CV Ananda Bose : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని పశ్చిమ బెంగాల్ లోక్ భవన్ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఆయన రాజీనామాకు గల స్పష్టమైన కారణాలు తెలియరాలేదు. సీవీ ఆనంద బోస్ రాజీనామాపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు.
ఆయన రాజీనామా విషయం తెలిసి తాను షాకయ్యానని చెప్పారు. ‘‘గవర్నర్ రాజీనామాకు గల కారణం ప్రస్తుతానికి నాకు కూడా తెలియదు. ప్రస్తుత పరిస్థితుల్ని చూస్తుంటే నాకేమీ ఆశ్చర్యం అనిపించడం లేదు. త్వరలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి నుంచి ఆయన మీద రాజకీయపరమైన ఒత్తిడి ఉండొచ్చు. కొత్త గవర్నర్గా తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిని నియమిస్తున్నట్లు కేంద్ర మంత్రి నుంచి సమాచారం అందింది. గవర్నర్ తొలగింపు, కొత్త గవర్నర్ నియామకంలో కేంద్ర మంత్రి నన్ను సంప్రదించలేదు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. సహకార విధానానికి కేంద్రం తగిన గౌరవం, ప్రాధాన్యం ఇవ్వాలి. రాష్ట్రాల గౌరవాన్ని కాపాడాలి’’ అని మమత వ్యాఖ్యానించారు. ఇక.. గవర్నర్గా రాజీనామా చేసిన సీవీ ఆనంద బోస్ పశ్చిమ బెంగాల్లో మూడున్నరేళ్లు సేవలందించారు.
ఆయనకు, సీఎం మమతా బెనర్జీకి మధ్య అనేక విబేధాలు తలెత్తాయి. అందువల్లే గవర్నర్ల వ్యవస్థను మమత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆనంద బోస్ ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. ఆయన కేంద్ర మంత్రుల్ని తన రాజీనామా విషయంపై సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుంది.