Gambling | మెదక్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): పాపన్నపేట పోలీసులు జూదం ఆడుతున్న వక్తులపై కొరడా ఝళిపించారు. జూదం (హెడ్ అండ్ టెయిల్) ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశామని మెదక్ ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. శనివారం మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని కొత్తపల్లి గ్రామ శివారులో జూదం ఆడుతున్నట్టు నమ్మదగిన సమాచారం రావడంతో దాడి చేసి అరెస్ట్ చేశామని ఆయన వెల్లడించారు.
సీసీఎస్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి బృందం పాపన్నపేట మండలం, కోత్తపల్లి గ్రామ శివారు పరిధిలోని అనంతపద్మనాభస్వామి దేవాలయం సమీపంలో అక్రమంగా హెడ్ అండ్ టెయిల్ జూదం ఆడుతున్న వారిపై ఆకస్మిక దాడి చేశారన్నారు. ఈ దాడిలో అరిగెల్ల చిన్ని, బందెల గోపాల్, ఉప్పరి వీరేశం, ఉప్పరి రమేష్, సాలె రాములు, నాగజోలా రమేష్ అదుపులోకి తీసుకొని, వారి నుంచి రూ.31,433 నగదు, 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారన్నారు.
నగదు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని నిందితులను పాపన్నపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటనపై పాపన్నపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారన్నారు. మెదక్ జిల్లాలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
జూదం, పేకాట, బెట్టింగ్ వంటి కార్యకలాపాల వల్ల అనేక కుటుంబాలు నష్టపోతున్నాయని, ముఖ్యంగా యువత తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆలోచనలతో తప్పుదారులను ఎంచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడకుండా ఏదీ సాధ్యం కాదని, ప్రజలు కూడా ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేసి సహకరించాలని జిల్లా ఎస్పీ సూచించారు.