దుబ్బాక/మిరుదొడ్డి/తొగుట, ఫిబ్రవరి 22 : ‘నదికే కొత్త నడక నేర్పిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కింది. తెలంగాణ నడి బొడ్డున నదిలేని చోట రిజర్వాయర్ నిర్మించడం ఇదే తొలిసారి.. ఓ ఇంజినీర్లా ఎంతో దూరదృష్టితో సీఎం కేసీఆర్ తెలంగాణ భావితరాలకు సరిపడే నీటి వనరులను ఏర్పాటు చేశారు.. దేశంలో ఎక్కడా చేయలేని సహసోపేతంగా మల్లన్నసాగర్ నిర్మించారు’.. అని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా మల్లన్నసాగర్ ప్రారంభోత్సవ ఏర్పాటు పనులను మంగళవారం రాత్రి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌రావు పర్యవేక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో రెండో అతిపెద్ద రిజర్వాయర్ మల్లన్నసాగర్ సిద్దిపేట జిల్లాలో నిర్మించడం సంతోషకరమన్నారు. ఎక్కడైనా నదులు, పరీవాహక సమీప ప్రాంతాల్లో నిర్మించడం సహజమని, నది లేని చోట అర కిలో మీటరు ఎత్తులో ఉన్న తుక్కాపూర్ వద్ద మల్లన్నసాగర్‌లోకి నీరు తేవడం ఓ అద్భుత ఘట్టమని చెప్పారు. వర్షపు నీరు కూడవెల్లి వాగులోంచి గోదారిలోకి వెళ్లేదని, అదే గోదారి నీళ్లను తిరిగి తీసుకొచ్చి, నదికే కొత్త నడక నేర్పిన ఘనత మన సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఈ రిజయర్వాయర్తో జిల్లాకే కాకుండా చుట్టు పక్కల పది జిల్లాలకు శాశ్వతంగా సాగు, తాగు, పరిశ్రమల అవసరాలకు వినియోపడుతుందన్నారు. పక్కనే ఉన్న హైదరాబాద్ జంట నగరాలతో పాటు హల్దీ, ఘనపూర్, సింగూరుకు కూడా ఇక్కడి నుంచి నీటి సరఫరా చేయవచ్చన్నారు. దేశంలో అతి పెద్ద ప్రాజెక్టులుగా కాళేశ్వరం, మల్లన్నసాగర్ అనితెలిపారు.
కొంగుబంగారంలా..
కొంగు బంగారమైన కొమురెల్లి మల్లన్నసాగర్ మన సిద్దిపేట జిల్లాలో ఉండడం.. శివసత్తుల మాదిరిగా ఎగిసిపడే గంగమ్మ పరవళ్లతో రైతన్నల సాగునీటి కష్టాలు తీరనున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు కొమురెల్లి మల్లన్నగా నామకారణం చేసింది సీఎం కేసీఆర్ అని గుర్తు చేశారు. 15.75లక్షల ఎకరాలకు సాగునీరందించే అవకాశం ఉంటుందన్నారు. సీమాంధ్రుల పాలనలో ఈ ప్రాంతం బీడు భూములతో తంగేళ్లు మొలిచాయన్నారు. నేడు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ చెరువులు, కుంటలు నింపి, బీడు భూములను సస్యశ్యామలం చేశారన్నారు.
విమర్శకుల నోళ్లూ మూగపోయేలా..
మల్లన్నసాగర్ నిర్మాణ పనులకు భూ సేకరణ సమయంలో ఇక్కడ ప్రాజెక్టు కడుతారా? నీళ్లు తెస్తారా? అంటూ ఎగతాలి చేసినా కాంగ్రెస్, బీజే పీ నాయకుల నోళ్లూ మూయించేలా మల్లన్నసాగర్ ప్రాజెక్టును అద్భుతంగా నిర్మించామన్నారు. రియల్ ఎస్టేట్ కోసం భూ సేకరణ చేస్తున్నారని, ప్రాజెక్టు కానే కాదు.. రానే రాదు.. అన్న ఆ పార్టీ నాయకులు పత్తా లేకుండా పోయారన్నారు. ఓట్ల కోసం, అధికారం కోసం బీజేపీ రాజకీయం చేస్తే, ప్రజల సంక్షేమం కోసం టీఆర్ఎస్ పని చేస్తున్నదన్నారు. బీజేపీ తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తే, టీఆర్ఎస్ పరిపాలన, తెలంగాణ ప్రజల ఘనతను దేశానికే చాటిందన్నారు.
భూనిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిది..
ముఖ్యమంత్రి కేసీఆర్ భూ నిర్వాసితుల కుటుంబానికి చెందిన వారేనని, గతంలో వారి కుటంబం భూములు కోల్పోయారని గుర్తు చేశారు. ఆయనకు భూనిర్వాసితుల కష్టాలు, బా ధలు తెలుసన్నారు. ప్రాజెక్టులో భూములు కోల్పోయిన వారి త్యాగం మరువలేనిదన్నారు. వారి త్యాగం వెలకట్టలేనిదన్నారు. చట్ట ప్రకారం భూ నిర్వాసితులకు ఇంటి నిర్మాణం కోసం రూ. 1.20 లక్షలు ఇస్తే, మన సీఎం కేసీఆర్ ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షలతో డబుల్ బెడ్రూం ఇల్లు, అదనంగా రూ.1.20 లక్షలు మౌలిక వసతుల కోసం మంజూరు చేశారని తెలిపారు. మల్లన్నసాగర్ భూనిర్వాసితులకు రూ. 20 నుంచి రూ.25 లక్షల విలువైన ఇల్లును అందజేసి, అండగా నిలిచిందన్నారు.