హుస్నాబాద్, ఫిబ్రవరి 10: హుస్నాబాద్ దవాఖానకు మహర్దశ పట్టనున్నది. రాష్ట్ర ఆరోగ్య, ఆర్థికశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఇటీవల హుస్నాబాద్ పర్యటన సందర్భంగా దవాఖానకు వరాల జల్లు కురిపించారు. సాధారణ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంగా ఉన్న దవాఖాన 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌గా అప్‌గ్రేడ్ చేసి మరిన్ని సౌకర్యాలు కల్పిస్తూ అన్ని రకాల వైద్యసేవలను అందుబాటులోకి తెచ్చేందుకు మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ కృషి చేస్తున్నారు. దవాఖానకు 30 పడకల పాతభవనంతో పాటు 50 పడకల సామర్థ్యం ఉన్న నూతన భవనం నిర్మాణం పూర్తయింది. వీటిల్లో పూర్తిస్థాయిలో వైద్య సేవలందించే అవకాశం ఉన్నప్పటికీ పలు సాంకేతిక కారణాలతో సేవలు ప్రారంభం కాలేదు. నాలుగు రోజుల క్రితం ఆరోగ్యశాఖ మంత్రి హోదాలో హుస్నాబాద్‌కు మొట్టమొదటిసారి వచ్చిన హరీశ్‌రావు స్థానిక ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌తో కలిసి గంటన్నర పాటు వైద్యులు, వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించి దవాఖాన రూపురేఖలు మార్చేలా ప్రణాళికలు రూపొందించి పూర్తి స్థాయిలో అమలయ్యేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.హుస్నాబాద్ దవాఖానపై మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక దృష్టి సారించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
మంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన వైద్య విధాన పరిషత్ అధికారులు
హుస్నాబాద్ దవాఖాన అభివృద్ధి, వైద్య సేవల విస్తరణ కోసం చేయాల్సిన పనులు, అనుసరించాల్సిన విధానాలపై మంత్రి హరీశ్‌రావు దిశానిర్దేశం చేయడంతో వైద్యవిధాన పరిషత్ ఉన్నతాధికారులు రంగంలోకి దిగి మంత్రి హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నారు. ఆపరేషన్ థియేటర్లో లైటింగ్ సమస్యను పరిష్కరించారు. 30 పడకల అదనపు భవనం నిర్మాణం అంచనా కోసం ఇప్పటికే టీఎస్ఎంఐడీసీ ఇంజినీర్లు దవాఖాన ఆవరణను పరిశీలించారు. పాతభవనం మరమ్మతుల వ్యయాన్ని సైతం ఇంజినీర్లు అంచనా వేశారు. డిజిటల్ ఎక్స్‌రే మిషన్‌ను పంపుతున్నట్లు హైదరాబాద్‌లోని అధికారులు స్థానిక వైద్యాధికారులకు సమాచారం ఇచ్చారు. ఇప్పటికే దవాఖానలోని వార్డుల్లో ఆక్సిజన్ పైపులను అమర్చి ప్రతి బెడ్‌కూ కనెక్షన్ ఇచ్చారు.
ఆరు మండలాల ప్రజలకు ఎంతో ప్రయోజనం..
హుస్నాబాద్ నియోజకవర్గంలోని సుమారు ఆరు మండలాల ప్రజలకు ఈ దవాఖాన వైద్యసేవలందించే అవకాశం ఉంది. హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, చిగురుమామిడి, భీమదేవరపల్లి, సైదాపూర్ మండలాల ప్రజలు కరీంనగర్, వరంగల్, సిద్దిపేట దవాఖనలకు వెళ్లి చికిత్సలు చేయించుకుంటున్నారు. మంత్రి, ఎమ్మెల్యే కృషితో ఇక్కడ అన్ని రకాల వైద్య సేవలు త్వరలోనే ప్రారంభం కానున్నందున ఆయా మండలాల ప్రజలకు దూరభారం, ఖర్చులు తగ్గనున్నాయి. నియోజకవర్గంలో గిరిజనులు, పేద, మధ్య తరగతి ప్రజలు అధికంగా ఉండటం తో వీరికి సర్కారు వైద్యం ఎంతో అవసరమని గుర్తించిన మంత్రి హరీశ్‌రావు యూపీహెచ్గా ఉన్న దవాఖానను సీహెచ్‌సీగా అప్‌గ్రేడ్ చేయిస్తూ సెప్టెంబర్ 15, 2021న జీవో 136ను జారీ చేయించారు. దీంతో, ఈ దవాఖాన వైద్య విధాన పరిషత్ పరిధిలోకి వచ్చింది.
వైద్యులు అంకితభావంతో పనిచేయాలి..
ప్రజలకు సర్కారు దవాఖనల్లో సేవలపై నమ్మకం ఏర్పడాలంటే ఉన్నత ప్రమాణాలతో వైద్య సేవలను అందించాలని, వైద్యులు, సిబ్బంది అంకితభావంతో పనిచేసినప్పుడే అది నెరవేరుతుందని మంత్రి హరీశ్‌రావు ఇటీవల దవాఖానలో నిర్వహించిన సమీక్షలో సూచించారు. వార్డులు, పరికరాల నిర్వహణ సక్రమంగా ఉండాలని, వైద్యులు నిస్వార్థంగా సేవలందించినప్పుడే దవాఖానకు రోగులు వస్తారని చెప్పారు.
