గజ్వేల్, జూలై 21: వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి గులాబీజెండా ఎగురవేయాలని, కేసీఆర్ చేసిన అభివృద్ధ్దిని ప్రజలకు వివరించి ఓట్లు అడగాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ప్రజ్ఞాఫూర్లోని ఎస్ఎల్ఎన్ కన్వెన్షన్‌లో బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు. గజ్వేల్ ప్రతిష్టను పెంచింది కేసీఆర్ అని, పదేండ్ల కాలంలో ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. సిద్దిపేట జిల్లాలో 26 జడ్పీటీసీలకు 24 గెలివాలని, ఒకటో రెండో దిష్టితీసినట్లు కాంగ్రెస్‌కు ఉండాలన్నారు.
మెదక్ జడ్పీస్థానం గెలుచుకోబోతున్నామని, ప్రణాళికాబద్ధ్దంగా అందరం కలిసి కుటుంబంలాగా పనిచేయాలన్నారు. ఆత్మవిశ్వాసం ఉండాలి కానీ, అతి విశ్వాసం ఉండకూడదని సూచించారు. ఎట్లుండే తెలంగాణ ఎట్లా అయిందని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలన్నారు. ఆ రోజుల్లో నీళ్లు ఎట్లా వచ్చాయి, ఇప్పుడు ఎలా వస్తున్నాయని, కేసీఆర్ ఉండగా ఇంటింటా చెత్త సేకరణ జరిగేదని, ఇప్పుడే దిక్కులేదన్నారు. జీపీ ట్రాక్టర్లో డీజిల్ పోయించేందుకు పైసలులేక తాళాలు అప్పజెప్పి అధికారులు వెళ్లిపోయిన పరిస్థితి ఉందని హరీశ్‌రావు అన్నారు. చెత్త ఎత్తేవాళ్లులేరని, బుగ్గలు వేసేవాళ్లు లేరని, తాగునీటి పైపులను అతికించేవాళ్లు లేరని విమర్శించారు. కాంగ్రెస్ వచ్చినంక కొత్తగా చేసిందేమి లేదని, ఉన్నవి నడిపించే సత్తా లేదని ఎద్దేవా చేశారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలకు గుర్తు చేసి కేసీఆర్ పథకాలపై వివరించాలన్నారు.
కాంగ్రెస్ సర్కారు మోసంపై ఇంటింటా వివరించాలి…
అవ్వతాతలు, వితంతువులు, దివ్యాంగులకు పెన్షన్లు పెంచుతానని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రైతులకు ఎరువులు, విత్తనాలు, యూరియాను అందించలేని కాంగ్రెస్ సర్కార్‌పై ప్రజల్లో చర్చ పెట్టాలని, గతంలో ఏనాడు పాస్‌పుస్తకాలు యూరియా కోసం లైన్లలో పెట్టలేదని, కానీ.. కాంగ్రెస్ రాకతో మళ్లీ రైతులకు కష్టాలు మొదలయ్యాయని హరీశ్‌రావు అన్నారు. రైతులకు అన్ని పథకాలు సక్రమంగా అందాలంటే కాంగ్రెస్‌ను ఎన్నికల్లో ఓడగొట్టాలన్నారు. రైతులతో కేసీఆర్ పథకాలపై చర్చ పెట్టాలని, ఆనాడు పథకాలు ఎలా అందాయి, ఇప్పుడు ఎలా అందుతున్నాయో తెలియజేయాలని సూచించారు.
