనటులు, కథకు సంబంధించిన వివరాలను మేకర్స్ దశలవారీగా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అల్లు అర్జున్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం విడుదలకు ముందే దేశవ్యాప్తంగా భారీ హైప్‌ను సొంతం చేసుకుంటోంది.