మహాయోగి దున్న ఇద్ధాస్ ప్రబోధించిన నేల. అక్క మహాదేవి నడయాడిన నేల. పుట్టపాగ మహేంద్రనాథ్, ఎస్ జైపాల్‌రెడ్డి, సురవరం సుధాకర్‌రెడ్డి, పాలెం సుబ్బయ్యల పురిటిగడ్డ. కుల రహిత సమాజానికి, సర్వ మానవ సౌభ్రాతృత్వానికి, సామాజిక వికాసానికి ఎందరో కారణజన్ములు జన్మించిన కందనూలు (నాగర్ కర్నూల్) నేలలో కుల అహంకారానికి రెండు నెలల పసిపాప బలికావడం మానవత్వానికి మచ్చ. కుల వివక్షకు వ్యతిరేకంగా పత్రికలు, ప్రజా వేదికలు, సంఘాలు నిత్యం రాస్తూ మాట్లాడుతూనే ఉన్నాయి. బుద్ధుడు, ఫూలే, అంబేద్కర్, కబీర్ నారాయణ, గురు సంత్ రవిదాస్ వంటి మహనీయుల బోధనలు నిత్యం ప్రతిధ్వనిస్తున్నా, కులం పేరుతో దూషిస్తూ అంటరానితనం పాటించడం నేరమని ఘోషిస్తున్నా అడుగడుగునా కులోన్మాదం పడగెత్తడం అమానవీయం.
పసికూనలు దేవుళ్లతో సమానం కాలెత్తి ఎలా తన్నబుద్ధయింది ఆడబిడ్డంటే అమ్మగదా! అమ్మనెట్లా చంపబుద్ధవుతుంది దేవుడు అందరికీ సమానమే కదా వెలివేతలెందుకు మల్లన్న దేవుడు ఓ కులం జాగీరా?
కాంగ్రెస్ ప్రజా పాలనలో ప్రజలకు శాంతిభద్రతలు ఎండమావులు అయ్యా యి. ముఖ్యంగా బీసీలు, ఎస్సీలపై దాడు లు, అక్రమ కేసులు ఎక్కువయ్యాయి. తెలంగాణ సభ్యసమాజం తలదించుకునేటట్టుగా ప్రజలకు రక్షణగా ఉండాల్సిన కొంతమంది పోలీసులు నేరస్తులకు అండగ ఉండటం విచారకరం. అధికార పార్టీ నాయకుల మెప్పుకోసం నిబంధనలను నిదితులను గాలికి వదిలేసిన ఘటన కుమ్మెర దేవాలయ జాతరలో జరిగింది.
‘నా భర్తను కొట్టకండయ్యా.. పచ్చిబాలింతను.. రెండు నెలల పసికందు నా బిడ్డ ముఖమన్నా చూడండి.. మీ కాల్మొక్కుత’ అని కాళ్లమీద పడి చిలికేశ్వరం గణేశ్ భార్య మౌనిక వేడుకున్నా కనికరించని కుల దురహంకారులు కాళ్లతో తన్నడంతో పసిబిడ్డ మృతి చెందింది. ఈ అనాగరిక ఘటనతో రాష్ట్రమంతా అట్టుడుకిపోతున్నా కనీసం స్పందించని కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ దుర్మార్గానికి నిదర్శనంగా నిలుస్తున్నది.
జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుమ్మెర గ్రామంలో ఏటా శివరాత్రి సమయంలో (మల్లికార్జునుడు) మల్లన్న దేవుడి జాతర జరుగుతుంది. ఈ నెల 18న గ్రామానికి చెందిన రజక సామాజిక వర్గానికి చెందిన చంద్రకళ, కీర్తి , చిలికేశ్వరం గణేశ్, మౌనిక దైవదర్శనం కోసం వెళ్లారు. రజక వర్గానికి చెందిన చిలికేశ్వరం గణేశ్, దళిత సామాజిక వర్గానికి చెందిన మౌనికది కులాంతర వివాహం. రెండు నెలల పాప ఉన్నది.
ఆలయానికి వెళ్లిన సమయంలో వంద రూపాయలు ఎంట్రీ టికెట్ విషయంలో ఆలయ నిర్వాహకులకు గణేశ్‌కు మధ్య వాదన జరిగగింది. ‘గ్రామంలో జరుగుతున్న జాతరకు స్థానికులకు టికెట్ లేదు కదా, మేము దేవుణ్ని మొక్కుతాం’ అని అన్నారు. ‘ఇంతకుముందు దర్శించుకున్నోల్లెవరూ డబ్బులు ఇవ్వలేదు కదా.. అందరూ ఉచితంగానే దర్శనం చేసుకుంటున్నారు. మమ్మల్నే ఎందుకు డబ్బులు అడుగుతున్నారు? అని అడిగారు. ‘మమ్మల్నే నిలదీస్తవా’ అంటూ అహంకారంతో నిర్వాహకులు ఆలయం తలుపులు మూసేశారు. దేవాలయ జాతర నిర్వాహకులైన ఒకే వర్గానికి చెందిన పలువురు గణేశ్‌పై దాడికి పాల్పడ్డారు. కులం ఆధారంగా ఆలయ ప్రవేశానికి నిరాకరించారని వారిపై జరిగిన అనాగరిక దాడిని బట్టి తెలుస్తున్నది. ఇప్పుడు ఆ తల్లి ముఖంలో చూడండి భరతమాత గోసను.. ఆ తల్లి గర్భశోకాన్ని ఏ దేవుడు తీర్చుతాడు… ఏ ఆలయ నిర్వాహకులు ఓదార్చుతారు.
