‘నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2025’లో ప్రోత్సాహక బహుమతి రూ.3 వేలు పొందిన కథ.
“యాడికే నీలీ?” చెప్పులేసుకుని బయలుదేరిన నీలి వంక పక్కింటి యాదమ్మ అదోరకంగా చూసింది. “ఒసే నీలీ! నిన్నేనే.. అడుగుతుంటే ఇనపట్టంలా?” “అత్తమ్మని సూట్టానికి ఎళ్తున్న. పిల్లల్ని కాస్త సూత్తుండు..” ఆగకుండానే సమాధానం చెప్పింది. “నీ అత్తని సుట్టానికి ‘పోలీస్ టేసన్’కి ఎల్తన్నవా?! ఏం మాట్టాడుతున్నవో తెలత్తందా?” “అవును! ఆడికే ఎల్తన్న.. నాలుగు దినాలు అయింది అత్తమ్మని సూసి. ఎట్లున్నదో.. ఏటో..” వీళ్ల సంభాషణ వినపడిందేమో.. ఇరుగుపొరుగు ఇళ్లలోని ఆడాళ్లు ఓ నలుగురైదుగురు చేస్తున్న పనులు ఆపిమరీ బయటకు వచ్చారు.
“ఏటే.. నీ బతుకిట్టా బుగ్గి సేసిన ఆ పోశమ్మని సూట్టానికెల్తున్నవా.. సిగ్గు లేదటే నీకు..?” “నిన్ను, నీ బిడ్డలని అనాదలని సేసిన ఆ ముదనట్టపు దాన్ని సూడాలని ఎట్టా గనిపిస్తందే..?” “మా మగోల్లు తాగొచ్చి మమ్మల్ని కొట్టడంలా.. అంత మాత్తరానికే మా అత్తలిట్టా సేత్తున్నరా?” “మొగుడు సచ్చి నాల్రోజులు కాలేదు.. అప్పుడే బయటకు ఎల్తున్నావేటే.. పెద్దదినం అయ్యేదాకా బయటికి ఎల్లకూడదే. ఇప్పుడు నువ్వెల్లి సూడకపోతే నీ అత్తేమీ సావదులే. పద.. లోపలికి”. అక్కడున్న ఆడాళ్లందరూ తలా ఒకమాట అంటుంటే తట్టుకోలేక పోయింది నీలి. మనసంతా బాధతో నిండిపోగా.. నీళ్లు నిండిన కళ్లతో ఓసారి వాళ్లందరి వైపు చూసింది.
“మీరంతా ఎన్నన్నా అనండి.. నాను మాత్తరం అత్తమ్మని సూడాల్సిందే! పాపం. అత్తమ్మ జైల్లో ఎట్లుందో ఏటో” అంటూ ఎంతమంది వారిస్తున్నా వినకుండా అటుగా వస్తున్న ఆటో ఆపి, అడ్రస్ చెప్పి ఎక్కి కూర్చుంది.
నీలి ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడు తల్లి చనిపోతే.. తండ్రి నాగయ్య, సత్తెమ్మను మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. సత్తెమ్మ కాపరానికి వచ్చిన దగ్గర నుండీ చిన్నపిల్ల అనికూడా చూడకుండా నీలిచేత గేదెల దగ్గర పేడ తీయించటం, అంట్లు తోమించటం, ఇల్లు వాకిలి ఊడ్చి శుభ్రం చేయటం దగ్గర్నుండి.. అన్ని పనులూ చేయించేది. నాగయ్య చూడలేక..
“చిన్నపిల్ల అన్ని పనులు ఒక్కతే ఎట్లా చేస్తుందే” అని వారించబోతే.. “ఆడపిల్ల పనులు నేర్చుకోకపోతే ఎట్టా?! రేపు పెళ్లయి, అత్తారింటికి వెళ్తే.. సవత్తల్లి పనీపాట నేర్పలేదని అందరూ నన్నాడి పోసుకుంటారు” అంటూ క్షణం తీరిక లేకుండా ఇంటెడు చాకిరీ చేయించేది.పన్నెండో సంవత్సరం రాగానే పెద్ద మనిషి అయింది నీలి. రోజురోజుకి రేకులు విచ్చుకుంటున్న మొగ్గలా ఎంతో అందంగా ఎదుగుతున్న నీలిని చూస్తుంటే.. సత్తెమ్మ మనసు ఈర్ష్యతో రగిలిపోసాగింది.
