కనీసం ఏడాదిపాటు దేశ ప్రజ లు బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండాలని ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విదేశాల నుంచి దేశంలోకి వచ్చే పసిడి, వెండి దిగుమతులపై వసూలు చేసే కస్టమ్స్ సుంకం, సెస్సును గరిష్ఠంగా 15 శాతానికి పెంచిన సంగతీ విదితమే. అంతేగాక దిగుమతులపైనా పరిమితుల్ని విధించి నగల ఎగుమతిదారులకు షాకిచ్చారు. దీంతో పుత్తడిపై పెట్టుబడులు పెట్టినవారిలో ఒక్కసారిగా గుబులు మొదలైంది. ఇకపై పెట్టాలనుకునేవారూ అయోమయంలో పడ్డారు. మరి మార్కెట్ నిపుణుల మాటేంటి?
కేంద్ర ప్రభుత్వం ఈ నెల 13న బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఈ దెబ్బకు మల్టీ కమోడిటీ ఎక్సేంజ్ ఆఫ్ ఇండియా (ఎంసీఎక్స్)తోపాటు ప్రముఖ జ్యుయెల్లరీ షోరూంలలో ధరలు భారీగా పెరిగాయి. ఢిల్లీ స్పాట్ మార్కెట్లోనూ 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల పుత్తడి రేటు ఈ ఒక్కరోజే రూ.8,550 ఎగిసి రూ.1,65,350గా నమోదైంది. మరోవైపు కిలో వెండి ధర రూ.20,500 ఎగబాకి రూ.2,97,500కు చేరింది. చాలా గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్ల (ఈటీఎఫ్)లో సైతం ధరలు 5 శాతం వరకు ఎగిశాయి. ఫలితంగా పెరుగుతున్న ధరలు.. ఇన్వెస్టర్లను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ధరలు పెరిగినాకొద్దీ రాబడులపై సందేహాలు తలెత్తుతున్నాయి మరి. మార్కెట్ దిద్దుబాటుకు గురైతే ఏంటి? అన్న ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి.
అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు, కరెన్సీ ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం దృష్ట్యా ఇన్నా ళ్లూ బంగారంపై పెట్టుబడులు పెంచుకుంటూ వచ్చినవారు వాటిని అలాగే కొనసాగించుకోవచ్చని భారతీయ బులియన్ అండ్ జ్యుయెల్లర్స్ అసోసియేషన్ లిమిటెడ్ అధ్యక్షుడు, రిద్దిసిద్ది బులియన్స్ లిమిటెడ్ ఎండీ పృథ్వీరాజ్ కొటారీ అంటున్నారు. ముఖ్యంగా భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో సురక్షిత పెట్టుబడి సాధనంగా పసిడికి డిమాండ్ స్థిరంగా ఉంటుందని చెప్తున్నారు. అయితే పుత్తడిపై కొత్తగా మదుపు చేయాలనుకొనేవారు.. ఇప్పటికైతే వేచిచూసే ధోరణిని అవలంబించడమే ఉత్తమమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఉన్న సొమ్మును బంగారంపైనే పెట్టకుండా.. ఇతర పెట్టుబడి వేదికలపై పెట్టడం తెలివైన పని అని సూచిస్తున్నారు.
గోల్డ్ ఈటీఎఫ్‌లు, సావరిన్ గోల్డ్ బాండ్లు (ఎస్జీబీ) వంటి డిజిటల్, పేపర్ గోల్డ్ ఫార్మాట్స్‌ను కొత్త మదుపర్లు ప్రయత్నించవచ్చు. అయితే ఎస్జీబీలను ప్రస్తుతం జారీ చేయట్లేదు. అయినప్పటికీ భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గనుక జారీచేస్తే తప్పక వాటిలో మదుపు చేయవచ్చు. ప్రభుత్వ భరోసా ఉంటుంది కాబట్టి ఇవి సురక్షిత పెట్టుబడి సాధనాలు. ఇక భౌతిక రూపంలో నగలు, ముఖ్యంగా తేలికపాటి ఆభరణాలు, కడ్డీలు, నాణేలను కొనుగోలు చేయవచ్చు. ఇవి అటు వినియోగానికి, ఇటు పెట్టుబడికి అనువుగా ఉంటాయని సెన్కో గోల్డ్ అండ్ డైమండ్స్ ఎండీ సువంకర్ సేన్ సలహా ఇస్తున్నారు.
