Petrol | దేశంలో ఇంధన ధరలు మరోసారి పెరగడంతో సామాన్య ప్రజలకు అదనపు భారం తప్పడం లేదు. ప్రభుత్వ చమురు రంగ సంస్థలు తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. లీటర్ పెట్రోల్‌పై రూ.2.61, లీటర్ డీజిల్‌పై రూ.2.71 పెంపు అమల్లోకి వచ్చింది. ఈ కొత్త ధరలు సోమవారం నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రానున్నాయి. ఇది పది రోజుల వ్యవధిలో జరిగిన నాలుగో ధరల పెంపు కావడం గమనార్హం. వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలతో ఇప్పటికే సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, తాజా పెంపు మరింత భారాన్ని మోపనుంది. గత పది రోజుల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు కలిపి లీటరుకు దాదాపు రూ.8 వరకు పెరిగినట్లు తెలుస్తోంది.
తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.12కు చేరుకోగా, డీజిల్ ధర రూ.95.20కు పెరిగింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ.115.58కు చేరుకోగా, డీజిల్ ధర రూ.103.74కు పెరిగింది. అలాగే విజయవాడలో పెట్రోల్ ధర రూ.117.19, డీజిల్ ధర రూ.104.88కు చేరింది. ఇంధన ధరల పెరుగుదల వెనుక అంతర్జాతీయ పరిణామాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. చమురు సరఫరాలో అంతరాయాలు ఏర్పడే అవకాశాలు ఉండటంతో గ్లోబల్ మార్కెట్లో ధరలు ఎగబాకుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ముడి చమురు ధరల ప్రభావాన్ని చమురు మార్కెటింగ్ సంస్థలు నేరుగా వినియోగదారులపై మోపుతున్నాయని తెలుస్తోంది. ఇంధన ధరల పెరుగుదల ప్రభావం కేవలం వాహనదారులపైనే కాకుండా రవాణా ఖర్చులు, నిత్యావసర వస్తువుల ధరలపై కూడా పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక రాబోయే రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు ఎలా ఉంటాయనేదానిపై ఇంధన ధరల భవిష్యత్ ఆధారపడి ఉండనుంది. ధరల పెరుగుదల ఇలాగే కొనసాగితే సామాన్య ప్రజలపై మరింత ఆర్థిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.