ఓరోజు అక్కని చూడాలని వచ్చిన సత్తెమ్మ తమ్ముడు శేషు కళ్లు.. ముగ్ధమనోహరంగా ఉన్న నీలిమీద పడ్డాయి. “అక్కాయ్! బావతో సెప్పి దీన్ని నాకిచ్చి పెళ్లి సేయరాదే! మీకు కట్నం బాధ తప్పుతుంది..” అన్నాడు.
సకలకళా వల్లభుడు.. నీలి కంటే ఎంతో పెద్దవాడైన తమ్ముడివైపు ఓసారి చూసి ఆలోచనలో పడింది సత్తెమ్మ. ఎట్లాగైనా సరే భర్తను ఒప్పించాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. “దానికంటే వాడు ఇరవైఏళ్లు పెద్ద. వాడి తిరుగుళ్లు, పేకాట, తాగుడు భరించలేక ఇద్దరు పెళ్లాలు వెళ్లిపోతే.. అట్టాంటోడికి చిన్నపిల్ల, దాన్నిచ్చి పెళ్లి చేయమంటానికి నీకు నోరెట్టా వచ్చిందే..?” అరిచాడు.
దాంతో భర్తని ఒప్పించలేక ఆ కోపాన్ని నీలిమీద చూపిస్తూ.. ఏదో ఒకవంకతో నీలిని కొడుతూ చిత్రహింసలు పెట్టసాగింది. కూతురి బాధలు చూడలేక, భార్యకు ఎదురు చెప్పలేక తనలో తనే కుమిలిపో సాగాడు నాగయ్య. నీలిని తన తమ్ముడికిచ్చి పెళ్లి చేయకపోతే ఉరేసుకుని చస్తానని సత్తెమ్మ బెదిరించడంతో.. ఏం చేయాలో పాలుపోక ఆలోచనలో పడిపోయాడు.
ఓరోజు భార్య పక్కఊర్లో పెళ్లికి వెళ్లటం గమనించి.. నీలిని తీసుకుని రాత్రికి రాత్రే దూరపు బంధమైన పోశమ్మ ఇంటికి వెళ్లాడు. విషయమంతా చెప్పి, పోశమ్మకు కొంత డబ్బు ఇచ్చి.. “దీన్ని ఏదోదారి నువ్వే సేయాలక్కా! నేనున్నా ఇక దానికి లేనట్టే! ఇకనుండి దానికి అన్నీ నువ్వే..” అంటూ కన్నీళ్లతో వేడుకొని, నీలిని ఆమె దగ్గర వదిలివెళ్లాడు. అప్పటి నుండి నీలి మంచిచెడ్డలన్నీ పోశమ్మే చూడసాగింది.
‘ఇంట్లో వయసులో ఉన్న తాగుబోతు కొడుకు. ఇదేమో ఈడొచ్చిన పిల్ల.. ఏటి చేయాలి రా బగవంతుడా?!’ అనుకుంటూ ఆలోచించి, ఆలోచించి.. ‘పెళ్లయితే తాగుడు మానతాడేమో లే! కానీ.. దాని తలరాత ఎట్టుంటే అట్టా జరుగుద్ది’ అనుకుంటూ.. రెండు నెలలు తిరగకుండా ఇద్దరికీ పెళ్లి చేసింది.
కొత్త పెళ్లాం మోజుల కొన్నాళ్లు తాగుడు జోలికి వెళ్లకుండా, సెంటర్లో ఉన్న చిల్లర కొట్లో గుమాస్తాగా చేరాడు నీలి మొగుడు. అంతో ఇంతో సంపాదిస్తూ బుద్ధిగా ఉంటున్న కొడుకుని చూసి..
‘కోడలు వచ్చిన వేళా విశేషం’ అనుకుంటూ ఎంతో సంబరపడిపోయింది పోశమ్మ.ఏడాది తిరిగేసరికి ఓ మగపిల్లాడు, రెండేళ్లకి ఓ ఆడపిల్ల పుట్టారు. మూడేళ్లు ఎంతో పద్ధతిగా ఉన్నవాడు కాస్తా.. మళ్లీ తాగుడికి అలవాటుపడి, ఏ పనీ చేయకుండా తల్లిని, పెళ్లాన్ని డబ్బుల కోసం వేధించసాగాడు. డబ్బులు ఇవ్వలేదని ఓరోజు కొడుకు కొట్టిన దెబ్బలు నడుముకి, కాళ్లకి బలంగా తగలడంతో.. ఏ పనీ చేయలేక ఎక్కువగా మంచంలోనే పడుకుండిపోతోంది పోశమ్మ. నీలే పగలంతా ఏదో ఒకపని చేసి అత్తకి, మొగుడికి, పిల్లలకి పెట్టి.. మిగిలితే తింటుంది లేకపోతే ఒక్కోరోజు మంచినీళ్లతో కడుపు నింపుకొంటుంది. తాగడం మానుకోమని తల్లి, పెళ్లాం ఎంతగా నచ్చ చెప్పాలని చూసినా, ఎంతగా బతిమాలినా..
“నా ఇట్టం.. మీరెవరే నాకు సెప్పటానికి! ఆడపెత్తనాలు సేసినారంటే సంపేత్తాను.. జాగర్త!” అంటూ వాళ్ల మీదకు ఒంటి కాలి మీదలేచేవాడు. కొడుకు ఆగడాలు, కోడలి బాధలు చూడలేక.. తన చేతకాని తనాన్ని నిందించుకంటూ లోలోన బాధపడిపోయేది పోశమ్మ.
‘ఇప్పుడు నన్ను సూడగానే అత్తమ్మ ఏటంటది? అసలు నాతో మాట్లాడుద్దా! ‘ఆడడిగిన కూరొండి పెడితే ఇంత గోరం జరిగేది కాదుకదే ముద నట్టపుదాన! నీ మూలంగా నా బిడ్డ అన్నాయంగా సచ్చిండు కదే.. ’ అంటూ సివంగిలా నా మీదపడి, నా జుట్టు పట్టుకుని కొట్టిద్దా..? జరిగిన గోరం ఎటూ జరిగిపోనాది. పోయినోడెటూ తిరిగి రాడు. సెట్టంత కొడుకు సత్తె ఓరికైనా కడుపుమండదా! ఇన్నాళ్లు ఆడి తిట్లు, తన్నులు బరించగాలేంది ఈరోజు అత్తమ్మ తిట్లోలెక్కా..’ అనుకొని, మనసు రాయి చేసుకొని.. అదిరే గుండెలతో స్టేషన్ లోపలికి నడిచింది నీలి.
పోశమ్మ ఎక్కడున్నదని అక్కడున్న కానిస్టేబుల్ని అడిగి తెలుసుకుని.. నేరుగా ఆ సెల్లు దగ్గరికి నడిచింది. కటిక నేలమీద గువ్వలా ముడుచుకొని అటు తిరిగి పడుకొని ఉన్న పోశమ్మని చూడగానే.. వరద గోదావరిలా దుఃఖం పొంగుకొచ్చింది. సన్నగా వస్తున్న ఎక్కిళ్ల శబ్దానికి ఇటుతిరిగి చూసింది పోశమ్మ.
“ఏటే నీలీ! నువ్వటే.. ఎందుకొచ్చినవే ఈడకి.. పిల్లలెట్లుండిరే?” ఆప్యాయంగా అడుగుతున్న అత్తను చూస్తుంటే మనసులో అప్పటివరకూ పడ్డ దిగులంతా పోయింది.
