పల్లెకిలె(శ్రీలంక): టీ20 ప్రపంచకప్‌లో సూపర్-8 దశకు ఆదిలోనే హంసపాదు! న్యూజిలాండ్, పాకిస్థాన్ మధ్య శనివారం జరుగాల్సిన సూపర్-8 తొలి పోరు వర్షార్పణమైంది. టాస్ గెలిచిన పాక్ బ్యాటింగ్ ఎంచుకోగా, అనుకోని అతిథిలా వరుణుడు రంగప్రవేశం చేశాడు. చిరుజల్లులతో మొదలై ఎంతకు తగ్గకపోవడంతో మైదానం మొత్తం నీటితో నిండిపోయింది. మధ్య మధ్యలో కొంత గెరువు ఇచ్చినా మైదానంపై కప్పిన కవర్లపై నీళ్లు భారీగా నిలిచి ఉండటంతో ఆట సాధ్యపడలేదు. మైదానాన్ని పలుమార్లు పరిశీలించిన అంపైర్లు ఆటకు ఏమాత్రం అనుకూలంగా లేకపోవడంతో రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
దీంతో అప్పటి వరకు మ్యాచ్‌పై అభిమానులు పెట్టుకున్న ఆశలపై వరుణుడు నీళ్లు గుమ్మరించాడు. చేసేదేమి లేక ఫ్యాన్స్ నిరుత్సాహంగా స్టేడియాన్ని వీడారు. ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. పాక్‌తో పోరు కోసం కివీస్ మూడు మార్పులతో బరిలోకి దిగింది. రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ తిరిగి జట్టులోకి రాగా, పిచ్‌ను అంచనా వేస్తూ స్పిన్నర్ ఇష్ సోధీ, పేసర్ ఫెర్గుసన్‌ను ఎంపిక చేసుకుంది. మరోవైపు మెగాటోర్నీలో పడుతూలేస్తూ సాగుతున్న పాక్..ఖవాజ నఫయ్ను తప్పిస్తూ సీనియర్ ఫకర్ జమాన్‌ను తీసుకుంది. ఈనెల 24న ఇంగ్లండ్‌తో పాక్ తలపడనుంది. సెమీస్‌కు అర్హత సాధించాలంటే ప్రతీ మ్యాచ్ కీలకమైన నేపథ్యంలో పాయింట్లకు తోడు రన్‌రేట్ కీలకం కానుంది