సిద్దిపేట, మార్చి 11( నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై ఎక్కడికక్కడ చర్చపెట్టాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికలపై సోమవారం సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్య నాయకులతో ఆయన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ అలవికాని హామీలు ఇచ్చి గెద్దెనెక్కిన తర్వాత విస్మరించిందన్నారు. రైతుబంధు, రైతు రుణమాఫీ, వరికి బోనస్ హామీలు అమలు కావడం లేదన్నారు. ఆరోగ్యలక్ష్మి కింద రూ.10 లక్షల పెంపు రాష్ట్రంలో ఏ ఒకరికైనా ఇచ్చారా..? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పార్టీ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలన్నారు. మహిళల రూ.2,500 ఇస్తా అన్న మాట ఏమైందని ప్రశ్నించారు. డిసెంబర్ నుంచి రూ.4 వేల పింఛన్ ఇస్తామని 4 నెలలు అయినా ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో కరువు వచ్చిందని, ఎక్కడ చూసినా పంటలు ఎండిపోతున్నాయని, రైతుల పంటలను కాపాడడానికి ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదన్నారు. సాగునీటి కోసం రైతులు బోర్లు, బావులను తవ్వుతున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏనాడు బోరు బండ్లు కనపడలేదన్నారు. కరెంట్ కష్టాలు సైతం మొదలైనట్లు తెలిపారు. రైతుల మీద ఈ ప్రభుత్వానికి ఏమాత్రం ప్రేమ లేదన్నారు. కేసీఆర్ పాలనలో రైతులు ప్రశాంతంగా వ్యవసాయం చేసుకున్నట్లు హరీశ్‌రావు గుర్తుచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై అంతటా చర్చ మొదలైందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రె స్ అభ్యర్థులకు ఓటేస్తే వృథా అన్నారు. వారు గెలిచినా ఢిల్లీలో కాంగ్రెస్ వచ్చేది లేదన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చివాత పెట్టాలని రైతులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ హామీలు అమలు కావాలం టే బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశా రు. దేశంలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కాంగ్రెస్ పార్టీకి రాదన్నారు. బీజేపీ తెలంగాణకు ఏం చేయలేదని, ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదన్నారు. తెలంగాణకు ఒక నవోదయ సూల్ ఇవ్వలేదన్నారు. దేశంలో 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే మనకు ఒక మెడికల్ కాలేజీ ఇవ్వలేదన్నారు. ప్రజల గొంతుకగా మనం మాట్లాడుదాం.. ప్రజలు కేసీఆర్‌ను బీఆర్ఎస్ను కడుపులో పెట్టుకొని చూసుకుంటారన్నారు. రైతుల సంక్షేమం విషయంలో కేసీఆర్‌కు ఉన్న ప్రేమ కాంగ్రెస్‌కు ఎప్పటికీ ఉండదన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో సిద్దిపేట ప్రాంతం మంచి మెజార్టీ ఇచ్చి అగ్రస్థానంలో నిలవాలని పార్టీ కార్యకర్తలకు మాజీ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. సీరియస్‌గా పనిచేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. సిద్దిపేట అంటే ప్రత్యేకత ఉందని, అభివృద్ధి కాదు మెజార్టీలోనూ సిద్దిపేట ముందు ఉండాలన్నారు. పులివెందుల … కుప్పం… సిద్దిపేట అనే ప్రత్యేకత సాధించుకున్నట్లు తెలిపారు. మన అభివృద్ధిపై అకసు వెల్లబుచ్చింది ఇదే కాంగ్రెస్, బీజేపీ నాయకులే కాదా… అలాంటి వారికి ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. వచ్చే ఎన్నికల్లో కలిసి కట్టుగా పనిచేద్దామని హరీశ్‌రావు క్యాడర్‌కు పిలుపునిచ్చారు.