“నిన్ను సూడాలని నానొక్కదాన్నే వచ్చినాను అత్తమ్మా..” “ఎందుకే పిచ్చిదానా.. పిల్లల్ని ఇడిసిపెట్టి ఇంతదూరం వచ్చినావు..” “పిల్లల్ని సూత్తుండమని పక్కింటోల్లకి సెప్పినాన్లే! ముందీ గారెలు తిను..” పోశమ్మకి ఇష్టమని వస్తూవస్తూ దారిలో ఆటో ఆపి, కట్టించుకొచ్చిన గారెల పొట్లం పట్టుకొని.. కటకటాల్లో నుండి చెయ్యి ముందుకు జాపింది లేవటమే అతికష్టంమీద లేచి, కర్ర సాయంతో అడుగులో అడుగేసుకుంటూ నెమ్మదిగా వచ్చింది. ఓపిక లేకపోయినా కటకటాలను అనుకొని నిలబడి.. పొట్లం విప్పి ఆవురావురుమంటూ తింటున్న అత్తని చూస్తుంటే.. మళ్లీ కళ్లల్లో నీళ్లూరాయి. “ఎందుకు అత్తమ్మా.. ఎందుకిట్టా సేసినావు?” అత్తమ్మ వైపు జాలిగా చూసింది.
“నావల్లేగా నీకీ కట్టాలు.. నువ్విట్లా జైల్లో ఉంటే సూడలేనత్తమ్మా..!” “ఒసేయ్.. నోరు మూత్తావా లేదా! ఇంకోమాట మాట్లాడినావంటే ఊరుకోను! ముందీడ నుండి ఎల్లిపో!” అత్త కోపం చూసి అక్కడే ఉన్న ఎస్ఐగారి దగ్గరికి వెళ్లింది నీలి. “సారూ! మా అత్త తప్పేం లేదు సారూ..! మా అత్తకి ఆరోగ్యం కూడా సరిగాలేదు. ఆమెనిడిసి పెట్టండి సారూ.. మీకు దండమెడతాను” అంటూ కాళ్లు పట్టుకో బోయింది.
“ఏయ్.. ఏంటిది! లే.. లే! చెట్టంత కొడుకును తానే చంపానని ఆమె ఓపక్క చెబుతుంటే.. ఆమె తప్పేం లేదంటావేంటి? చాల్లేవమ్మా వెళ్లెళ్లు..” “సారూ! దానిమాటలేం పట్టించుకో మాకండి. నా కొడుకని సెప్పుకోవడం కాదుకానీ.. ఆడసలు మడిసే కాదు. రాచ్చసుడు. ఆడ్ని సేసుకున్నాక ఓ నాలుగేళ్లు సుకపడిందేమో?! ఈ ఆరేళ్ల నుండి రోజూ నరకమే దానికి. కూలో, నాలో సేసి పెళ్లాం బిడ్డల్ని సాకాల్సింది పోయి.. రోజూ తాగొచ్చి ఏదో ఒకవంక పెట్టుకుని దాన్ని సితక బాత్తుంటే.. నాకే పేనం గిలగిల్లాడిపోతుంది. మగోడు అన్నాక పెల్లాం పక్కలో తొంగుని ఆడు సుకపట్టం కాదు సారు! కట్టుకున్న పెళ్లాన్ని, కన్న బిడ్డల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్న. ఆల్లకు ఏ కట్టం రాకుండా సూసుకోవాల్న. ఈడూ ఉన్నాడు.. ఎందుకూ! గవర్నమెంట్ వాళ్లు నెలనెలా నాకిచ్చే పెన్షన్ డబ్బులు తన్నిమరీ లాక్కుంటాడు.
అది సేసే కూలి డబ్బులు కూడా లాక్కొని తాగుడుకి తగలేత్తాడు.. ఓరూ సూడకుండా రేసన్ బియ్యం కూడా అమ్ముకొంటాడు సారూ..! పైసా సంపాదించి పెళ్లాం బిడ్డలకు కడుపునిండా కూడెట్టటం సేతకాదు కానీ.. పగలంతా రెక్కలు ముక్కలు సేసుకుని అందరికీ ఇంత ఉడకేసి పెట్టే పెళ్లాన్ని సావబాదటం మాత్తరం సేతనవుతాది! ఒళ్లు నొప్పుల్తో రేతిరంతా మూలుగుతూ కూడా.. తెల్లారగానే మల్లా పన్లోకెల్లక తప్పదు సారూ దానికి! సీతమ్మోరిలా ఎంతకొట్టినా బరిత్తుందని మరీ పెట్రేగిపోతుండు సారు. భూమాత కూడా కోపం వస్తే భూకంపాలు తెప్పిస్తదే.. కానీ, ఇది మాత్తరం అట్టాగే భరిత్తది సారు! పాపం.. దానికి వెనకాముందు ఎవరూ లేరు..!” ఆయాసంతో ఒక్కక్షణం ఆగి అందరివంకా చూసింది.
