ఖైరతాబాద్, మే 24: పది కోట్లు తీసుకొని 200 కోట్ల విలువైన భూమిని వదులుకోవాలంటూ అధికార పార్టీ ఎంపీ ఒత్తిడి చేస్తున్నారని అనన్య ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు నితీశ్ విజయ్ వర్గియా, అశోక్‌రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వారు ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాచారం గ్రామంలోని సర్వే నంబర్లు 93, 94, 95, 97, 98, 99లోని 34ఎకరాల 25 గుంటల భూమికి గత హక్కుదారులైన కంపెనీ దివాలా తీయడంతో పెట్టుబడి పెట్టిన వారు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించినట్టు తెలిపారు. 2023 ఫిబ్రవరిలో ఈ స్థలాన్ని ఎన్సీఎల్టీ కోర్టు వేలంలో రూ.35కోట్లు చెల్లించి తాము సొంతం చేసుకున్నామని పేర్కొన్నారు.
బకాయిదారుల బాకీల చెల్లింపులు కూడా పూర్తయినట్టు తెలిపారు. తాజాగా హెచ్ఎస్ఆర్ కంపెనీ యజమానిగా చెబుతున్న శ్రీనివాస్‌రెడ్డి ఈ సంస్థతో 2018లోనే అగ్రిమెంట్ చేసుకున్నానని ముందుకు వచ్చాడని తెలిపారు. 2018 నుంచి 2023 వరకు కనీసం కోర్టుకు రాని శ్రీనివాస్‌రెడ్డి తనకు క్లయిమ్ కాలేదంటూ మెలికపెట్టాడని, అయితే ఆ అగ్రిమెంట్ చెల్లదని ఇప్పటికే కోర్టు చెప్పిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ భూమిని కబ్జా చేసేందుకు కాంగ్రెస్ మాజీ మంత్రి కొడుకైన అధికార పార్టీ ఎంపీ యత్నిస్తున్నాడని ఆరోపించారు. ప్రస్తుతం ఈ భూమిని మూడేండ్లుగా మ్యుటేషన్ చేయకుండా అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. దీనిపై కలెక్టర్, ఆర్డీవోలను కలిసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఎంపీ ఒత్తిడి ఉన్నదని మ్యుటేషన్ చేయమంటున్నారని తెలిపారు.
తమ భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయిస్తే తమపైనే తప్పుడు కేసులు పెట్టారని నితీశ్, అశోక్‌రెడ్డి వాపోయారు. ఎన్సీఎల్టీ కోర్టు ద్వారా తీసుకున్న భూమిపై తప్పుడు కేసులు ఎలా పెడుతారని, ఇది ఏ చట్టంలో ఉన్నదని ప్రశ్నించారు. ఈ కేసును సీసీఎల్‌కు బదిలీ చేయగా, ఏసీపీ నర్సింహారెడ్డి తమను పిలిపించుకొని బెదిరిస్తున్నారని తెలిపారు. ఆ ఎంపీతో సెటిల్ చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నారు.
ఓఆర్ఆర్ ఎగ్జిట్ నం.10లో ఉన్న ఈ భూమి ప్రస్తుత మార్కెట్ ధర రూ.200 కోట్లకు పైగా ఉంటుందని తెలిపారు. రూ.10కోట్లకు వదులుకోవాలని సీసీఎస్ పోలీసుల ద్వారా ఎంపీ ఒత్తిడి చేస్తున్నాడని పేర్కొన్నారు. సీసీఎల్‌లో పోలీసులు ఉదయం నుంచి రాత్రి వరకు కూర్చోబెడుతున్నారని, టార్చర్ చేస్తున్నారని వాపోయారు. కోర్టు ఇచ్చిన తీర్పును ధిక్కరిస్తూ తప్పుడు కేసులు పెట్టారని, సీఎం రేవంత్ జోక్యం చేసుకోవాలని కోరారు. లేకుంటే సుప్రీంకోర్టు వరకు వెళ్లయినా న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు.