Jackpot | నార్త్ కరోలినా రాష్ట్రం, బిస్కోలోని మాంట్‌గోమరీ కౌంటీలో నివసించే టోమాస్ మునోజ్ అనే వ్యక్తికి నంబర్ 7తో అనుబంధం ఉంది. ఎందుకంటే ఆయన పుట్టింది 1977వ సంవత్సరం 7వ తేదీ. అంతేకాదు పది డాలర్ల విలువైన ‘ట్రిపుల్ రెడ్ 777 జాక్‌పాట్ (Triple Red 777 Jackpot)’ అనే లాటరీ టికెట్‌ను కొనుగోలు చేశాడు. అతడు కొన్న ఈ టికెట్‌కు ఒక మిలియన్ డాలర్ల (సుమారు 9.5 కోట్లు) లాటరీ తగిలి జాక్‌పాట్ కొట్టాడు.
నార్త్ కరోలినా ఎడ్యుకేషన్ ట్రిపుల్ రెడ్ 777 జాక్‌పాట్ లాటరీని కొత్తగా ప్రారంభించారు. క్యాండర్లోని సౌత్ (South) మెయిన్ స్ట్రీట్‌లో ఉన్న క్యాండర్ వీ మార్ట్‌లో 777 నంబర్ గల లాటరీని చూసి కచ్చితంగా కొనాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే పుట్టిన తేదీ 7, 77వ సంవత్సరం, 777 అవుతుంది కాబట్టి ఆ లాటరీని కొనుగోలు చేశానని తెలిపాడు. ఆ లాటరీ గెలుచుకోవడం ఆనందంగా ఉందని అన్నాడు. ఈ బహుమతిని ఇరవై సంవత్సరాల పాటు యాభైవేల డాలర్లు వాయిదాల రూపంలో లేదా ఒకేసారి ఆరు లక్షల డాలర్లు తీసుకోవాలని లాటరీవారు చెప్పారు. ఒకేసారి ఆరు లక్షల డాలర్లు తీసుకున్నాడు. దీంట్లో పన్నులు పోగా 3,96,060 డాలర్లు ఇంటికి తీసుకెళ్లాడు.
క్లాసిక్ కార్లను కొనుగోలు చేసి వాటిని బాగుచేసే తన వృత్తిలోనే ఈ డబ్బును పెట్టుబడిగా పెడతానని ఆయన వెల్లడించారు. పాఠశాల నిర్మాణానికి సహాయపడటానికి ఈ లాటరీని ప్రారంభించామని నిర్వాహకులు తెలిపారు. లాటరీ ద్వారా సేకరించిన డబ్బులో మాంట్‌గోమరీ కౌంటీకే 2.6 మిలియన్ డాలర్లకు పైగా అందజేశామని వారు పేర్కొన్నారు.