“రెండు దినాల నుండి జొరంతో ఉండి కూడా కూడండి పెట్టింది గందా! తిని తొంగొని సావక సేపల కూరొండలేదని కత్తిపీటట్టుకొని దాన్ని సంపటాని కొచ్చిండు.. నానెల్లి అడ్డుకోపోతే అదీపాటికి సచ్చుండేది. ఆడిని అడ్డుకోటానికని సేతికందిన రోకలిబండ తీస్కోని వాడినెత్తిమీద ఒక్కటేసిన.. సత్తాడనుకోలేదు సారూ!
సత్తే సావనీండి. ఎదవ సచ్చినోడు. అది మాత్రం నా అసుంటి ఆడదేగా! అదైనా ఎందాకని బరిత్తది సారూ! ఇకనైనా అది, పిల్లలు కడుపునిండా తిని కంటినిండా తొంగుంటారు. మీరే సెప్పండి సారూ..! అట్టాంటోడ్ని సంపటం నాయమేగందా! నాను సేసింది తప్పా సారూ..?” ఎంతో ఆవేశంగా, అమాయకంగా చెబుతున్న పోశమ్మవైపు ఎస్ఐతోపాటు అక్కడ ఉన్న రైటరు, కానిస్టేబుల్స్ అందరూ జాలిగా చూడసాగారు. “ఒసేయ్.. నీలీ! ఇట్రాయె..”’.. ఓ క్షణం ఆగి నింపాదిగా గాలి పీల్చుకుంటూ పిలిచింది. “నేనీడ బానే ఉన్నాను కానీ, నా గురించి బాధపడమాక. రేపోమాపో పోయేదాన్ని. యాడున్నా ఒకటే నేను”
రెండు చెవులకి ఉన్న దుద్దులు తీసి.. “ఇంద!” అంటూ చేతికిస్తున్న అత్తవైపు ఓసారి అయోమయంగానూ, ఆశ్చర్యంగాను చూడసాగింది నీలి.
అది గమనించి..
“ఒసే నీలీ..! అయి బంగారం దుద్దులేనే.. నాపెళ్లప్పుడు నా పుట్టింటోళ్లు ఎట్టినారు. ఈటినిగూడా తీస్కపోయి ఆడెక్కడ అమ్ముకొని తాగుడుకి తగలేత్తాడోనని.. ‘సింకలపూడి బంగారం’ అని అబద్ధమాడాను. తీస్కపోయి అమ్మేసి, ఆడికి సేయాల్సిన దినవారాలన్నీ జరిపించవే! మిగిలిన డబ్బులు నీ కర్ములకుంచుకో. ఇంట్లో డబ్బుల్లేవాయె! కొన్ని దినాలపాటు నువ్వు ఏడకి ఎల్లకూడదుగా! జరిగిందంతా మర్సిపోయి బిడ్డల్నిబాగా సూసుకో. నీ మనసులో ఎట్టాంటి ఆలోశనలు పెట్టుకోమాకు. నువ్వు లేకపోతే నీ బిడ్డలు అనాథలవుతారే! నువ్వు, బిడ్డలు జాగర్త” అంటూ.. నిలబడలేనట్లు మెల్లిగా వెళ్లి నేలమీద చతికిల పడింది. అత్త ఇచ్చిన దుద్దులు చెంగుకు ముడేసుకుని కన్నీళ్లతో వెనుదిరిగింది నీలి.
