CM KCR | గజ్వేల్, మార్చి 24: పరాయి పాలనలో దుర్భిక్షం రాజ్యమేలిన నేల ఇప్పుడు సుభిక్షం నెలకొన్నది. సీమాంధ్రుల పాలనలో నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాంతం ఇప్పుడు సస్యశ్యామల గీతి ఆలపిస్తున్నది. దీనంతటికీ కారణం ఒక్కడే! ఆయనే రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. స్వరాష్ట్ర కాంక్షను నెరవేర్చి సీఎంగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ గజ్వేల్ ప్రాంతం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏ రాష్ట్రంలోనూ చేపట్టని అనేక కొత్త పథకాలు, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారానికి వేదికైన గజ్వేల్ నేడు యావత్తు దేశానికి మోడల్‌గా రూపుదిద్దుకున్నది. వివిధ రాష్ర్టాల అధికారులు, ప్రజాప్రతినిధులకు గజ్వేల్ ఒక ప్రయోగశాలగా మారింది. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు కృషి ఫలితంగా ఎవరూ ఊహించనతంగా గజ్వేల్ రూపురేఖలు మారిపోయాయి.
గజ్వేల్ రైల్వే స్టేషన్
సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు కృషి ఫలితంగా గజ్వేల్ ప్రజల ఎన్నో ఏండ్ల రైలు కల నెరవేరింది. మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు రైలు మార్గం కోసం సీఎం కేసీఆర్ రాష్ట్ర వాటాను కేటాయించారు. రూ.1160కోట్ల అంచనాతో పనులు ప్రారంభించి మొదటి దశలో మనోహరాబాద్ నుంచి గజ్వేల్ వరకు 31 కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేశారు. ప్రస్తుతం గజ్వేల్‌కు గూడ్స్ రైలులో ఎరువులు రేక్ పాయింట్‌కు చేరుతున్నాయి. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఇక్కడి నుంచే ఎరువులు సరఫరా అవుతున్నాయి. గజ్వేల్ నుంచి దుద్దెడ వరకు రెండో దశ పనులు వేగంగా సాగుతున్నాయి. రైలు రాకతో ఈ ప్రాంతంలో విరివిగా పరిశ్రమలు ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి.
గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగు, వర్గల్, కొండపాక, మర్కూక్, జగదేవ్‌పూర్ మండల కేంద్రాల్లో ప్రభుత్వం సమీకృత ప్రభుత్వ కార్యాలయాల (ఐవోసీ) నిర్మాణం కొనసాగుతున్నది. ఒక్కో ఐవోసీ భవనానికి రూ.5 కోట్లు వెచ్చించి నిర్మాణాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.
గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఆర్అండ్బీ రోడ్లకు మరమ్మతు, కొత్తగా వేయడంతో నేడు అద్దంలా కనిపిస్తున్నాయి. ప్రతి మండల కేంద్రంలో నాలుగు వరుసల రోడ్డుతోపాటు బటర్ ైైప్లె లైట్ల ఏర్పాటుతో రాత్రి సమయంలో వెన్నెల వికసించినట్లు కనిపిస్తున్నాయి. రూ.719.50 కోట్లతో 354.41 కిలోమీటర్ల రోడ్లు నేడు గజ్వేల్ పరిధిలో రెండు వరుసలుగా మారాయి.
గజ్వేల్ రింగ్‌రోడ్డు
సీఎం కేసీఆర్ గజ్వేల్ పట్టణం చుట్టూ 22 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం రూ.230 కోట్లు మంజూరు చేశారు. రైల్వే బ్రిడ్జి వద్ద 1.6 కిలో మీటర్ల మేర పనులు పెండింగ్‌లో ఉండగా, మిగతావి శరవేగంగా పూర్తి చేశారు. ఔటర్ రింగ్‌రోడ్డులో 11 జంక్షన్లు నిర్మిస్తుండగా, ఈ రోడ్డులో 15 కిలోమీటర్ల వరకు 4 లైన్లు, మిగతావి ఆరు వరుసలుగా విస్తరిస్తున్నారు. రిమ్మనగూడ, శ్రీగిరిపల్లి, పాతూర్ సమీపంలో బ్రిడ్జిల పనులు పూర్తయ్యాయి. ఇరువైపులా జంక్షన్లు నిర్మించి అందులో ఆకర్షణీయమైన విదేశీ మొక్కలు నాటారు.