ప్రస్తుతం పసిడి అమ్మకాలు, కొనుగోళ్లు, పెట్టుబడులపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నా.. దీర్ఘకాలంలో సురక్షితమేనని, ఆకర్షణీయ రాబడులకే ఎక్కువ అవకాశాలున్నాయని సెన్కో గోల్డ్ అండ్ డైమండ్స్ ఎండీ, సీఈవో సువంకర్ సేన్ చెప్తున్నారు. అనిశ్చిత పరిస్థితుల్లో సురక్షిత పెట్టుబడి సాధనంగా ఎప్పటికైనా పసిడినే పేర్కొనవచ్చని అంటున్నారు. అయితే ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం తీరుతెన్నులు, సెంట్రల్ బ్యాంకుల వడ్డీరేట్లు, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, కరెన్సీ ఒడిదుడుకులు వంటివి గోల్డ్ మార్కెట్‌ను ప్రభావితం చేస్తుంటాయని తెలిపారు. వీటిని గమనిస్తూ నిర్ణయాలు తీసుకుంటే రాబడులు ఆశించిన స్థాయిలో అందడానికి ఆస్కారం ఉందన్నారు. మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహమ్మద్ సైతం ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు.
కస్టమ్స్ డ్యూటీ పెంపు వంటి పాలసీ మార్పు నిర్ణయాలకు భయపడనక్కర్లేదు. పసిడిపై పెట్టుబడులు పెట్టిన ప్రస్తుత మదుపర్లు ఈ స్వల్పకాలిక ఒడిదుడుకులను పట్టించుకోవద్దు. తమ దీర్ఘకాలిక లక్ష్యాలపైనే దృష్టి సారించాలి. అయితే కొత్త మదుపర్లు మాత్రం పసిడిపై పెట్టుబడిని ఓ స్వల్పకాలిక ట్రేడింగ్ అవకాశంగానే చూడకుండా.. సంపద పరిరక్షణ, వైవిధ్య సాధనంగా చూస్తే మరింత వివేకవంతమైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ఏదిఏమైనా దిగుమతులపై సుంకాల పెంపుతో దేశీయంగా బంగారం, వెండి ధరలు పెరుగుతాయి. అయినప్పటికీ దీర్ఘకాలంలో పుత్తడి విలువ చెక్కుచెదరదు. ఇక పశ్చిమాసియా సంక్షోభం ప్రభావం దృష్ట్యా మరో ఏడాదికాలం దిగుమతి సుంకాలు గరిష్ఠ స్థాయిలోనే ఉండవచ్చనిపిస్తున్నది.
ఈ దిగుమతి సుంకాల పెంపుతో రిటైల్ మార్కెట్లో ధరలు పెరిగే వీలున్నది. అయినప్పటికీ భారతీయ వివాహ, పొదుపు, సంస్కృతి-సంప్రదాయాలకు బలమైన మూలాలున్నాయి. కాబట్టి బంగారానికి ఆదరణ స్థిరంగానే ఉంటుందని చెప్పవచ్చు. అయితే తొలిసారి పసిడిపై పెట్టుబడులకు దిగేవారు తాజా పరిస్థితులతో తమ నిర్ణయాలను పునఃసమీక్షించుకునే అవకాశాలున్నాయి.
పశ్చిమాసియా సంక్షోభంతో పెరిగిన ముడి చమురు ధరల వల్ల వచ్చిన పరిస్థితి ఇది. ఫారెక్స్ రిజర్వులను కాపాడుకోవాలని క్రూడాయిల్ తర్వాతనున్న బంగారం దిగుమతులకు కళ్లెం వేయాలని కేంద్ర ప్రభుత్వం భావించింది మరి. అయితే భౌతిక బంగారం విషయంలోనే సుంకాల పెంపు, ఆంక్షల్ని తీసుకొచ్చింది. కానీ డిజిటల్ గోల్డ్‌ను ప్రోత్సహిస్తూనే ఉన్నది. దీన్ని ఇన్వెస్టర్లు అందిపుచ్చుకోవాలి. ప్రస్తుతం డిజిటల్ గోల్డ్ వేదికల్లో పెట్టుబడులకు ఎన్నో అవకాశాలున్నాయి. వాటిని పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకోండి.
-మార్కెట్ విశ్లేషకులు