హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో జరుగబోయే సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని టీజీఎస్ ఆర్టీసీ నిర్ణయించినట్టు సంస్థ ఎండీ వై నాగిరెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో కల్యాణ తలంబ్రాల బుకింగ్స్ పోస్టర్‌ను ఆయన ఆవిషరించారు.
ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ దేవాదాయశాఖ సహకారంతో రాములవారి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇండ్లకు వద్దకు చేరవేసే పవిత్ర కార్యానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఎంతో విశిష్టత కలిగిన ఈ తలంబ్రాల ప్యాకెట్లు పొందాలనుకునే భక్తులు www. tgsrtclogistics.co.in వెబ్సైట్ ద్వారా బుకింగ్ చేసుకోవాలని సూచించారు. టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి.. వివరాలు నమోదు చేసుకోవాలని వివరించారు. సీతారామచంద్రుల కల్యాణోత్సవం అనంతరం ఈ తలంబ్రాలను భక్తుల ఇండ్లకు డెలివరీ చేస్తామని చెప్పారు.
గత మూడేండ్లలో లక్షలాది మంది భక్తులకు తలంబ్రాలను సంస్థ అందజేసిందని తెలిపారు. భద్రాద్రిలో మార్చి 27న అంగరంగ వైభవంగా జరిగే శ్రీరామనవమి వేడుకలకు వెళ్లలేని భక్తులు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 040-23450033, 040-69440069 సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీటీఎం (మారెటింగ్ అండ్ కమర్షియల్) శ్రీధర్, లాజిస్టిక్ ఏటీఏం రాజన్, భాను తదితరులు పాల్గొన్నారు.