ఆటో ఎక్కిన నీలికి.. నాలుగు రోజుల క్రితం జరిగినదంతా ఒక్కసారిగా కళ్లముందు కదలాడింది. “ఏటే.. ఈ ఏలప్పుడు పడుకున్నావ్? లే.. లేసి కూడెట్టు”.. ఫుల్గా తాగి, మధ్యాహ్నం అన్నానికి వచ్చిన ఏడుకొండలు.. నిలబడినట్టుగా తూలుతున్నాడు. “అరేయ్.. దానికి రేతిరి నుండి ఒకటే జోరం. మూసిన కన్ను తెరవకుండా పడుంది. ఇయ్యాల పన్లోక్కూడా ఎల్లలేదు. ఎట్టాగో లేసి ఇంత అన్నమొందినాది. దాన్ని లేపక ఎల్లిపెట్టుకొని తిను..”
బయట నులక మంచం మీద పడుకుని అంతా చూస్తున్న పోశమ్మ.. కొడుకుతో అన్నది. గిన్నెల మీద మూతలు తీసి.. “కూరేదే?! కూరలేందే దేంతో తినమంటావ్? సికెనేపుడో, సేపల పులుసో వండమని పొద్దుపొద్దున్నే సెప్పెల్లినానుగా! మొగుడంటే అంత సీపై పోనాడటే నీకు?”.. విసురుగా వచ్చి నీలి పడుకుని ఉన్న మంచాన్ని ఓ తన్ను తన్నాడు.
రాత్రి మస్తుగా తాగొచ్చి తన్నిన తన్నులకి ఒళ్లంతా నొప్పులతో జ్వరం వచ్చి.. అప్పుడే మంచినిద్ర పట్టిన నీలికి, ఒక్కసారిగా మంచం కదలటంతో మెలకువవచ్చింది. “అన్నంలోకి కూరేం సేయకుండా దొరసానిలా తొంగున్నావేటే! లే.. లేసిముందు నాకు సికెనేపుడో, సేపల పులుసో వండి అన్నమెట్టవే..”
“ఎల్లి సికెనో, సేపలో అట్టుకురా! ఇప్పుడే వండెడతాను..” లేని ఓపిక తెచ్చుకుంటూ అన్నది నీలి.
“నాను తెత్తే నువ్వొండి పెట్టేదేటే.. మొగుడంటే అంత సులకనై పోనాడే నీకు! లే.. లేసి ముందు నాకు సేపల పులుసొండి పెట్టు..” “దానికసలే పేనం బాగోలేదంటే ఇనవేందిరా! ఈ పూటకి పచ్చడో, కారమో ఏసుకుని తిని సావు..” కొడుకు మొండితనం చూసి విసుక్కుంది పోశమ్మ.
“నువ్వు నోరు ముయ్యహే! పెతిదానికి దాన్ని ఎనకేసుకొత్తావు. నువ్వసలు నా కన్నతల్లివేనా..? అరే.. బిడ్డింటికచ్చిండు. ఆడికి నచ్చిన కూరొండి పెట్టమని దానికి సెప్పాల్సింది పోయి.. దాన్నే ఎనకేసుకొత్తావేటే! ముందు నిన్ను నాలుగు తంతేగాని దానికి బుద్ధి రాదే..” ఊగిపోతూ తల్లి మీదికి వెళ్లబోయాడు.
“ఆగయ్యా! అత్తమ్మనేం సేయకు..” అంటూ, లేని ఓపిక తెచ్చుకొని పరుగున వెళ్లి అడ్డునిలిచింది నీలి. “ముందు నాకు సేపల పులుసొండి బువ్వెట్టవే..” నిలబడలేక తూలుతున్నాడు ఏడుకొండలు. “నాకాడున్న డబ్బంతా అట్టుకెళ్లి ఫుల్లుగా తాగొస్తివి. ఏవెట్టి సేపలట్టుకు రానూ..” “దీని సిగధరగా.. మల్లీ అదే కూతా..? నాకే ఎదురు సెప్తావటే! ఉండు, నీ సంగతేంటో ఇప్పుడే తెలుత్తా.. ఇయ్యాల అటో, ఇటో తేలిపోవాల్న” అంటూ.. దగ్గర్లో ఉన్న కత్తిపీట తీసుకుని..
