సిద్దిపేట, ఏప్రిల్ 26: తెలంగాణ రాష్ట్ర సాదన కోసం ఉద్యమ గరిమనాభి అయిన సిద్దిపేటలోని పాత బస్టాండ్, నంగునూరు మండలం పాలమాకులలో చేపట్టిన దీక్షలు చరిత్రాత్మక ఘట్టంగా నిలిచాయి. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2009 నవంబర్‌లో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం.. కరీంనగర్ నుంచి సిద్దిపేటలోని రంగధాంపల్లి చౌరస్తాలో ఆమరణ నిరాహార దీక్ష కోసం బయలు దేరగా, కరీంనగర్ జిల్లా అలుగునూరు చౌరస్తాలో పోలీసులు అరెస్టు చేసి, ఖమ్మం జైలుకు తరలించడం.. సీఎం కేసీఆర్ ఆరోగ్యం విషమించడంతో తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించారు. సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు నాయకత్వంలో, జేఏసీ ఆధ్వర్యంలో సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద నవంబర్ 24 నుంచి తెలంగాణ కోసం నిరాహార దీక్షలు చేపట్టారు. సిద్దిపేట నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి రోజువారీగా మహిళా స్వయం సహాయక బృందాలు, యువజన, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక సంఘాల ఆధ్వర్యంలో 1531 రోజుల పాటు అనగా 2009 నవంబర్ నుంచి 2014లో పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదం పొందేవరకు నిరాహార దీక్షలు కొనసాగాయి. ఈ దీక్షలకు ఉద్యమ సారథి, సీఎం కేసీఆర్ పలుమార్లు సందర్శించి, ఉద్యమకారుల్లో నూతనోత్తేజం నింపారు. మంత్రి హరీశ్‌రావు నిత్యం పట్టణంలోని దీక్షలను పర్యవేక్షించారు. నిత్యం వినూత్న రీతిలో నిరసన తెలుపుతూ దీక్షలు సాగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, సిద్దిపేట పట్టణంలో దీక్షలు నిర్వహించిన స్థలంలో 2015 జూలై 4న పాత బస్టాండ్ వద్ద సీఎం కేసీఆర్ చేతుల మీదుగా దీక్షల స్మృతి చిహ్నంగా దీక్ష స్థలి పైలాన్ ఆవిష్కరించారు.
తెలంగాణ కోసం ఉద్యమ కాలంలో నంగునూరు మండలం పాలమాకుల గ్రామంలో మండల జేఎసీ ఆధ్వర్యంలో తెలంగాణ కోసం 1134 రోజుల పాటు దీక్షలు కొనసాగాయి. ఈ దీక్షల్లో మండలంలోని అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. ఉద్యమ నేత సీఎం కేసీఆర్ పాలమాకులలో జరుగుతున్న దీక్షలను సందర్శించి, ఉద్యమకారుల్లో ఉత్సాహం నింపారు. దీక్ష శిబిరం వద్ద గల పుస్తకంలోనూ సీఎం కేసీఆర్ సంతకం చేశారు. మంత్రి హరీశ్‌రావు ఉద్యమ సమయంలో నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించారు. ప్రజలతో కలిసి రోడ్డుపైనే సహపంక్తి భోజనాలు చేశారు. ఉద్యమ కాలంలో సిద్దిపేట పాత బస్టాండ్ , పాలమాకుల దీక్షలు తెలంగాణ చరిత్రలో మారుపురాని పేజీలుగా నిలిచాయి.
కోహీర్, ఏప్రిల్ 26 : సీఎం కేసీఆర్ చేపట్టిన తెలంగాణ ఉద్యమంలో కోహీర్ మండల ప్రజలు భాగస్వాములయ్యారు. మండలంలోని పలు సంఘాలు, పార్టీలు కలిసి జేఏసీగా ఏర్పడి ఉద్యమబాట పట్టాయి. దిగ్వాల్ గ్రామం వద్ద 65వ జాతీయ రహదారి పక్కన నిరాహార దీక్షలు చేశారు. జిల్లాలోని ప్రముఖ నాయకులు అక్కడకు వచ్చి దీక్షలకు మద్దతు తెలిపారు. 2011 జనవరి 23 నుంచి 31వ తేదీ వరకు పలు నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. జాతీయ రహదారిపై రాస్తారోకోలు నిరంతరంగా కొనసాగాయి. మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీంతో తెలంగాణ ఉద్యమంలో దిగ్వాల్ పేరు రాష్ట్రస్థాయిలో మార్మోగింది.
హత్నూర, ఏప్రిల్ 26 : ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా నిర్వహించిన ఉద్యమాలకు ఊపిరిపోసింది ఆ చౌరస్తా. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఉద్యమానికి ఆకర్షితులైన స్థానిక ఉద్యమకారులు నిత్యం ఏదో ఒక రూపంలో కేంద్రానికి నిరసనల సెగ తగిలేలా కార్యక్రమాలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలో ఎక్కడా లేని విధంగా హత్నూర మండలంలో ఉద్యమకారులు, విద్యార్థులు, యువకులు, రైతులు డప్పు కళాకారులు, ప్రతిఒక్కరూ దౌల్తాబాద్-కాసాల చౌరస్తాకు చేరుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు రోడ్డుపైనే వంటావార్పు, ధర్నాలు, రాస్తారోకోలు, చిందుకళాకారులతో నృత్యాలు చేయించి ఉద్యమం ఉధృతం చేసి నిరసనలు తెలిపారు. అదే సమయంలో తాము చేస్తున్న ఉద్యమానికి ఒక ప్రతిరూపం ఇవ్వాలన్న సంకల్పంతో దేవులపల్లి గ్రామానికి చెందిన అప్పటి రాష్ట్ర వికలాంగుల విభాగం అధ్యక్షుడు దివంగతనేత పుట్టి జనార్దన్‌రెడ్డి మండలంలోని దౌల్తాబాద్(కాసాల)చౌరస్తా వద్ద తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు శ్రీకారం చుట్టాడు. దీంతో, రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా ఆలయాన్ని తలపించేలా మండపం నిర్మించి మధ్యలో తెలంగాణతల్లి విగ్రహాన్ని నెలకొల్పారు. 2010 సెప్టెంబర్ 15న అప్పటి ఉద్యమకారుడు, ప్రస్తుత సీఎం కేసీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇప్పటికీ ఏ ఉద్యమం చేపట్టినా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలువేసి ఉద్యమాలు ప్రారంభిస్తుంటారు ఇక్కడి నాయకులు.