శ్రీనివాస్‌రెడ్డిపై గణేశ్ చేసిన దూషణలతో కూడిన ఆడియో క్లిప్ గ్రామ వాట్సాప్ గ్రూప్‌లో ప్రచారమైందని, దానికి మీరే కారణమంటూ విద్వేషం పెంచుకున్న ఆ ఊరి గ్రామ పెత్తందారులు గణేశ్‌ను పిలిపించారు. అక్కడే ఉన్న కొబ్బరికాయల గదిలో అతనిని నిర్బంధించి తీవ్రంగా కొట్టారు. ఆ దెబ్బలకు తాళలేక లేక అరుస్తుంటే అతని భార్య మౌనిక, తల్లి చంద్రకళ కన్నీరుమున్నీరయ్యారు. తన భర్తను వదిలిపెట్టండని మౌనిక ఎంత ప్రాధేయపడినా కనికరించలేదు సరికదా.. కాలుతో తన్నడంతో ఆ తల్లి చేతుల్లోని రెండు నెలల పసిపాప కింద పడిపోయింది. బాధితులు వెంటనే పసిబిడ్డను ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వైద్యం అందుతూనే ఈ నెల 21న చిన్నారి మరణించింది. కుల అహంకార దాడి.. పసి బిడ్డను బలి తీసుకున్నది.
తెలంగాణలో ప్రజాపాలన అని చెప్పుకొంటూ పాలన సాగిస్తున్న కాంగ్రెస్.. రాచరికపు పాలనను చూపిస్తున్నది. నల్లగొండ, సూర్యాపేటలో ఇలాంటి అహంకార పాలననే నడుస్తున్నది. వెలుగులోకి రాని ఘటనలెన్నో… నిందితులు స్థానిక శాసనసభ్యుడికి, అధికార పార్టీకి వత్తాసు పలుకడంతో బాధితులిచ్చిన ఫిర్యాదుపై సకాలంలో పోలీసులు స్పందించకపోగా బాధితులపైనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు పెట్టడం ఎంత దుర్మార్గం. బీసీల్లో సామాజిక చైతన్యం రావాలి. అప్పుడే సామాజిక న్యాయం సాధ్యమవుతుంది. చైతన్యం లేకపోవడం వల్ల కూడా అవమానిస్తూ దాడులు, హత్యలు చేస్తున్న దాడులు పెరుగుతున్నాయి. తిరిగి బాధితులపైనే కేసులు మోపుతున్నారని అనడానికి కుమ్మెర ఆలయం వద్ద ఘటనే సాక్ష్యం. కుమ్మెర ఘటనతో రాష్ట్రమంతా అట్టుడుకుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా కూడా లేదు. ముగ్గురు నిందితు లను అరెస్టు చేశామని, మిగతా ఐదుగురు పరారీలో ఉన్నారని చెప్తూ పోలీసులు చేతులు దులుపుకొంటున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ బాలిక కుటుంబ సభ్యులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ప్రజా సంఘాలు, ప్రతిపక్షాల నేతలు ఆదివారం నుంచి వరుసగా ధర్నాలు చేస్తున్నారు.
సమాజం, ప్రభుత్వం ఒక తల్లిలా, ఒక తండ్రిలా వ్యవహరించాలి. పేద వర్గాల వారిని కులాలు, ప్రాంతాలు, భక్తి పేరుతో వివక్ష చూపిస్తూ ఆధిపత్యవర్గాల వారికే కొమ్ము కాస్తూ సమాజ వికాసానికి విరుద్ధంగా నిలబడటం చరిత్రకు విద్రోహం.
భారత రాజ్యాంగంలో చెప్పినట్టు ప్రతి మనిషికి ఒకే విలువ. ఒకే ఓటు, ఒకే గౌరవం అనే సూత్రాలు మహోన్నతమైనవి. ఆ సమానత్వాన్ని కలకాలం నిలబెట్టాలి. సమాన అవకాశాలు, సమాన గౌరవాలు కల్పించిననాడే మన ప్రజాస్వామ్యం నిజమైన ప్రజాస్వామ్యంగా నిలబడగలుగుతుంది. ఇక కుమ్మెరలో చిన్నారి మృతి విషాదకరం. ఈ ఘటనపై సీఎం రేవంత్ నోరు తెరువకపోవడం విచారకరం. ఇప్పటికైనా స్పందించి, బాధిత కుటుంబాన్ని పరామర్శించాలని డిమాండ్ చేస్తున్నాం.