“ఏసేత్తానే.. దొంగలం.. ఒక్కేటుతో సత్తావ్..” అంటూ మీదికి రాబోయాడు “ఒరే.. ఒరే! ఏటి సేత్తన్నపురా దాన్ని. సచ్చుద్దిరా అది..” అంటూ మంచంలో నుండి లేవటానికి ప్రయత్నించి, అతికష్టం మీద లేచింది పోశమ్మ. ఇంతలోనే నీలిని కింద పడేసి, ఓ చేత్తో జుట్టు పట్టుకొని.. మరో చేత్తో కత్తిపీట పైకెత్తాడు.
“నానంటే అంత సీపై పోనానటే నీకు. ఈ రోజుతో నా సేతిలో అయిపోనావే..” అంటూ ఆవేశంతో ఊగిపోసాగాడు. భయంతో వణికిపోయింది నీలి.
‘అయిపోయింది.. ఈ రోజుతో నా పని అయిపోయింది..’ అనుకోగానే.. ఎక్కడలేని తెగింపు వచ్చింది. కుడికాలెత్తి మొగుడి పొట్టలో ఒక్కతన్ను తన్నింది. తాగిన మత్తులో తూలుతున్న భర్త కాస్త.. అంతదూరాన వెల్లకిలా పడిపోయాడు. చేతిలో కత్తిపీట జారిపోయింది. “నన్నే తంతావటే! నీకు ఈరోజు నా చేతిలో మూడిందే..” పక్కకి తిరిగి కత్తిపీట అందుకోబోయాడు. అది చూడగానే ఎక్కడలేని తెగింపు వచ్చింది నీలికి. ప్రాణం మీదకి వస్తే పిల్లి కూడా పులి అవుతుందంటారు. లేని ధైర్యం తెచ్చుకొని మూలన ఉన్న రోకలి బండ తీసుకుని..
“రేయ్! సంపరా.. సంపు! నిన్ను సేసుకున్న ఈ పదేల్ల నుండి రోజూ సంపుతానే ఉంటివికదరా! సచ్చినదాన్ని ఇంకేం సంపుతావు గానీ.. ఇయాల నాను నిన్ను సంపుతాను సూడరా”.. భద్రకాళిలా ఊగిపోతూ బలమంతా రెండు చేతుల్లోకి తెచ్చుకొని పైకి లేవబోతున్న మొగుడి నెత్తిన ఒక్కటేసింది. అంతే.. తల పగిలి రక్తం చివ్వున బయటకు వచ్చి మొహమంతా కారసాగంది “సచ్చాన్రో దేవుడో!” అంటూ వెర్రికేక పెట్టి, రెండు చేతులతో తల పట్టుకొని వెల్లికిలా పడిపోయాడు.
‘రోజూ ఉండే గొడవేలే!’.. అని అప్పటివరకూ ఇళ్లల్లో నుండి బయటికి రాని ఇరుగుపొరుగు వాళ్లంతా.. ఏడు కొండలి కేకతో ఏం జరిగిందోనని ఒక్కసారిగా బయటికి రాసాగారు. అదిచూసి లేని ఓపిక తెచ్చుకుని గబాగబా నాలుగడుగులు ముందుకేసి, నీలిచేతుల్లో నుండి రోకలిబండ లాక్కుంది పోశమ్ము. జనమంతా.. రెప్పలార్పడం కూడా మర్చిపోయి శూన్యంలోకి చూస్తూ బొమ్మలా నిలబడిపోయిన నీలిని, రోకలిబండతో రొప్పుతూ నిలబడిన పోశమ్మని, మొహం మీదగా రక్తం కారుతూ.. భయంకరంగా కనిపిస్తూ, చలనం లేకుండా కిందపడి ఉన్న ఏడుకొండలునిఇ మార్చిమార్చి చూడసాగారు.
“ఏటే పోశమ్మా..! ఏటి జరిగినాదే?” వచ్చిన వాళ్లలో ఓ పెద్దాయన అడిగాడు. “కత్తిపీటట్టుకొని దాన్ని సంపటానికొత్తే.. రోకలి బండతో ఒక్కటేసినా..” మొహంలోఏ భావము లేకుండా చెప్పింది పోశమ్మ. “అంటే! చంపేసినావా ఆడ్ని?” “ఏమో! సచ్చిండో, బతికుండో సూడ్లే..” పోశమ్మ సమాధానం వినగానే అక్కడున్న వాళ్లలో ఒకరు ఏడుకొండలు దగ్గరికెళ్లి ముక్కు దగ్గర వేలు పెట్టి చూసాడు.
