Summer heat | జహీరాబాద్, మార్చి 18 : సూర్యుడు తన ప్రకోపాన్ని చూపుతున్నాడు. మండుతున్న ఎండలతో జనం అల్లాడుతున్నారు. రోడ్లపైకి వచ్చేందుకు జంకుతున్నారు. చూస్తుండగానే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగానే నమోదవుతున్నాయి. ఎండలతో వృద్ధులు, పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఉదయం 11 గంటలు మొదలు సాయంత్రం 4:30 గంటల వరకు ఎండ తీవ్రత తగ్గడం లేదు. ఎండ తీవ్రతతో ఉపాధి కూలీలు పనులకు వెళ్లేందుకు భయపడుతున్నారు.
వడదెబ్బ సోకి సొమ్మసిల్లే ప్రమాదం ఉంది. వయసు మళ్లిన వారు ఎండలకు లోబీపీకి, డీహైడ్రేషన్‌కు గురై ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. ఎండల భయానికి ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లోనే ప్రయాణాలు సాగిస్తున్నారు. వృద్ధులు, పిల్లలు ఎండలకు తట్టుకోలేక అస్వస్థతకు గురవుతున్నారు.
కర్ఫ్యూను తలపిస్తున్న రహదారులు..
ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. జహీరాబాద్ నియోజకవర్గంలోని ఆయా మండలాల పరిధిలో రద్దీగా ఉండే ప్రధాన రహదారులు మధ్యాహ్నం కర్ఫ్యూను తలపిస్తున్నాయి. మధ్యాహ్న సమయంలో రోడ్డుపై జనం కన్పించడం లేదు. శుభకార్యాలు, పెళ్లిళ్లకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
ఎండల ప్రభావంతో గిరాకీ తగ్గి దుకాణదారులు నష్టపోతున్నారు. ఇదిలా ఉంటే మండుతున్న ఎండలు మాత్రం సీజనల్ వ్యాపారులకు కలిసొచ్చింది. దాహాన్ని తీర్చుకునేందుకు ప్రజలు పండ్లు, పండ్ల రసాలు, శీతల పానీయాలు, కొబ్బరి బోండాలు, చెరకు రసం, ఐస్‌క్రీమ్ దుకాణాల వైపు పరుగెడుతున్నారు. జహీరాబాద్ పట్టణంలో సీజనల్ వ్యాపారాలతో వందల మంది ఉపాధి పొందుతున్నారు. కుండల అమ్మకాలు జోరందుకున్నాయి. ఫ్యాన్లు, ఏసీలు, కూలర్ల విక్రయాలు కూడా పెరిగాయి.
ఏప్రిల్, మే నెలల్లో పూర్తిగా.. జూన్‌లో కనీసం 15 రోజులు ఎండల తీవ్రత ఉండనుంది. అందుకు అనుగుణంగా ప్రజలు తమ రోజువారీ పనులు చేసుకోవాలని, ఎండ తీవ్రత పెరగక ముందు అంటే ఉదయం 11 గంటల్లోపు అలాగే.. సాయంత్రం నాలుగున్నర తర్వాతే బయటి పనులు పెట్టుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఎండల్లో అత్యవసరంగా బయటకు వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లిక్విడ్లు, నీరు ఎక్కువ సేవించాలని సూచిస్తున్నారు. పాడైన, నిల్వ ఉన్న ఆహారాన్ని తినొద్దని, కలుషిత ఆహారం తీసుకుంటే ఎండకాలం అతిసార వ్యాధిబారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
MLC Kavitha | బీసీ రిజర్వేషన్ల బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు
Danam Nagender | సహచర ఎమ్మెల్యేలపై దానం నాగేందర్ సీరియస్
Amitabh Bachchan: షారూక్, విజయ్ను దాటేసిన బిగ్ బీ.. 120 కోట్ల ట్యాక్స్ కట్టిన అమితాబ్ బచ్చన్