Suicide | రాయపోల్, ఆగస్టు 23: సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల ఉప్పరపల్లి గ్రామంలో ఓ రైతు ఉరివేసుకొని మృతి చెందిన ఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పరపల్లికి చెందిన పుట్ట సత్తయ్య(60) అప్పుల బాధతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో తీవ్ర నిరాశకు లోనైన అతను.. లింగరాజుపల్లికి చెందిన తన అల్లుడు మరికంటి స్వామికి ఫోన్ చేసి చనిపోతున్నానని చెప్పాడు. అనంతరం తన వ్యవసాయ పొలంలోని చింత చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
కాగా, సత్తయ్య ఆత్మహత్య చేసుకుంటున్నానని ఫోన్ చేసి చెప్పడంతో అల్లుడు స్వామి కంగారుపడ్డాడు. వెంటనే సత్తయ్య పెద్ద కుమారుడు పుట్ట నరేశ్‌కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో పుట్ట నరేశ్ పొలానికి వెళ్లి చూడగా.. చింతచెట్టుకు వేలాడుతున్న తండ్రి మృతదేహం కనిపించింది. మృతుని పెద్ద కొడుకు నరేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గజ్వేల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.