సిటీబ్యూరో/అమీర్‌పేట, ఫిబ్రవరి 27(నమస్తే తెలంగాణ): బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో అవకతవకలపై మంత్రి కొండాసురేఖ సీరియస్‌గా స్పందించారు. గతంలో నమస్తే తెలంగాణలో వచ్చిన కథనాలపై ఆరా తీశారు. ఆలయంలో జరుగుతున్న అక్రమాలను తెలుసుకుని అధికారులతో పాటు సిబ్బందిపై చర్యలకు ఆదేశించారు. ఆలయ ఈవో శేఖర్, సూపరింటెండెంట్ హైమావతితో పాటు మరో ఐదుగురు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటూ ఆ శాఖ ఉన్నతాధికారులకు చెప్పారు.
కొద్ది రోజులుగా ఆలయంలో జరుగుతున్న అక్రమాలపై వస్తున్న వరుస ఫిర్యాదులపై స్పందించిన మ్రంతి కొండా సురేఖ శుక్రవారం ఎల్లమ్మ eలయంలో ఆకస్మిక తనిఖీలు చేశారు . అమ్మవారికి దాతలు సమర్పించుకున్న బంగారం, హుండీల ద్వారా వచ్చిన బంగారాన్ని భద్రపరిచే అంశాలపై నెలకొన్న లోటుపాట్లపై మంత్రి దృష్టి సారించారు. నమస్తే తెలంగాణలో భక్తులు ఇచ్చిన బంగారం పదిలమేనా అంటూ పదహారున్నర లక్షల నగను మాయం చేసిన ఉదంతంపై వచ్చిన కథనం ఆధారంగా చేసుకుని పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు.
ఆలయంలో ప్రసాదం తయారీ కేంద్రాన్ని సందర్శించిన కొండా సురేఖ, ప్రసాదం తయారీకి వాడుతున్న నెయ్యి, నూనె ఇతర వస్తువులను తనిఖీ చేశారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల నాణ్యతను సైతం తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. 200 గ్రాములు తూగాల్సిన పులిహోర ప్రసాదం 160 గ్రాములు మాత్రమే ఉండడం తనిఖీల్లో వెలుగు చూసింది. పరిశుభ్రకర వాతావరణానికి దూరంగా ఉన్న ప్రసాదం తయారీ కేంద్రం మొత్తాన్ని రీమోడలింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీసం ఈఎస్ఐ, ఈపీఎఫ్ వంటి ప్రాథమిక సదుపాయాలను కల్పించడంలో ఆలయ అధికారులు ఘోర వైఫల్యం చెందారన్నారు. ఆలయానికి చెందిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంశాల్లో స్పష్టత లోపిస్తోందని, దాతలు సమర్పించుకున్న ఖరీదైన చీరలు కాంట్రాక్ట్ పాడుకున్న వ్యక్తులకు కాకుండా అధికారులు వాటిని స్వాధీనం చేసుకుంటున్నారనే ఫిర్యాదులపై మంత్రి ఆగ్రహం ఎల్లమ్మ దేవాలయ నిర్వహణలో అకౌంటెంట్, సూపరింటెండెంట్, ఈవోలు దారుణంగా విపలమయ్యారన్నారు.
పరిపాలనా వ్యవహారాలకు సంబంధించి అనేక అంశాల్లో లోపించిన స్పష్టతపై మంత్రి సురేఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవ వివరాలకు, అధికారులు చూపుతున్న వివరాలకు మధ్య వ్యత్యాసం ఉంటుండడంతో వెంటనే ఫైళ్లు స్వాధీనం చేసుకుని, అల్మరాలకు సీల్ వేయాలని దేవాదాయ శాఖ ఏడీసీ శ్రీనివాస్‌రావును ఆదేశించారు ఉద్యోగుల హాజరు పట్టిక కూడా అస్తవ్యస్తంగా మారిందని, మొత్తంగా దేవాలయ పరిపాలనా వ్యవస్థ గాడి తప్పిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ శ్రీహరి అనే రెగ్యులర్ అటెండర్‌తో సహా రాము, నరసింహ, ప్రభాకర్‌రావు అనే ఔట్సోర్సింగ్ ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
పరిపాలన, పర్యవేక్షణ లోపాల కారణంగా దేవాలయ ఈవో శేఖర్, సూపరింటెండెంట్ హైమావతిలను సస్పెండ్ చేయాలని ,అర్చకుడు శ్రీనివాసాచార్యులకు మెమో ఇవ్వాలని ఆదేశించారు. అసంపూర్తిగా మిగిలిపోయిన పార్కింగ్ కాంప్లెక్స్‌ను సందర్శించిన మంత్రి సురేఖ అక్కడి నుంచే ఫోన్ ద్వారా డీఈతో మాట్లాడి వెంటనే కాంప్లెక్స్ నిర్మాణాలకు సంబంధించి పూర్తి నివేదికను పంపాలని ఆదేశించారు.ఆలయంలో చోటు చేసుకుంటున్న అవకతవకలపై టీపీసీసీ ఉపాధ్యక్షురాలు డాక్టర్ కోట నీలిమ మంత్రి సురేఖకు వివరించారు.
మంత్రి స్వయంగా ఆదేశించినప్పటికీ ఇప్పటికీ ఆలయ ఈవో శేఖర్, సూపరింటెండెంట్ హైమావతిలకు సస్పెన్షన్ ఉత్తర్వులు ఇవ్వకపోవడం వెనక ఏం జరుగుతున్నదంటూ దేవాదాయశాఖలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సిబ్బంది తొలగింపు, అర్చకునికి మెమో విషయంలో వేగంగా స్పందించిన ఆ ఇద్దరు దేవాదాయ ఉన్నతాధికారులు ఆలయంలో అవకతవకలు, అక్రమాలకు బాధ్యత వహించాల్సిన ఈవో, సూపరింటెండెంట్లను కాపాడడానికి ప్రయత్నిస్తున్నారని, ఈ క్రమంలో శుక్రవారం రాత్రి వరకు దేవాలయంలోనే ఉండి ఈ నలుగురు చర్చలు జరిపినట్లు సమాచారం.