మహబూబ్‌నగర్ కలెక్టరేట్, మార్చి 4 : విద్యార్థి జీవితంలో పదో తరగతి కీలకమైన మలుపు. చదువులో విద్యార్థి సామర్థ్యానికి టెన్త్ క్లాస్ ఒక ప్రమాణాన్ని నిర్దేశిస్తోంది. ఈ సంవత్సరం టెన్త్ పబ్లిక్ పరీక్షలను నూతన విధానంలో నిర్వహించబోతున్నారు. విద్యార్థులు అనవసర భయాలను, ఆందోళనలను వీడి ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాస్తేనే విజేతలుగా నిలుస్తారు. జిల్లాలో ఈసారి 13,217 మంది విద్యార్థులు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాయనున్నారు. మార్చి 14 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ లెక్కన పరీక్షలకు తొమ్మిది రోజుల గడువు మాత్రమే ఉన్నది.
పరీక్షల విధానంలో మార్పులు
పదో తరగతి వార్షిక పరీక్షల విధానంలో ఈసారి మార్పులు చోటుచేసుకున్నాయి. గతేడాది వరకు వార్షిక పరీక్షలు ఆదివారాలు మినహాయించి వరుసగా నిర్వహించేవారు. ప్రస్తుతం మారిన విధానం ప్రకారం మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. పరీక్షలు మొదలయ్యాక హిందీ పరీక్షకు మధ్యలో మూడ్రోజుల సమయం ఉండనున్నది. ఈ రోజులు విద్యార్థులు పాఠశాలకు హాజరు కావాల్సి ఉంటుంది.
సబ్జెక్టు టీచర్ వారికి రోజుకు
మూడు పీరియడ్లు నిర్వహించి మెరుగైన మార్కులు సాధించేలా శిక్షణ ఇవ్వనున్నారు. మొదటి పీరియడ్‌లో రివిజన్, రెండో పీరియడ్‌లో ప్రాక్టీస్ టెస్ట్, మూడో పీరియడ్‌లో సమాధాన పత్రాలు దిద్ది తప్పులు సరిచేయడం వంటివి చేయనున్నారు. గంట సమయంలో 20 నిమిషాలు పాఠ్యాంశ బోధన, మరో 40 నిమిషాలు సమాధానాలు రాసేందుకు కేటాయిస్తారు. ఇలా ప్రతిరోజూ సబ్జెక్టు సాధన చేయిస్తారు. ఇలా ప్రతి పరీక్షకు మూడు నుంచి 5 రోజుల సమయం ఉండనున్నది.
పరీక్షల టైం టేబుల్ ఇలా..
14న ఫస్ట్ లాంగ్వేజ్, 18న సెకండ్ లాంగ్వేజ్, 23న ఇంగ్లిష్, 28న గణితం, ఏప్రిల్ 2న ఫిజిక్స్, ఏప్రిల్ 7న బయాలజీ, 13న సోషల్ స్టడీస్ పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 15న ఒకేషనల్ కోర్సు పేపర్-1 భాషా పరీక్ష, ఏప్రిల్ 16న ఒకేషనల్ కోర్సు పేపర్-2 భాషా పరీక్ష జరగనున్నది. పాలమూరు జిల్లాలో 13,217 మంది విద్యార్థులు పరీక్ష రాయనుండగా 60 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 20 మందికి ఒకరు చొప్పున ఇన్విజిలేటర్లను నియమించారు. ప్రశ్నా పత్రాలు భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూంలను గుర్తించారు. 60 మంది సర్కిల్ సిబ్బంది, 60 మంది సిట్టింగ్ స్కాడ్‌ల ద్వారా పర్య వేక్షణ ఉంటుందని అధికారులు తెలిపారు. ఒక్కో కేంద్రంలో ఒక చీఫ్ సూపరింటెండెంట్ (సీఎస్), ఒక డిపార్ట్ మెంటల్ అధికారిని (డీవో) నియమిస్తారు. పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.
స్థానం మెరుగు పడాలి
పరీక్షా కేంద్రాల వ ద్ద శౌచాలయాల వస తి అంతంతే ఉంటో ంది. కేంద్రాలకు వెళ్లేం దుకు సమయానికి బ స్సులు రాక ఎంతో మంది ప్రైవేట్ వాహ నాలను ఆశ్రయిస్తున్నారు. ఈ సారైనా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. గదుల్లో ఫ్యాన్లు, వెలుతురు, తాగునీటి వసతి కల్పించడంతోపాటు ఆర్టీసీ బస్సులు సమయానికి నడిపేలా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. జిల్లాలో ఉత్తీర్ణత శాతం పెరుగుతున్నా.. రాష్ట్రంలో జిల్లాల వారీగా చూస్తే వెనుకబాటుకు గురవుతోంది. 2022లో 85.30 శాతం ఉండగా, 2023లో 67.19 శాతం, 2024లో 87.34 శాతం, 2025లో 89.76 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈసారి జిల్లా స్థానం మెరుగు పడటంతోపాటు ఉత్తీర్ణతశాతం పెరగాల్సిన అవసరం ఉన్నది.
గ్యాప్ పీరియడ్‌ను వినియోగించుకోవాలి
మారిన నూతన పరీక్షల విధానంతో విద్యార్థులు అవగాహన పెంచుకోవాలి. గ్యాప్ పీరియడ్‌ను విద్యార్థులు వినియోగించుకోవాలి. గ్యాప్ పీరియడ్‌లో పాఠశాలల్లో ఉపాధ్యాయులు నిర్వహించే ప్రత్యేక తరగతులకు విద్యార్థులు తప్పక హాజరు కావాలి. పట్టుదలతో చదివి మంచి మార్కులు సాధించాలి. విద్యార్థులను వారి తల్లిదండ్రులు ప్రత్యేక తరగతులకు తప్పకుండా పంపించేలా చూడాలి.
– ప్రవీణ్‌కుమార్, డీఈవో, మహబూబ్‌నగర్