పాండవుల చెరువు మినీ ట్యాంక్‌బండ్
మిషన్ కాకతీయలో భాగంగా గజ్వేల్ పాండవుల చెరువును రూ.8.59 కోట్లు వెచ్చించి మినీట్యాంక్‌బండ్‌గా మార్చారు. సీఎం కేసీఆర్ స్వయంగా ఈ కట్టను పరిశీలించి మరమ్మతులు చేసేలా దిశానిర్ధేశం చేశారు. ప్రజ్ఞాఫూర్ చెరువును రూ.5 కోట్లతో ట్యాంక్‌బండ్‌గా మార్చుతున్నారు.
మర్కూక్ మండలంలోని కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్
సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషి ఫలితంగా గజ్వేల్ నియోజకవర్గం పరిధిలో కొత్తగా ఏర్పాటైన మర్కూక్ మండలంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. మర్కూక్‌లో రూ.14 కోట్లతో అత్యాధునిక హంగులతో పోలీస్‌స్టేషన్, సిబ్బంది వసతి గృహాలు, ప్రభుత్వ దవాఖాన, రూ.2 కోట్లతో కస్తూర్బా పాఠశాల నిర్మించారు. రెండెకరాల విస్తీర్ణంలో రూ.20 లక్షలతో బృహత్ పల్లె ప్రకృతి వనం, సీఎం కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవల్లిలో రూ.కోటితో పాఠశాల భవనాలు నిర్మించారు. మండల కేంద్రం నుంచి గ్రామాలకు డబుల్ రోడ్లను నిర్మించారు. 15 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన కొండపోచమ్మ ప్రాజెక్టు పరిసరాలను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది.
మర్కూక్ మండలం ఎర్రవల్లిలో సీఎం కేసీఆర్ రైతువేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో అన్ని క్లస్టర్ల పరిధిలోని పనులు త్వరితగతిన పూర్తి చేశారు. గజ్వేల్, ములుగు వ్యవసాయ డివిజన్ పరిధిలోని తొమ్మిది మండలాల్లో ఒక్కో రైతువేదిక నిర్మాణానికి రూ.22 లక్షలు వెచ్చించి 40 రైతు వేదికలకు నిర్మించింది.
మహా నగరాల్లో కనిపించే అందమైన కళాక్షేత్ర భవనాలు నేడు రాష్ట్రంలోని చిన్నపాటి పట్టణాల్లో కనిపించేలా సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో నిర్మించారు. గజ్వేల్ పట్టణంలో రెండు ఎకరాల విస్తీర్ణంలో రూ.21.05 కోట్ల వ్యయంతో మహతి ఆడిటోరియం నిర్మించగా, హైదరాబాద్ రవీంద్రభారతి తరహాలో 1200 మందితో సభలు, సమావేశాలు నిర్వహించుకునేలా తీర్చిదిద్దారు.
గజ్వేల్‌లో నిర్మించిన 100 పడకల దవాఖానలో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో రోజు అవుట్ పేషెంట్ల సంఖ్య పెరుగుతున్నది. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు కృషి ఫలితంగా రూ.21.30 కోట్లతో నిర్మితమైన ఈ దవాఖానలో 24 గంటల పాటు వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి.
గజ్వేల్‌లోని రాజీవ్ రహదారి పక్కన పాతూర్ మార్కెట్
పట్టణంలోని సమీకృత కూరగాయల మార్కెట్‌ను సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో రూ.22.85 కోట్లతో ఆరు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించగా, 2019లో కూరగాయల వ్యాపారుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. మొత్తం 246 స్టాల్స్ ఉన్నాయి. ఈ సమీకృత మార్కెట్ నిర్వహణ బాగుండడంతో ఇటీవల ఎఫ్ఎస్ఎస్ఏఐ గుర్తింపు లభించింది. ఇక్కడ క్లాక్ టవర్‌ను ఎంతో అద్భుతంగా ముస్తాబు చేశారు. ప్రజ్ఞాపూర్ రాజీవ్ రాహదారిపై మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో రూ.కోటి వ్యయంతో అద్భుతంగా కూరగాయల మార్కెట్‌ను నిర్మించారు.