అన్ని రకాల వైద్యసేవలు..
హుస్నాబాద్ ప్రాంతంలో జనాభా పెరుగుతున్నది. అందుకనుగుణంగా నియోజకవర్గ కేంద్రంలోని సర్కారు దవాఖానను అప్‌గ్రేడ్ చేయాలని కోరగానే, వెంటనే స్పందించిన మంత్రి హరీశ్‌రావు మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేశారు. దవాఖానను అప్‌గ్రేడ్ చేయడంతో పాటు అదనపు భవన నిర్మాణం, వైద్య పరికరాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
-వొడితెల సతీశ్‌కుమార్, ఎమ్మెల్యే, హుస్నాబాద్
నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు కృషి..
హుస్నాబాద్ దవాఖాన వైద్య విధాన పరిషత్‌కు మారిపోయి అన్ని రకాల సౌకర్యాలు మెరుగుపడనుండడంతో రాబోయే రోజుల్లో నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు కృషిచేస్తాం. ఇందుకు వైద్యులు, వైద్య సిబ్బంది సహకారం తీసుకుంటాం. అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చినందున దవాఖాన రూపురేఖలు మారిపోతాయి.
-డాక్టర్ రమేశ్‌రెడ్డి, దవాఖాన పర్యవేక్షకుడు
మంత్రి వరాల జల్లు..
సాధారణ పీహెచ్సీగా ఉన్న దవాఖానను సీహెచ్‌సీగా అప్‌గ్రేడ్ చేయడంతో పాటు జిల్లా కేంద్రాల్లోని దవాఖానలకు దీటుగా సకల సౌకర్యాలు కల్పించేందుకు ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు హుస్నాబాద్ పర్యటన సందర్భంగా వరాల జల్లు కురిపించారు. నియోజకవర్గ కేంద్రంలో ఉండే ఈ దవాఖాన దాదాపు ఆరు మండలాల ప్రజలకు వైద్య సేవలందించే అవకాశం ఉంది.
1) ఇప్పటికే 30 పడకల సామర్థ్యంతో శిథిలావస్థలో ఉన్న పాతభవనం మరమ్మతులకు అంచనాలు పంపాలి.
2) పాతభవనం, 50పడకల సామర్థ్యంతో ఇప్పటికే నూతన భవనం ఉండగా, మరో 30 పడకలతో నూతన భవన నిర్మాణానికి కూడా వెంటనే ప్రతిపాదనలు పంపితే నిధులు మంజూరు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
3) కొత్తగా 10 పడకల సామర్థ్యం ఉన్న ఆధునిక సౌకర్యాలు కలిగిన ఐసీయూ.
4) ఐదు పడకలతో కిడ్నీ రోగుల కోసం డయాలసిస్ సెంటర్.
5) పది రోజుల్లో ఆపరేషన్ థియేటర్లో అన్ని రకాల సేవలు ప్రారంభం.
6) దవాఖానలో విద్యుత్ అంతరాయం లేకుండా జనరేటర్ మంజూరు.
7) ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంటుకు గ్రీన్ సిగ్నల్.
8) సెంట్రలైజ్డ్ పైపులైన్ ద్వారా ఆక్సిజన్ సరఫరాకు 20 ఆక్సిజన్ సిలిండర్లు మంజూరు.
9) అగ్నిప్రమాదాల నివారణకు ప్రత్యేక రక్షణ ఏర్పాట్ల కోసం నిధులు.
10) దవాఖానకు ప్రత్యేకంగా డిజిటల్ ఎక్స్-రే ప్లాంటు.
11) ఇప్పటికే దవాఖానలో ఉన్న ఎక్స్‌రే-మిషన్‌కు మరమ్మతులు, టెక్నీషియన్ నియామకం
12) బ్లడ్ స్టోరేజీ సెంటర్ ఏర్పాటు.
13) ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు, ఒక ఫార్మాసిస్టు పోస్టులు మంజూరు.
14) ప్రస్తుతం ఉన్న గైనకాలజిస్ట్‌కు అదనంగా మరొక పోస్టు, జనరల్ సర్జన్, రేడియాలజిస్టు పోస్టులు.
15) ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఎక్స్‌రే టెక్నీషియన్ల భర్తీ.
16) విద్యుత్ బకాయిలు చెల్లించేందుకు అధికారులకు ఆదేశాలు.
17) ప్రస్తుతం పనిచేస్తున్న 6 మంది శానిటేషన్ సిబ్బంది ఇక నుంచి సీహెచ్‌సీ పరిధిలోకి.
18) డైట్ పాలసీ మంజూరుకు హామీ.
19) డ్రగ్స్, సర్జికల్ మెటీరియల్ నిధులు పెంచేందుకు హామీ.
20) ఆర్థో ఆపరేషన్ల కోసం నూతన సాంకేతికత కలిగిన మిషన్ మంజూరు.
21) మార్చురీ ఆధునీకరణకు రూ.28.40లక్షల నిధులు మంజూరు.