కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను పారదర్శకంగా అమలు చేస్తుందని అటవీ, దేవాదాయశాఖల మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి కొండా సురేఖ అన్నారు. కౌలు రైతులకూ రైతుభరోసా వర్తింపుపై సీఎం నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. బుధవారం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజాపాలన సన్నాహక సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఆరు గ్యారంటీల అమలు కోసం ప్రజాపాలనతో వివరాలు సేకరిస్తున్నామన్నారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను సమగ్రంగా విచారించిన తర్వాత ఆరు గ్యారంటీల అమలుపై ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేస్తుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన మంచి కార్యక్రమాలను కొనసాగిస్తామన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రొటోకాల్ పాటించడంలేదని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, సునీతారెడ్డి, చింతా ప్రభాకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సులు లేక మహిళలు ఇబ్బందులు పడుతున్నారని, బస్సుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు.
సంగారెడ్డి, డిసెంబర్ 27(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను గుడ్డిగా అమలు చేయదని రాష్ట్ర అటవీ, దేవాదాయశాఖ మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి కొండా సురేఖ అన్నారు. కౌలు రైతులకు సైతం గుడ్డిగా డబ్బులు ఇవ్వమని, సమగ్ర విచారణ తర్వాతే రైతుభరోసా వర్తింపుపై సీఎం రేవంత్ నిర్ణయం తీసుకుంటారని అన్నారు. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజాపాలన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరు గ్యారంటీల అమలుకోసం ప్రజాపాలన ద్వారా డాటా సేకరిస్తున్నామన్నారు. వచ్చిన దరఖాస్తులను సమగ్రంగా విచారించిన తర్వాత ఆరు గ్యారంటీల అమలుపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేస్తుందన్నారు. ప్రభుత్వం జారీ చేసి మార్గదర్శకాలకు అనుగుణంగా ఆరు గ్యారంటీలను లబ్ధిదారులకు వర్తింపజేస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాలను తమ ప్రభుత్వం కొనసాగిస్తుందన్నారు. రైతుబంధు పథకం అమలుపై గతంలో మాజీ సీఎం కేసీఆర్ తన అభిప్రాయం కొరితే ఐదు నుంచి పది ఎకర్లాలోపు రైతులకు పథకం వర్తింపజేయాలని సూచించినట్లు చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ మాత్రం అందరికీ రైతుబంధు వర్తింపజేయాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. తెలంగాణ ఉద్యమకారులు తమ పేరిట నమోదైన కేసులు, జైలులో ఉన్న వివరాలు తెలుపాలన్నారు. వాటి ఆధారంగా ఆర్హులైన వారిని గుర్తించి ఇంటి స్థలం అందజేస్తామన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో గురువారం నుంచి ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు చెప్పారు. ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా దరఖాస్తులు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొత్తరేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకోనున్నట్లు తెలిపారు. అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల్లో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నామన్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రొటోకాల్ పాటించడం లేదని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్లు ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, సునీతారెడ్డి, చింతా ప్రభాకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాపాలన సన్నాహాక సమావేశంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ ఇటీవల తన నియోజకవర్గంలో అధికారులు ప్రొటోకాల్ పాటించలేదన్నారు. ఈ విషయంలో అధికారులకు సరైన ఆదేశాలివ్వాలని మంత్రి కోరారు. కొత్త రేషన్‌కార్డుల కోసం అందరి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు. ఒకే రేషన్‌కార్డుపై వేర్వేరు పథకాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందో లేదో తెలియక ప్రజలు అయోమయానికి గురవుతున్నారన్నారు. రైతుభరోసా పథకం ప్రభుత్వం ఎప్పటి నుంచి అమలు చేస్తుందో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గంలో ప్రజాపాలన ఫ్లెక్సీలపై ఎమ్మెల్యేల ఫొటోలు వేయడంలేదన్నారు. ఆరు గ్యారంటీలను పారదర్శకంగా అర్హులైన వారందరికీ అమలుచేయాలని డిమాండ్ చేశారు. పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అర్హులకు కేటాయించాలన్నారు.
రైతుభరోసా అమలుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను పారదర్శకంగా అమలు చేయాలన్నారు. ప్రజాపాలనలో అందరి నుంచి దరఖాస్తులు స్వీకరించాలన్నారు. సరైన సంఖ్యలో బస్సులు లేక మహిళలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అద్దె బస్సులు నడపకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు తెలిపారు. ఆర్టీసీ సిబ్బంది మహిళా ప్రయాణికులపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని, ఇది సరైంది కాదన్నారు. దీనిపై మంత్రి కొండాసురేఖ మాట్లాడుతూ కొత్తరేషన్ కార్డులతోపాటు ఆరు గ్యారంటీలపై అందరి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఒకే రేషన్‌కార్డుపై వేర్వేరు పథకాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రొటోకాల్ సమస్యలు తల్తెత్తకుండా చూస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కక్ష సాధింపులు, వివక్షకు తావులేదని అర్హులైనవారందిరికీ పథకాలు వర్తింపజేస్తామన్నారు. ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికులపై దురుసుగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సునీతారెడ్డి, కొత్త ప్రభాకర్, మాణిక్‌రావు, సంజీవరెడ్డి, ఎమ్మెల్సీలు శేరి సుభాష్‌రెడ్డి, రఘోత్తం, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జడ్పీచైర్పర్సన్లు మంజుశ్రీజైపాల్‌రెడ్డి, రోజాశర్మ, హేమలత, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, సంగారెడ్డి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ రూపేశ్, మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్, అదనపు ఎస్పీ మహేందర్, సిద్దిపేట అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, అదనపు ఎస్పీ సురేందర్‌రెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా అధికారులు పాల్గొన్నారు.