హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఇరిగేషన్, ఆయకట్టు అభివృద్ధి శాఖలో ఇద్దరు రిటైర్డ్ సూపరింటెండెంట్ ఇంజినీర్లను కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం రిటైర్డ్ ఎస్ఈ జీ విజయభాసర్‌రెడ్డి నాగర్‌కర్నూల్ సీఈగా, మరో రిటైర్డ్ ఎస్ఈ ఎస్ భీమ్ ప్రసాద్ నీటిపారుదల శాఖ మంత్రికి ప్రత్యేకాధికారిగా నియమితులయ్యారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని, వీరిద్దరు వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఆ బాధ్యతల్లో కొనసాగుతారని ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
దీనిపై పలు ఉద్యోగ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. నిరుడు మార్చి 10న సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలకు విరుద్ధంగా ఉన్న ఈ నియామకాలను వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ ఏఈఈఎస్ అసోసియేషన్, తెలంగాణ ఇరిగేషన్ గ్రాడ్యుయేట్ ఇంజినీర్స్ అసోసియేషన్, హైదరాబాద్ ఇంజినీర్స్ అసోసియేషన్, తెలంగాణ బీసీ ఇంజినీర్స్ అసోసియేషన్, తెలంగాణ డిప్లొమా ఇంజినీర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.