దళితబంధు పథకంతో గజ్వేల్ మండలం కొల్గూర్ గ్రామంలో 135 కుటుంబాలు లబ్ధి చేకూరింది. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు చొరవతో గ్రామాన్ని ఎంపిక చేయడంతో ప్రతి ఒక్కరికీ పథకంలో అవకాశం దక్కడంతో దళితులు సంబురపడుతున్నారు. ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వడంతో ట్రాక్టర్లు, వ్యాన్లు, కిరాణా, బ్యాంగిల్ స్టోర్, సెంట్రిగ్ సామగ్రి, టిఫిన్ సెంటర్, టెంట్‌హౌస్, డెయిరీ ఫాంలు నిర్వహిస్తూ జీవనోపాధి పొందుతున్నారు.
కోమటిబండ వద్ద మిషన్ భగీరథ ట్యాంకులు
శుద్ధమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథను ప్రారంభించింది. సీఎం కేసీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 1998లో సిద్దిపేట సమగ్ర తాగునీటి పథకం నుంచి ఈ ఆలోచన మొదలైంది. సుమారు రూ.400 కోట్లతో చేపట్టిన ఈ మిషన్ భగీరథ సీఎం కేసీఆర్ ఆలోచనతోనే గజ్వేల్ మండలం కోమటిబండ గుట్ట వద్ద పురుడుపోసుకుంది. అదే స్ఫూర్తితో తెలంగాణలోని అన్ని గ్రామాల్లో రోజు తాగునీరు అందిస్తున్నారు. మిషన్ భగీరథ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్ చేతుల మీదుగా 2016, ఆగస్టు 7న ప్రారంభించుకున్నాం.
ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి ఫలితంగా రూపుదిద్దుకున్న అర్బన్ పార్కు పర్యాటకుల మది దోస్తున్నది. విభిన్న రకాల మొక్కలు కనువిందు చేస్తున్నాయి. 117 హెక్టార్ల విస్తీర్ణంలో రూ.7.25 కోట్లతో దీన్ని ఏర్పాటు చేశారు. పద్మవ్యూహంలోకి వెళ్లినట్లు మొక్కలు కొత్త అనుభూతిని కలిగిస్తాయి. గజ్వేల్ ఐవోసీ భవనం సమీపంలోనే ఆక్సిజన్ పార్కును రూ.40 లక్షలతో ఏర్పాటు చేశారు.
సీఎం కేసీఆర్ కృషితో సంగాపూర్ వద్ద 60 ఎకరాల విస్తీర్ణంలో 1250 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను రూ.106 కోట్లతో నిర్మించారు. సకల వసతులతో ఈ కాలనీ ఏర్పడింది. వారం క్రితం 1100 ఇండ్లను అర్హులకు ఇండ్లను రెవెన్యూ అధికారులు కేటాయించారు. నియోజకవర్గంలోని తూప్రాన్‌తోపాటు మిగతా మండలా ల్లోనూ ఇండ్లు నిర్మించి ఇచ్చారు.
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక కృషితో రూ.146 కోట్లతో ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటుచేశారు. అత్యాధునిక హంగులతో ప్రభుత్వ డిగ్రీ, మహిళా డిగ్రీ కళాశాల భవనాలు వేర్వేరు క్యాంపస్‌లు నిర్మించారు. పట్టణ సమీపంలో మహిళా డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల వద్ద బాలుర డిగ్రీ కళాశాలలు నిర్మించారు. సమీకృతంగా భవనాలు నిర్మించడంతో విద్యార్థులకు ఎంతో సౌలత్గా ఉన్నాయి.
Gov Office
గజ్వేల్‌లో ఒకే చోట అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉండేలా సీఎం కేసీఆర్ చొరవతో సమీకృత కార్యాలయ భవనం అందుబాటులోకి వచ్చింది. హౌసింగ్ బోర్డు కాలనీ పక్కనే 6 ఎకరాల విస్తీర్ణంలో రూ.42.50 కోట్లతో రెండస్తుల భవనం నిర్మించారు. ఇందులో 45 ప్రభుత్వ శాఖల అధికారులు తమ విధులు నిర్వహిస్తున్నారు.