కాంగ్రెస్ సర్కారు రాకతో భూముల ధరలు తగ్గడంతో అమ్ముకుందామంటే కొనేవాళ్లు లేరని, రెండేండ్లలోనే తెలంగాణ ఆగమైందన్నారు. పాలన చేతకాక దిక్కుమాలిన మాటలు, ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని, కేసీఆర్ మళ్లా రావాలని.. సీఎంగా ఉండాలని ప్రజలంతా కోరుకుంటున్నట్లు హరీశ్‌రావు చెప్పారు. ప్రతి మహిళకు నెలకు రూ.2500 ఇస్తామని చెప్పి 20నెలలుగా ఒక్కొక్కరికి రూ.50వేలు కాంగ్రెస్ సర్కారు బాకీపడిందని, తులం బంగారం, ఆడపిల్లలకు స్కూటీ హామీలు అటకెక్కాయని, కేసీఆర్ కిట్ బంద్ పెట్టారని హరీశ్‌రావు ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన మాదిరిగానే రూ.5లక్షల వరకు మాత్రమే వడ్డీలేని రుణాలు ఇస్తూ రూ.20లక్షల వడ్డీలేని రుణాలు ఇస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని, దీనిపై సమాధానం చెప్పాలేక సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్కలు తప్పించుకుంటున్నారని హరీశ్‌రావు విమర్శించారు.
అన్నివర్గాలను మోసం చేసిన సీఎం రేవంత్…
యువత, మహిళలు, రైతులను అన్ని వర్గాలను రేవంత్‌రెడ్డి మోసం చేశారని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించారు. మన జిల్లా మీద పగబడ్డినట్టు చేస్తున్నారని, రూపాయి నిధులు ఇవ్వడం లేదని, పథకాలు ఆపారని హరీశ్‌రావు ఆరోపించారు. అందరం కలిసి కట్టుగా పనిచేసి మెజార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీ స్థానాలను గెలిపించుకోవాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. అభివృద్ధ్దికి కేరాఫ్ అడ్రస్ గజ్వేల్ అన్నారు. తాను మం త్రిగా ఉన్నప్పుడు వంటేరు ప్రతాప్‌రెడ్డి తనకు ఒక్క ఫోన్‌కాల్ చేస్తే కొడకండ్ల వద్ద కాలువకు గండిపెట్టి కూడవెల్లిలోకి నీళ్లు వదిలితే, అప్పర్‌మానేరు, ముస్తాబాద్ వరకు 40నుంచి 50వేల ఎకరాల్లో పంటలు పండాయని హరీశ్‌రావు గుర్తుచేశారు. హల్దీవాగులోకి నీళ్లు వదిలితే ఎర్రటి ఎండల్లో మత్తళ్లు దుంకాయని, గద్దర్ ఊరిలో నీళ్ల లిఫ్ట్ చేయాలని కోరితే లిఫ్ట్ చేస్తే ఆయన ఎంతో సంతోష పడ్డారన్నారు. సాగు, తాగునీళ్లు ఇచ్చి అభివృద్ధి చేసి, మన గౌరవాన్ని కేసీఆర్ నిలబెట్టారని హరీశ్‌రావు పేర్కొన్నారు.
మనవాళ్లు గెలిస్తే మనకే మంచిది…
వచ్చే ఎన్నికల్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు మనవాళ్లు గెలిస్తే మనకే లాభం ఉంటుందని, అందుకు ప్రతి ఒక్కరం కలిసికట్టుగా పనిచేయాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఎన్నికలకు సమాయత్తం కావాలని, ఇటీవల నిర్వహించిన సర్వేలో రాష్ట్రంలో 31జడ్పీ స్థానాల్లో 16నుంచి 18 వరకు బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందనే ఫలితాలు వచ్చాయన్నారు. ఎన్నికలను ఆషామాజీగా తీసుకోవద్దని అన్నారు. గజ్వేల్‌లో ఇసుక, మట్టి దందాలు పెరిగాయని, ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. నాలుగు నెలలుగా టీఏలు, ఎఫ్‌ఏలకు జీతాలు లేవని, మూడు నెలలుగా పారిశుధ్య కార్మికులకు జీతాలు రావడం లేదన్నారు. రేషన్ డీలర్లకు నాలుగు నెలల కమీషన్ ఇవ్వడం లేదన్నారు. ఎన్నికల రిజర్వేషన్లు వచ్చిన తర్వాతనే అభ్యర్థుల ఖరారు ఉంటుందని, అప్పటి వరకు ఎవరూ డబ్బులు ఖర్చు చేసుకోవద్దని హరీశ్‌రావు సూచించారు. కష్టపడిన వారికి కేసీఆర్ వద్ద తప్పకుండా గుర్తింపు ఉంటుందని హరీశ్‌రావు అన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.