“నీ కొడుకుని సంపేసినావ్ కదే ముసిల్దానా” అన్నాడు పోశమ్మ వైపు చూసి. కాసేపటికి పోలీసులు, అంబులెన్సు రావడం.. పోశమ్మని పోలీస్ స్టేషన్కి, శవాన్ని పోస్టుమార్టం కోసం హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగిపోయింది.
ఆటో కుదుపుతో ఆలోచనల్లో నుండి బయటపడింది నీలి. ‘నువ్వు మాత్తరం ఏం సుకపడ్డావు అత్తమ్మా! సిన్నతనంలోనే మామ సనిపోయి, తాగుబోతు కొడుకు చేతిలో పెతిరోజా సావుదెబ్బలు తింటూ.. ఇప్పటిదాకా బాదలుపడతానే ఉంటివి. ఇప్పుడేమో నా బిడ్డలు అన్నాయమై పోతారని.. నాను సేసిన ఈ గోరాన్ని నీ మీదేసుకుంటివి. ఈ వయసులో జైల్లో ఎట్టా ఉంటావో.. ఏటో! ఆలోసిత్తుంటేనే బయమేత్తంది. నా బిడ్డల కోసం ఇంత త్యాగం సేసిన నువ్వు.. నువ్వు.. నిజంగా అత్తమ్మవి కాదు.. అమ్మవి. కాదుకాదు.. నా పాలిట అమ్మోరు తల్లివి. అప్పో సొప్పో సేసి నా తిప్పలునాను పడతాను గానీ, ఈ దుద్దులు మాత్తరం అమ్మను. అత్తమ్మ గురుతుగా దాసుకుంటాను. కొంగుకి కట్టిన దుద్దుల మూటని కళ్లకద్దుకుంటూ.. మనసులోనే పోశమ్మకి దండం పెట్టుకున్నది.
ప్రాణం మీదికి వస్తే.. పిల్లి కూడా పులి అవుతుందట. అలా, ఓ తాగుబోతు భర్తను ఎదురించిన మహిళ కథే.. అమ్మోరు తల్లి. రచయిత్రి కె.రాజేశ్వరి. పుట్టింది గుంటూరులో. ప్రస్తుతం స్థిరపడింది బాపట్లలో. గృహిణిగా కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే.. రచనా వ్యాసంగాన్నీ కొనసాగిస్తున్నారు. హాస్యకథలు, లలిత శృంగార కథలు, కుటుంబ నేపథ్యంతో కూడిన కథలు రాస్తుంటారు. వీరు రాసిన మొదటి కథ స్వాతి’లో వచ్చింది. ఇప్పటివరకూ దాదాపు అరవై కథలవరకు ఆంధ్రభూమి (దిన, వార, మాసపత్రికలు ), నవ్య, స్వాతి, ఈనాడు, విపుల, ఆంధ్రప్రభ (ఆదివారం అనుబంధం), సాహితీ కిరణం, రమ్యభారతి, అక్షరాంజలి, విశాఖ సంస్కృతి, విశాలాంధ్ర పత్రికల్లో ప్రచురితమయ్యాయి. వివిధ సాహితీ సంస్థలు నిర్వహించిన కథల పోటీలలో.. పదికథల వరకూ బహుమతులు అందుకున్నారు. సుబ్బాయమ్మ టీవీ ప్రోగ్రాం, పాపం శ్రీవారు, ఆఫ్టర్ వన్మంత్, ఓస్.. ఇంతేనా లాంటి హాస్య కథలతోపాటు, మౌనమేలనోయి, ఎవరికెవరు, అభిమానం హద్దులు దాటితే, కల చేసిన మేలు కథలు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీ పీఠం నిర్వహించిన కథల పోటీల్లో బహుమతి గెలుచుకోవడం.. ఇది రెండోసారి.
– కే రాజేశ్వరి
77807 91215