వర్గల్, మార్చి9: పరీక్షలు దగ్గరికొచ్చాయి.. చదువుకోమని తల్లి మందలించడంతో మనస్తాపం చెందిన ఓ విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
గౌరారం ఎస్సై కరుణాకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వర్గల్ మండలంలోని చాంద్ఖాన్ముక్త గ్రామానికి చెందిన మార్కంటి గోపాల్ రెడ్డి, కనకవ్వ దంపతుల కొడుకు విజయేందర్ రెడ్డి (16) చౌదరిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 6వ తేదీన కనకవ్వ పొలం వద్ద ఉండగా.. విజయేందర్ రెడ్డి అక్కడకు వెళ్లాడు. దీంతో అక్కడ కొడుకును చేసిన కనకవ్వ.. పరీక్షలు ఉండగా అటు, ఇటు ఖాళీగా ఎందుకు తిరుగుతున్నావని మందలించింది. ఇంటికెళ్లి చదువుకోమని సూచించింది. దీంతో మనస్తాపం చెందిన విజయేందర్ రెడ్డి.. పొలంలో ఉన్న పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన కనకవ్వ స్థానికుల సాయంతో గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో సికింద్రాబాద్లోని సన్షైన్ హాస్పిటల్కు తరలించారు. ఈ క్రమంలో అక్కడే చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి విజయేందర్ తుదిశ్వాస విడిచాడు.