చిన్నకోడూరు, మే 30 : నగల కోసం మహిళను పట్ట పగలే గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన చిన్నకోడూరు మండల పరిధిలోని కమ్మర్లపల్లిలో శుక్రవారం జరిగింది. పోలీసులు, గ్రామస్తుల తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గాలి బాల్లక్ష్మి (50) ఇంట్లో కిరాణ షాపు నడుపుతుండగా.. ఆమె భర్త సుధాకర్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కూతురు, కుమారుడు ఉండగా ఇద్దరి వివాహాలు జరిగాయి. కుమారుడు వెంకటేశ్ దంపతులు ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ హైదరాబాద్లోనే ఉంటున్నారు.
సుధాకర్ దంపతులు కమ్మర్లపల్లిలోనే ఉంటున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం సుధాకర్ ఆటో తీసుకొని సిద్దిపేటకు వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో గుర్తు తెలియని దుండగులు ఇంట్లో చొరబడి నిద్రిస్తున్న బాల్లక్ష్మిని వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోయగా రక్తపు మడుగులో పడి మృతి చెందింది. ఆమె మెడలో ఉన్న బంగారు అభరణాలు ఎత్తుకొని పారిపోయారు. సాయంత్రం భర్త సుధాకర్ ఇంటికి వచ్చి చూడగా భార్య రక్తపు మడుగులో పడి మృతి చెంది ఉండడంతో స్థానికులకు సమాచారం అందించాడు.
విషయం తెలుసుకున్న సిద్దిపేట ఏసీపీ రవీందర్రెడ్డి, సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను, ఎస్ఐ బాలకృష్ణ, ప్రొహిబిషన్ ఎస్ఐ సైఫ్ఆలీ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ రప్పించి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బంగారు అభరణాల కోసమే గుర్తు తెలియని దుండగులు మహిళను హత్య చేసి ఉంటారని ఎస్ఐ బాలకృష్ణ తెలిపారు.